రాజమౌళి మిథ్ బ్రేకర్ అని చెప్పుకోవడం బాగుంది: ఎన్టీఆర్
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.
By: Tupaki Desk | 7 Oct 2024 2:50 PM GMTతెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇండియన్ సినిమాకి అందని ద్రాక్షలా మారిన ఆస్కార్ కలను సాకారం చేసి పెట్టిన దర్శక ధీరుడు రాజమౌళి. అయితే జక్కన్నతో సినిమా చేసి హిట్టు కొట్టిన ఏ హీరో అయినా ఆ వెంటనే ఫ్లాప్ రుచి చూస్తాడనే ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. ఇది నిజమే అని స్ట్రాంగ్ గా చెప్పుకునే విధంగా, ఇప్పటి వరకు రాజమౌళితో వర్క్ చేసిన హీరోలందరికీ ఈ అనుభవం ఎదురైంది. దీనిపై తాజాగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. రాజమౌళి మిథ్ బ్రేకర్ అనే కామెంట్స్ పై తనదైన శైలిలో మాట్లాడారు.
రాజమౌళి దర్శకత్వంలో నటించిన 'స్టూడెంట్ నెం.1' సినిమాతో ఎన్టీఆర్ హీరోగా తొలి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కానీ 'సుబ్బు'తో వెంటనే పరాజయాన్ని మూటగట్టుకున్నారు. 'సింహాద్రి' బ్లాక్ బస్టర్ హిట్టయిన తర్వాత ఆంధ్రావాలా, నా అల్లుడు, నరసింహుడు, సాంబ, అశోక్ లాంటి ఫ్లాప్స్ అందుకున్నారు. అలానే 'యమదొంగ' తర్వాత 'కంత్రి' లాంటి అట్టర్ ఫ్లాప్ వచ్చి పడింది. దీంతో RRR తర్వాత తారక్ నుంచి రాబోతున్న 'దేవర 1' చిత్రంపై అందరూ ఆసక్తి కనబరిచారు. ఇది కూడా రాజమౌళి సెంటిమెంటుకు బలి అవుతుందని నెగిటివ్ కామెంట్స్ చేసారు. కానీ ఎన్టీఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ నిలిచి వారందరినీ తప్పని ప్రూవ్ చేసింది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన యాక్షన్ థ్రిల్లర్ 'దేవర'. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రీమియర్ షోల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా దీనికి తగ్గట్టుగానే వచ్చాయి. అయినా సరే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడింది. 10 రోజుల్లోనే రూ. 460 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, 500 కోట్ల మైలురాయి దిశగా పయనిస్తోంది. దీంతో సినీ అభిమానులు తారక్ ను ఎస్.ఎస్. రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన హీరోగా, మిథ్ బ్రేకర్ గా అభివర్ణిస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాతోనే శాప విమోచనం జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై ఎన్టీఆర్ తాజాగా స్పందిస్తూ, మనకు సరిగ్గా సినిమాలు తీసుకోవడం చేతకాక రాజమౌళిపై తోసేశామని అన్నారు.
'దేవర' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్, కొరటాల శివ.. లేటెస్టుగా యాంకర్ సుమతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోని కొన్ని మీమ్స్ చూపిస్తూ 'రాజమౌళి మిథ్ మీతోనే స్టార్ట్ అయింది.. మీతోనే బ్రేక్ అయిపోయింది' అని కామెంట్ చేసింది. దీనికి తారక్ రియాక్ట్ అవుతూ.. "మిత్ అంటేనే వాస్తవం కానిది. మనం కరెక్ట్ గా సినిమాలు చేసుకోలేక.. పాపం, రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి పోయిందని ఆయన మీద తోసేశాం. ఇది మనకు చేతకాక మనం క్రియేట్ చేసుకున్న ఒక మిథ్. కానీ మిథ్ బ్రేకర్ అనే మాట కొంచం బాగుంది. అది రియాలిటీలో లేకపోయినా, నిజంగా శాపం అనేది లేకపోయినా 'ఉంది.. దాన్ని మనం చేధించాం' అని చెప్పుకోవడం నాకు ఇంకా బాగుంది (నవ్వుతూ)'' అని చెప్పుకొచ్చారు. ఈ వీడియో క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.