ఎన్టీఆర్ అప్పుడు రాజకీయాల్లోకి వస్తాడు
ఈ విమర్శలపై ఎన్టీఆర్ మిత్రుడు రాజీవ్ కనకాల స్పందించింది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 13 Oct 2023 5:02 AM GMT'ఆర్ ఆర్ ఆర్'తో గ్లోబల్ స్టార్‌ల జాబితాలో చేరిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా?..అందుకే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై మౌనం పాటిస్తున్నారా? అంటే ఆయన మిత్రుడు, నటుడు రాజీవ్ కనకాల అవుననే సమాధానం చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తరువాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించడం లేదని, కనీసం చంద్రబాబు అరెస్ట్‌ని కండించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విమర్శలపై ఎన్టీఆర్ మిత్రుడు రాజీవ్ కనకాల స్పందించింది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉంటే ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతాడు. అదేదో సడెన్‌గా కాదు. పక్కా ప్లానింగ్‌తో చెబుతాడు. అతడికి రాజకీయ వారసత్వం ఉన్న సంగతి అందరికి తెలిసిందే. గతంలో తెలుగు దేశం పార్టీ కోసం ప్రచారం చేశాడు. చాలా స్పష్టంగా మాట్లాడాడు. తనదైన మాటలతో అందరిని ఉర్రూతలూగించాడు. అందరిని సమ్మోహితుల్ని చేశాడు.
లక్షల మంది ఉన్నా కూడా అతని స్పీచ్‌ని నివ్వెరపోయి చూశారు. రాజకీయాలపై ఎన్టీఆర్‌కు ఆసక్తి లేకుండా ఎందుకు ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉండకపోవచ్చు. ఇంకో ఐదేళ్ల తరువాత ఉండొచ్చు. అయితే ప్రస్తుతం మాత్రం ఎన్టీఆర్ ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందంటున్నారు రాజీవ్ కనకాల. ముందు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలని చెబుతున్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ మౌనంగా ఉండటం గురించి వివరిస్తూ 'ఆ విషయం తనకు తెలియదని, తారక్ తనకు ఏమీ చెప్పలేదన్నారు.
ఈ విషయంలో ఎన్టీఆర్‌పై జరుగుతున్న నెగిటివిటీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నాకు ఆ సంగతి తెలియదు. అందరూ నిజంగానే నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారా? లేదంటే కొంత మంది అదే పనిగా పెట్టుకుని అతనిపై నెగెటివ్ కామెంట్స్ పెట్టిస్తున్నారా? అనే విషయం నాకు అర్థం కావడం లేదు. ఈ విషయంలో ఎన్టీఆర్ కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నాడో నాకు తెలియదు. అలాగే చంద్రబాబు అరెస్ట్‌పై తారక్, కల్యాణ్‌రామ్ ఏం మాట్లాడుకున్నారో కూడా నాకు తెలియదు.
ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను తారక్‌ను కలవలేదు. ఏదైనా ఉంటే తారక్ నాతో చెబుతాడు. ఏదైనా స్పందించాలా వద్దా? అనే విషయం కూడా చెబుతాడు. తారక్ ఈ విషయంపై స్పందించకపోవడానికి నేను అనుకునే కారణం ఏంటంటే ఆర్ ఆర్ ఆర్‌కు ముందు, ఆ సినిమా షూటింగ్ టైమ్‌లో తారక్ 3 నుంచి 4 సినిమాలు చేయాల్సింది. అన్ని సినిమాల షెడ్యూల్స్ లేట్ కావడం, అదే టైమ్‌లో 'దేవర' సినిమాకు కూడా చాలా టైమ్ పడుతున్నందున ఎన్టీఆర్ ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని నా ఫీలింగ్ అని తెలిపారు.
అంతే కాకుండా ఎన్టీఆర్‌కు రాజకీయాల్లోకి రావడానికి ఇంకా చాలా టైమ్ ఉందని, అతనికి ఇంకా వయసు ఉందని, ఏదో ఒక టైమ్‌లో స్పష్టమైన ప్రకటన చేసి తారక్ రాజకీయాల్లోకి అడుగు పెడతాడని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు అరెస్ట్‌పై తారక్ ప్యూహాత్మకంగానే మౌనాన్ని పాటిస్తున్నాడేమో అంటూ ఎన్టీఆర్ గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.