Begin typing your search above and press return to search.

'ఎన్టీఆర్ ఎలాంటి సాయం చెయ్యలేదు'.. అభిమాని తల్లి ఆవేదన

అయితే ఇప్పటి వరకూ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి సహాయం అందలేదని బాలుడి తల్లి చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   23 Dec 2024 11:40 AM GMT
ఎన్టీఆర్ ఎలాంటి సాయం చెయ్యలేదు.. అభిమాని తల్లి ఆవేదన
X

'దేవర' విడుదల సమయంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న తన వీరాభిమానితో హీరో జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా మాట్లాడిన వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. తిరుపతికి చెందిన 19 ఏళ్ల యువకుడు కౌశిక్ గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. కౌశిక్ తో మాట్లాడిన తారక్.. వైద్యానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి సహాయం అందలేదని బాలుడి తల్లి చెబుతున్నారు.

కౌశిక్ కు చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చికిత్స జరుగుతోంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఖర్చు అవ్వగా.. ఏపీ ప్రభుత్వం, టీటీడీ నుంచి సహాయం అందినట్లుగా బాలుడి తల్లి సరస్వతి తాజాగా మీడియాకి తెలిపింది. ఆదుకుంటామని చెప్పిన ఎన్టీఆర్ నుంచి తమకు ఎలాంటి ఆర్ధిక సాయం అందలేదని చెప్పింది. ప్రస్తుతం తన కుమారుడి ఆరోగ్యం కాస్త నిలకడగా ఉండటంతో, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెబుతున్నారని, కానీ ఇంకా 20 లక్షల రూపాయలు కట్టమని అడుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

"జూనియర్ ఎన్టీఆర్ నుంచి మాకేమీ ఆర్థిక సాయం అందలేదు. ఆయన అభిమానులు మాత్రం రెండున్నర లక్ష వరకూ సహాయం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 11 లక్షలు, టీటీడీ నుంచి 40 లక్షలు సాయం అందింది. కీమో థెరపీ చేసిన తర్వాత అబ్బాయి ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడింది. హార్ట్, లంగ్స్ ఇన్ఫెక్షన్ తగ్గింది. మరో 20 లక్షలు కడితే డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ లో చెప్పారు. ఎన్టీఆర్ తో వీడియో కాల్ మాట్లాడించిన కృష్ణ యాదవ్ అనే వ్యక్తిని కలిసి, ఏదైనా హెల్ప్ చేయమని అడిగాం. ఆయన గవర్నమెంట్ దగ్గరకు వెళ్ళమని చెప్పారు. ఎన్టీఆర్ అకౌంటెంట్ అని ఒకాయన నంబర్ ఇచ్చారు. ఫోన్ చేసి మాట్లాడితే 'టీటీడీ వాళ్ళు ఇచ్చారు కదా.. మమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వొద్దని చెప్పారు' అని అన్నారు" అని కౌశిక్ తల్లి చెప్పుకొచ్చింది.

క్యాన్సర్‌తో పోరాడుతున్న కౌశిక్.. 'దేవర' చిత్రం విడుదలయ్యే వరకు తనను బతికించాలని వైద్యులను వేడుకున్నాడని చెబుతూ బాలుడి తల్లిదండ్రులు రెండు నెలల క్రితం మీడియాకి వెల్లడించారు. తమ కుమారుడి పరిస్థితిని వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, అది ఎన్టీఆర్ వరకూ చేరింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కౌశిక్‍తో వీడియో కాల్ ద్వారా మాట్లాడి, అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. సినిమాలు తర్వాత, ముందు ధైర్యంగా బయటికి రావాలి. అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి అని అన్నారు.

కౌశిక్ వైద్యానికి కావాల్సిన సాయం చేస్తానని ఎన్టీఆర్ ఆరోజు బాలుడి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. కానీ ట్రీట్‍మెంట్ కోసం ఆయన్నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని తెలుస్తోంది. తమ కుమారుడిని డిశ్చార్జ్ చెయ్యాలంటే ఇంకా ఇరవై లక్షలు ఆసుపత్రికి చెల్లించాలని, సహాయం చేసి తమను ఆదుకోవాలని వేడుకుంటూ కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చింది. మరి ఈ విషయంపై ఎన్టీఆర్ లేదా ఆయన టీమ్ స్పందిస్తారేమో చూడాలి.