తారక్.. ఒకేసారి రెండూ..
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది.
By: Tupaki Desk | 6 May 2024 11:30 AM GMTటాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. దీంతో ఆయన ఫ్యాన్స్.. తారక్ కొత్త సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా ఒక్కటి కూడా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. తారక్ నటిస్తున్న దేవర ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర మూవీ.. దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివర దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దేవర మేకర్స్.. క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో పాటు తారక్.. తన బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్-2 షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు.
బీ టౌన్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ వార్-2 మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ముంబైలోని యష్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియోస్ లో జరిగిన షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొన్న తారక్.. ఇటీవల హైదరాబాద్ తిరిగి వచ్చారు. మళ్లీ రీసెంట్ గా ముంబై చేరుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్, హీరో హృతిక్ రోషన్ మధ్య కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు, ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్.. విశాఖపట్నంలో జరుగుతోంది. విలన్ సైఫ్ అలీఖాన్ తో పాటు మరికొందరిపై ముఖ్యమైన సీన్స్ ను షూట్ చేస్తున్నారు మేకర్స్. ఇక తారక్.. వార్-2 తాజా షెడ్యూల్ ముగిశాక వైజాగ్ వెళ్తారని తెలుస్తోంది. దేవర షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. మొత్తానికి తారక్ రెండు సినిమాలు ఓకేసారి వేర్వేరు నగరాల్లో జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి.
అయితే సెలబ్రిటీల్లో చాలా మంది వేసవి సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్తుంటారు. కానీ తారక్ మాత్రం.. ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం తన సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. ఇక వార్-2 లో తారక్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యాక.. ప్రశాంత్ నీల్ తో చేయాల్సిన సినిమా చిత్రీకరణ ప్రారంభమవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మే 20వ తేదీన ఈ మూడు చిత్రాల అప్డేట్స్ రానున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆయా చిత్రాల మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో చూడాలి.