Begin typing your search above and press return to search.

దేవర.. బాలీవుడ్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సినిమా 'దేవర'.

By:  Tupaki Desk   |   26 July 2024 2:45 AM GMT
దేవర.. బాలీవుడ్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారా?
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ మరో రెండు నెలల్లో థియేటర్లలోకి రానుంది. భారీ బడ్జెట్ తో స్టార్ క్యాస్టింగ్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ యాక్షన్ థ్రిల్లర్ ను రూపొందిస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా మరో బాలీవుడ్ యాక్టర్ ఈ సినిమాలో భాగం కానున్నారనే వార్త వినిపిస్తోంది.

'దేవర' సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 'యానిమల్' మూవీలో ప్రతినాయకుడిగా మెప్పించిన బాబీ.. ప్రస్తుతం బాలయ్య 109వ చిత్రంలో నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అబ్బాయ్ సినిమాలోనూ నటించడానికి రెడీ అయ్యారని సమాచారం. అయితే బాబీ డియోల్ క్యారక్టర్ కు మొదటి భాగంలో పెద్దగా ప్రాధాన్యం లేదట. రెండో భాగంలో మెయిన్ విలన్ గా ఉంటారని టాక్.

నిజానికి పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత, ఇతర భాషల నటీనటులను తీసుకోవడం కంపల్సరీ అయింది. 'దేవర' మూవీలో ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ భాగమయ్యారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. తారక్ మాదిరిగానే సైఫ్ ది కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ కూడా వుంది. ఇక గుజరాతీ భామ శృతి మరాఠే, హిందీ నటుడు అభిమన్యు సింగ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఎన్టీఆర్ సినిమాలో ఇలా చాలా మంది హిందీ నటీనటులను తీసుకోవడం చూస్తుంటే.. 'దేవర' మేకర్స్ బాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు అర్థమవుతోంది. ఇది నార్త్ బెల్ట్ లో సినిమాకి కచ్ఛితంగా ప్లస్ అవుతుంది. కాకపోతే మన తెలుగు విషయానికొచ్చే సరికే ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. హిందీ ముఖాలు ఎక్కువగా కనిపించడం వల్ల నేటివిటీ మిస్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.

ఇంతకుముందు 'ఆదిపురుష్' విషయంలో ఇలానే జరిగింది. సినిమాలో ప్రభాస్ తప్ప మిగతా ప్రధాన పాత్రధారులందరూ హిందీ వాళ్ళే ఉన్నారు. దీని కారణంగా తెలుగులో రామాయణం చూస్తున్నామనే ఫీలింగ్ కలగలేదు. అదే సమయంలో ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' చిత్రంలోనూ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, మృణాల్ ఠాకూర్, శాశ్వత చటర్జీ, మీర్జాపూర్ అనిల్ జార్జ్ లాంటి బాలీవుడ్ నటీనటులు ఉన్నారు. ఇది హిందీలోనే కాదు, తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.

పై రెండు సినిమాలను ఉదాహరణగా తీసుకుంటే.. మంచి కంటెంట్ ఉండి, దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే ప్రేక్షకులు భాషా ప్రాంతీయత విషయాలను పట్టించుకోరనేది స్పష్టమవుతోంది. కాబట్టి కొరటాల శివ 'దేవర' చిత్రాన్ని యూనివర్సల్ గా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దితే చాలు.. ఎంతమంది బాలీవుడ్ ముఖాలున్నా సినిమాపై ఎలాంటి ప్రభావం చూపించదు. మరి దర్శకుడు ఎలా ఈ చిత్రాన్ని తెరక్కించారో తెలియాలంటే సెప్టెంబర్ 27 వరకూ ఆగాల్సిందే.