Begin typing your search above and press return to search.

తెలియకుండానే మనం చాలా నెగెటివ్ అయిపోయాం: ఎన్టీఆర్

అయితే ఇదంతా ఓ సర్కిల్ అని తారక్ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకుల మైండ్ సెట్ మారి ఎప్పటిలాగే మామూలుగా సినిమాలు చూసే రోజులు మళ్ళీ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసాడు.

By:  Tupaki Desk   |   10 Oct 2024 7:59 AM GMT
తెలియకుండానే మనం చాలా నెగెటివ్ అయిపోయాం: ఎన్టీఆర్
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ లో న‌టించిన పాన్ ఇండియా చిత్రం ‘దేవ‌ర‌’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. నిజానికి ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా యావరేజ్ గానే వచ్చాయి. సోషల్ మీడియాలో విపరీతంగా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. అయినా సరే వీటన్నిటినీ దాటుకొని ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నెగెటివ్ ట్రెండ్ పై తారక్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

'దేవర 1' సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, కొరటాల శివ.. ఈ మధ్య యాంకర్ సుమతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'దేవర' సినిమాని తన పిల్లలు బాగా ఎంజాయ్ చేసారని తారక్ తెలిపారు. తన సినిమానే కాదు ఏ మూవీ అయినా వాళ్లకు నచ్చుతుందని, కానీ ఇప్పుడు మనం చిన్న పిల్లల్లా అంత ప్లెయిన్ గా ఉండలేకపోతున్నామని అభిప్రాయ పడ్డారు. ఈరోజుల్లో అందరం బాగా నెగెటివ్ అయిపోయామని, ప్రతీ దాన్ని విశ్లేషించి జడ్జ్ చేస్తున్నామన్నామని అన్నారు.

''మనం సినిమా చూసేప్పుడు బోలేనన్ని కాలిక్యులేషన్స్ పెట్టుకుంటున్నాం. బేసిక్ గా అసలు మనకు తెలియకుండానే బాగాలేదు అనేయడం అలవాటు అయిపోయింది. నేనే కాదు, చాలామంది ఇలానే ఉన్నారు. లైఫ్ లో మనకు తెలియకుండానే చాలా నెగెటివ్ అయిపోయాం. నా పిల్లలు అభయ్, భార్గవ్ సినిమాలు చూస్తారు. నా సినిమానే కాదు, ఏ హీరో సినిమా అయినా వాళ్ళకి తెగ నచ్చేస్తుంది. అలానే నా భార్య ప్రణతికి కూడా ఏ సినిమా అయినా నచ్చుతుంది. సినిమా చూసేప్పుడు మనం అంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉండలేకపోతున్నాం?. ఇక్కడ మొదలైంది, అక్కడ మొదలైంది అంటూ ప్రతీ సినిమాని మనమేదో తూకాల ఇన్స్పెక్టర్ లాగా తూకం వేస్తున్నాం. ప్రతీ దాన్ని జడ్జ్ చేస్తున్నాం'' అని ఎన్టీఆర్ అన్నారు.

అయితే ఇదంతా ఓ సర్కిల్ అని తారక్ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకుల మైండ్ సెట్ మారి ఎప్పటిలాగే మామూలుగా సినిమాలు చూసే రోజులు మళ్ళీ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసాడు. ''నాకు తెలిసి ఏదైనా పరాకాష్టకు వెళ్లి కరెక్షన్ అయి మళ్ళీ తిరిగొస్తుంది. ఇది కూడా పరాకాష్టకు చేరింది అనుకుంటున్నాను. బహుశా కరెక్షన్ అయి మళ్ళీ తిరిగొస్తుందేమో'' అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ''ఈరోజుల్లో అందరూ ఒత్తిడికి లోనవుతూ పక్కన వాళ్ళు బాగుంది అంటే బాగుందని, బాగాలేదు అంటే బాలేదని అంటున్నాం. డిజిటల్ స్పేస్ లో ఇండిపెండెంట్ ఆలోచనలు పక్కన పెట్టేస్తున్నారు'' అని సుమ అంటుండగా.. సరిగ్గా చెప్పావంటూ తారక్ సమర్ధించారు.

ఇక 'దేవర 1' విషయానికొస్తే.. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేసారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. సైఫ్ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించగా.. శృతి మరాఠే, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, అజ‌య్‌, కలైరసన్, నరైన్, జరీనా వాహాబ్, తాళ్లూరి రాజేశ్వరి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం..10 రోజుల్లోనే రూ. 466 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కొరటాల శివ నెలన్నర రెస్ట్ తీసుకున్న తర్వాత 'దేవర 2' స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తారని చిత్ర బృందం తెలిపింది.