Begin typing your search above and press return to search.

నా కోసం వాళ్లు బాధపడ్డారు.. సైమాలో ఎన్టీఆర్‌ ఎమోషనల్‌

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) 2023 దుబాయ్‌ వేదికగా గ్రాండ్​గా జరుగుతోంది.

By:  Tupaki Desk   |   16 Sep 2023 5:52 AM GMT
నా కోసం వాళ్లు బాధపడ్డారు.. సైమాలో ఎన్టీఆర్‌ ఎమోషనల్‌
X

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) 2023 దుబాయ్‌ వేదికగా గ్రాండ్​గా జరుగుతోంది. ఈ వేడుకల్లో నటీనటులు హాజరై సందడి చేస్తున్నారు. అయితే ఈ వేడుకల్లో ఆర్ఆర్ఆర్‌లో తన నటనకుగానూ బెస్ట్ యాక్టర్​గా ఎన్టీఆర్‌ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే.

అయితే అవార్డు అందుకున్న సందర్భంగా ఎన్టీఆర్ స్టేజ్​పై కాస్త ఎమోషనల్​గా మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు అభిమానుల హృదయాలను తాకుతున్నాయి. రాజమౌళితో పాటు అభిమానులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులకు పాదాభివందనాలు తెలిపారు. రామ్​చరణ్​ గురించి కూడా ప్రస్తావించారు.

"కొమరం భీమ్ పాత్రకు నన్ను మళ్ళీ మళ్ళీ మళ్లీ నమ్మినందుకు నా జక్కన్నకు థాంక్స్. నా కో స్టార్​, మై బ్రదర్​, ఫ్రెండ్​ రామ్ చరణ్​కు కూడా ధన్యవాదాలు. నా అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు... నా కళ్ల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్ళు కూడా బాధ పడినందుకు... నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు... నా అభిమాన సోదరులు అందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నాను.'' అని తారక్​ ఎమోషనల్​గా స్పీచ్ ఇచ్చారు. ప్రస్తుతం తారక్​ స్పీచ్​కు సంబంధించిన వీడియో క్లిప్​ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్​ కొమురం భీముడిగా మాస్​గా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ పాత్రలో ఆయన ఎంతో అద్భుతంగా నటించి ఏడ్పించేశారు. ఓ వైపు యాక్షన్ సన్నివేశాల్లో వీరోచితంగా కనిపిస్తూనే.. ఇతర సన్నివేశాల్లో తన నటనతో కంటతడి పెట్టించారు. మరీ ముఖ్యంగా 'కొమురం భీముడో' సాంగ్​లో ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆ పాటలో తన నటనతో గుండెల్ని పిండేశారు. ఆ నటనకుగానే ఇప్పుడాయనకు సైమా బెస్ట్ యాక్టర్ అవార్డ్ దక్కింది.

ప్రస్తుతం తారక్​ 'దేవర' చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. సినిమాలో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్​గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్​గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్​లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.