ఎన్టీఆర్ హిందీలో 3 సినిమాల డీల్? 'దేవర 2' లేనట్టేనా?
ముఖ్యంగా హిందీ బెల్ట్ లో భారీ చిత్రాలకు సంతకాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.
By: Tupaki Desk | 25 Nov 2024 5:30 AM GMTఆర్.ఆర్.ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. కొమరం భీమ్ పాత్రలో అతడి అసమాన నటప్రతిభకు, 'నాటు నాటు'లో అద్భుత నృత్య నైపుణ్యానికి ప్రశంసలు కురిపించని ప్రముఖుడు లేడు. అందుకే అతడిని ప్రతిభకు తగ్గ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తన సహచరుడు రామ్ చరణ్ తో పోలిస్తే 'యంగ్ యమ' యమ దూకుడుగా ఉన్నాడు. పాన్ ఇండియాలో వరుస పెట్టి సంచలన చిత్రాలకు సంతకాలు చేస్తున్నాడు. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో భారీ చిత్రాలకు సంతకాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.
తారక్ టైమింగ్ నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. తారక్ వేగం ఇతరులు అందుకోలేనంత దూకుడుగా ఉంది. యష్ రాజ్ ఫిలింస్ లో హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2'లో అవకాశం అందుకోవడం అతడి అసాధారణ ప్రతిభపై నమ్మకానికి గీటు రాయి. అయితే వార్ 2తో తారక్ పని ముగియలేదు. అతడిని వరుసగా మూడు చిత్రాలకు యష్ రాజ్ ఫిలింస్ లాక్ చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ బ్యానర్ లో రెండో సినిమా చేసేందుకు తారక్ చర్చలు జరుపుతున్నారని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ స్ప్రెడ్ అవుతోంది. వార్ 2తో పాటు మరో రెండు చిత్రాలకు యష్ రాజ్ ఫిలింస్ అతడిని లాక్ చేసేందుకు ప్రణాళికల్లో ఉంది. ఈ బ్యానర్ తన హీరోలతో ఎప్పుడూ మూడు సినిమాల డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. అందులో భాగంగానే తారక్ తో రెండో సినిమా మూడో సినిమాకు సంతకం చేయించుకునేందుకు ఆస్కారం ఉందని గుసగుస వినిపిస్తోంది. ఎన్టీఆర్ మరో భారీ ప్రాజెక్ట్ కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు హిందీ సినీ వర్గాలలో టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు తారక్ కి స్క్రిప్ట్ వినిపించారని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం 2025 చివరి నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. దర్శకుడి పేరును ఇంకా రివీల్ చేయలేదు. యష్ రాజ్ ఫిల్మ్స్ జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రాజెక్ట్‌ను సమన్వయం చేస్తోందని సమాచారం.
ఆసక్తికరంగా యష్ రాజ్ ఫిల్మ్స్ మూడు చిత్రాల ఒప్పందం కోసం స్టార్‌లతో సంతకం చేస్తుంది. ఇలాంటి ఏర్పాటుకు ఎన్టీఆర్ అంగీకరించాడా లేదా అనేది అస్పష్టంగానే ఉంది. అయితే అతి త్వరలో తన రెండో హిందీ సినిమాకు సైన్ చేసే అవకాశం ఉంది.
దేవర సీక్వెల్ .. కొరటాల క్లారిటీ ఇస్తారా?
ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కించిన యాక్షన్ చిత్రం 'దేవర'కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించిన సంగతి విధితమే. ఎన్టీఆర్ అద్భుతమైన స్టార్ పవర్ తో భారీ ఓపెనింగులు సాధ్యమైనా కానీ ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి కూడా మిశ్రమ స్పందనలే వ్యక్తమయ్యాయి. కానీ పార్ట్- 1 రిలీజ్ కి ముందే కొరటాల శివ ఈ చిత్రానికి సీక్వెల్‌ను కూడా ప్రకటించాడు. సినిమా విడుదలకు ముందే ఇది రెండు భాగాల ఫ్రాంచైజీ అని వెల్లడించారు. ఇప్పుడు సీక్వెల్ గురించి కొరటాల ఆలోచిస్తున్నారా? లేదా? అన్నది సస్పెన్స్ లో ఉంది.
దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన దేవర 292.36 కోట్ల ఇండియా వైడ్ నెట్ వసూలు చేసిందని ట్రేడ్ వెల్లడించింది. హిందీ బాక్సాఫీస్ వద్ద దాదాపు 62.12 కోట్ల వసూళ్లు రాబట్టినా కానీ, సినిమా ఓవరాల్ గా నిరాశపరిచింది. ప్రస్తుతం ఎన్టీఆర్ 'వార్ 2'.. ఆ తర్వాత సెట్స్ కి వెళ్లే ప్రశాంత్ నీల్ 'డ్రాగన్'పైనా ప్రధానంగా దృష్టి సారించాడని తెలుస్తోంది. వార్ 2 తర్వాత తారక్ మరో యష్ రాజ్ సినిమాకి పని చేస్తున్నారంటే దాని అర్థం అతడు దేవర సీక్వెల్ పై దృష్టి సారించకపోవడం వల్లనే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.