Begin typing your search above and press return to search.

హరికృష్ణ 67వ జయంతి... ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎమోషనల్ మెసేజ్!

ఈ రోజు నందమూరి హరికృష్ణ 67వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రాం లు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

By:  Tupaki Desk   |   2 Sep 2023 4:23 AM GMT
హరికృష్ణ 67వ జయంతి... ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎమోషనల్ మెసేజ్!
X

నిండైన ఆత్మీయతకు, ఆత్మాభిమానానికి ప్రతిరూపంగా అభిమానులు చెప్పే నందమూరి హరికృష్ణ 67వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రాం లు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నదమ్ములిద్దరూ ట్విటర్‌ ఒక సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఆ ట్వీట్ లో పోస్ట్ చేసిన ఫోటోలో... హరికృష్ణకు నివాళి అర్పిస్తూ ఓ హృద్యమైన సందేశాన్ని ఉంచారు ఎన్టీఆర్ - కల్యాణ్ రాం!


అవును... ఈ రోజు నందమూరి హరికృష్ణ 67వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రాం లు ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే - నందమూరి కల్యాణ్ రాం, నందమూరి తారక రామరావు" అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇలా అన్నదమ్ములు ఇద్దరూ తమ తండ్రిని స్మరించుకుంటూ చేసిన ట్వీట్లకు అభిమానులు ఆత్మీయంగా స్పందిస్తున్నారు. వాళ్లు కూడా తమ అభిమాని నటుడికి ఆన్ లైన్ వేదికగా అశ్రు నివాళి అర్పించారు.

సెప్టెంబర్ 2 1956లో జన్మించిన హరికృష్ణ... ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి వంశంలో అందరికంటే ముందే సినిమాల్లోకి వచ్చారు. 1967లో 11 ఏళ్ళ వయసులోనే బాల నటుడిగా తెరపై కనిపించారు. "శ్రీ కృష్ణావతారం", "తాతమ్మ కల" సినిమాలో నటించారు. అనంతరం "దాన వీర శూర కర్ణ" సినిమాను నిర్మించడమే కాకుండా అందులో నటించారు.

ఆ తర్వాత రామారావు రాజకీయాల్లోకి రావడంతో సుమారు రెండు దశాబ్దాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత.. సినిమాలపై ఫోకస్ చేసారు. ఈ క్రమంలో ఆయన నటించిన సినిమాల్లో... "దాన వీర శూర కర్ణ"లో అర్జునుడి పాత్ర అనంతరం... "శ్రీ రాములయ్య" సినిమాలో కామ్రేడ్ సత్యం పాత్ర హైలైట్ గా నిలిచింది.

ఆ తర్వాత... నాగార్జునతో కలిసి నటించిన "సీతారామరాజు" సినిమాలో సీతయ్య పాత్ర, "లాహిరి లాహిరి లాహిరి"లో కృష్ణమ నాయుడు, "సీతయ్య"లో సీతయ్య, "శివరామరాజు"లో ఆనంద భూపతి రాజు, "టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్" లో హరిశ్చంద్ర ప్రసాద్ పాత్రలు ఆయన కెరీర్ లో హైలైట్ గా నిలిచాయి!

కాగా... నందమూరి హరికృష్ణ ఆగస్ట్‌ 29 - 2018న నల్గొండ జిల్లా నార్కెట్‌ పల్లి దగ్గర జరిగిన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన డ్రైవ్ చేస్తున్న కారు బోల్తా పడటంతో హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో ఓ ఫంక్షన్‌ కు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.