ఆ దేశంలో 'దేవర' గట్టిగానే..!
జపాన్‌లో సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో మీడియా వారికి, అక్కడి డిస్ట్రిబ్యూటర్స్‌కి ప్రత్యేక ప్రీమియర్ షోలు, ప్రివ్యూ షో లు వేయడం జరుగుతుంది.
By: Tupaki Desk | 18 March 2025 7:40 AMఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన 'దేవర' సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. టాక్‌తో సంబంధం లేకుండా దేవర సినిమా ఏకంగా రూ.450 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు యూనిట్ సభ్యులు అధికారికంగా పోస్టర్ విడుదల చేసిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో సోలో హీరోగా అత్యధిక వసూళ్లు రాబట్టిన దేవర సినిమాకి సీక్వెల్ రావాల్సి ఉంది. దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం సీక్వెల్ స్క్రిప్ట్ పనిలో ఉన్నాడని, ఇదే ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదిలో దేవర 2 సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరో వైపు దేవర సినిమాను జపాన్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈమధ్య కాలంలో తెలుగు సినిమాలకు జపాన్ దేశంలో మంచి స్పందన వస్తున్న విషయం తెల్సిందే. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా జపనీస్ సినిమాలను మించి వసూళ్లు రాబట్టింది. వంద రోజులు ఆడిన సినిమాగా కూడా ఆర్‌ఆర్‌ఆర్ జపాన్‌లో నిలిచింది. ఎన్టీఆర్‌కి జపాన్‌లో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే దేవర సినిమాను జపాన్‌లో భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 28న జపాన్‌లో అత్యధిక స్క్రీన్స్‌లో దేవర సినిమాను విడుదల చేయబోతున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ మార్చి 22న జపాన్‌లో పర్యటించబోతున్నాడు. దాదాపు రెండు రోజుల పాటు అక్కడ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటాడని తెలుస్తోంది.
జపాన్‌లో సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో మీడియా వారికి, అక్కడి డిస్ట్రిబ్యూటర్స్‌కి ప్రత్యేక ప్రీమియర్ షోలు, ప్రివ్యూ షో లు వేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఒక ప్రైవేట్ ప్రివ్యూ షో ను ఇటీవల వేశారు. ఆ షో కి మంచి స్పందన దక్కింది. సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. జపనీస్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమా ఉంటుంది అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అక్కడ దేవర సినిమా గట్టిగానే కొట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రివ్యూ చూసిన వారితో పాటు, కొందరు జపనీస్ సినీ విశ్లేషకులు సైతం సోషల్ మీడియా ద్వారా పోస్ట్‌లు పెడుతూ ఎన్టీఆర్ సినిమా గురించి ప్రచారం చేస్తున్నారు.
దేవర సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో నటించిన దేవర సినిమా తెలుగులో మంచి వసూళ్లు రాబట్టిన హిందీలో మాత్రం ఆశించిన స్థాయిలో అలరించలేదు. కొరటాల శివ సినిమాను రెండు పార్ట్‌లుగా మార్చడంతో కథ స్ట్రాంగ్‌గా అనిపించలేదు అనే కామెంట్స్ వచ్చాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించారు. మిక్కిలినేని సుధాకర్ సైతం ఈ సినిమా నిర్మాతగా వ్యవహరించారు. జపాన్‌లో ఈ సినిమా సాధించబోతున్న వసూళ్లపై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో చాలా అంచనాలు ఉన్నాయి. మరి అంతటి అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా అనేది చూడాలి.