"నన్ను వెళ్లిపోమంటారా?"– జూ.ఎన్టీఆర్ అసహనం
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటేనే తెరపై నటనా విశ్వరూపం, స్టేజీపై మాటలద్వారా ఆకట్టుకునే హీరో.
By: Tupaki Desk | 13 April 2025 8:42 AMప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటేనే తెరపై నటనా విశ్వరూపం, స్టేజీపై మాటలద్వారా ఆకట్టుకునే హీరో. అయితే నిన్న ‘అర్జున్ S/O వైజయంతి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆయన కాస్త అసహనం వ్యక్తం చేసిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అభిమానుల అతి ఉత్సాహం కారణంగా ఎన్టీఆర్ ఒక్కసారిగా సీరియస్‌గా స్పందించారు. ఇది ఆయన అభిమానులకు చిన్న షాక్ లాగా మారింది.
ఈవెంట్‌లో సీనియర్ నటి విజయశాంతి మాట్లాడుతుండగా, ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో కోసం చప్పట్లు, అరుపులతో హడావుడి చేస్తున్నారు. ఈ రకమైన హడావుడి వల్ల ఆమె మాటలు స్పష్టంగా వినిపించకపోవడంతో ఎన్టీఆర్ ఓపిక కోల్పోయినట్టు కనిపించాడు. “నేను వెళ్లిపోనా?” అంటూ స్టేజ్‌ను వీడేందుకు సిద్ధమవుతుండగా, విజయశాంతి అతన్ని శాంతపరచారు.
ఫ్యాన్స్ ఉత్సాహం హద్దు దాటినప్పుడు హీరోలు కూడా ఓ సమయంలో కంట్రోల్ కోల్పోవడం సహజమే, ఎన్టీఆర్ కూడా ఇలా స్పందించడమే ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది తొలిసారి కాదు. గతంలో కూడా పలు ఈవెంట్లలో స్టార్ హీరోలు తమ అభిమానుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మహేశ్ బాబు ఒకసారి తన సినిమా ప్రమోషన్‌లో అభిమానులు శాంతంగా ఉండకపోవడంతో వారిని పిలిచి శాంతించమన్న సందర్భం ఉంది.
పవన్ కల్యాణ్ సైతం ఒకసారి కార్యక్రమం మధ్యలో అభిమాని ప్రవర్తనతో కొంచెం ఇబ్బందికర పరిస్థితికి గురయ్యారు. ఎన్టీఆర్ కూడా గతంలో ఓ వేడుకలో అభిమానులను డిసిప్లిన్‌గా ఉండాలని కోరారు. ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో ఈవెంట్‌కు హాజరయ్యారు. వారిలో చాలా మంది నటుడు మాట్లాడుతుంటే పూర్తిగా శాంతించలేదు. ఈ తరహా ఉదంతాలు హీరోల మానసిక స్థితిని, మాట్లాడే ఫ్లోను దెబ్బతీస్తాయి.
అభిమానుల ప్రోత్సాహం అద్భుతమైనదే కానీ, ఇతరులను గౌరవించే తీరు కూడా అలానే ఉండాలి. స్టార్ హీరోలు ఎప్పుడూ అభిమానుల ప్రేమను మనసారా అంగీకరిస్తారు కానీ, అది మర్యాదల పరిమితుల్ని దాటకూడదన్నదే వారి అభిప్రాయం. ఈ ఘటనకు ఎన్టీఆర్ ఎలా స్పందించారన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొందరు ఫ్యాన్స్ “అన్నయ్య కోపపడినా అదీ ప్రేమ కోపం” అంటూ స్పందిస్తుండగా, మరికొందరు “ఇంకెప్పుడూ ఇలాచేయకూడదు” అని రియాక్ట్ అవుతున్నారు. దీనిని బట్టి చూస్తే, అభిమానులు సైతం తమ ప్రవర్తనను సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.