Begin typing your search above and press return to search.

వార్ 2.. ఇది కిక్కిచ్చే న్యూస్

ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కాస్తా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడనే ప్రచారం నడుస్తోంది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 5:50 AM GMT
వార్ 2.. ఇది కిక్కిచ్చే న్యూస్
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ డెబ్యూ మూవీగా వార్ 2 సినిమా రెడీ అవుతోంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా ఈ సినిమాని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర మూవీతో అయాన్ ముఖర్జీ తెలుగు ప్రేక్షకులకి కూడా చేరువ అయిపోయారు. ప్రస్తుతం అయాన్ వార్ 2 మూవీ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కాస్తా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడనే ప్రచారం నడుస్తోంది.

దేవర తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమా ఇదే కావడంతో తారక్ ఫ్యాన్స్ వార్ 2 అప్డేట్స్ తెలుసుకోవడానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. దేవర రిలీజ్ తర్వాత తారక్ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి బిటౌన్ లో ఇంటరెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ లో వార్ 2 సినిమా స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజ్ లో భాగంగా తెరకెక్కుతోంది. ఇండియాలోనే ఇది అతి పెద్ద ఫ్రాంచైజ్ లలో ఒకటిగా ఉంది.

యష్ రాజ్ ఫిలిమ్స్ లోనే గతంలో ధూమ్ సిరీస్ లుగా మూడు సినిమాలు వచ్చాయి. ధూమ్ ఫ్రాంచైజ్ చిత్రాలకి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇందులో హీరో క్యారెక్టర్ కంటే విలన్ క్యారెక్టర్ కి ఎక్కువ ఆదరణ ఉంటుంది. స్టార్ హీరోలు ధూమ్ సిరీస్ లు విలన్స్ గా నటించారు. ధూమ్ 1లో జాన్ అబ్రహం, ధూమ్ 2లో హృతిక్ రోషన్, ధూమ్ 3లో అమీర్ ఖాన్ నటించారు. ఇప్పుడు యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఆదిత్య చోప్రా ధూమ్ 4కి ప్లాన్ చేస్తున్నారంట.

ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలని ఆదిత్య చోప్రా అయాన్ ముఖర్జీకి అప్పగించారంట. వార్ 2 మూవీ షూటింగ్ రషెస్ చూసిన తర్వాత అయాన్ వర్క్ విషయంలో ఆదిత్య చోప్రా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారంట. వార్ 2చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని భావించి ఇప్పుడు ధూమ్ 4 బాధ్యతలు అతనికే అప్పగించినట్లు బిటౌన్ లో టాక్ వినిపిస్తోంది. ధూమ్ 4 సినిమా దర్శకత్వం చేసే ఛాన్స్ ని అయాన్ ముఖర్జీ అందుకోవడంతో వార్ 2పై అంచనాలు పెరిగాయి.

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో వార్ మూవీ వచ్చి సూపర్ హిట్ అయ్యింది. దానికి సీక్వెల్ గా వార్ 2 మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయంట. ఈ చిత్రంలో తారక్ బాలీవుడ్ లో జెండా పాతడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.