ఎట్టకేలకు యుద్ధం నుంచి ఎస్కేప్ అయిన నటి
అదే సమయంలో రాకెట్ దాడులు జరగ్గా తాను కూడా ఇతర ప్రజలతో పాటు నేలమాలిగ (అండర్ గ్రౌండ్) లోకి వెళ్లినట్టు నుస్రత్ వెల్లడించింది.
By: Tupaki Desk | 9 Oct 2023 4:32 AM GMTఇస్లామిక్ తీవ్రవాద గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై అక్టోబరు 07న మెరుపు దాడులతో ఆశ్చర్యపరిచింది. ఇజ్రాయెల్ గ్రామాలలోకి ప్రవేశించిన రాకెట్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో కనీసం 250మంది మరణించగా, 1500 మంది పైగా గాయపడ్డారని మీడియా నివేదిక అందింది. ఈ దాడుల్లో చాలా మంది ఇజ్రాయెల్ పౌరులను పాలస్తీనా ముష్కరులు బంధించారని కథనాలొచ్చాయి. అయితే ముష్కరుల ఆకస్మిక దాడిని ఇజ్రాయెల్ తిప్పి కొట్టింది. బందీలను తిరిగి గాజా స్ట్రిప్‌లోకి తీసుకువచ్చిందని మీడియాలో కథనాలొచ్చాయి.
అయితే ఈ దాడుల సమయంలో బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా యుద్ధ బాధిత ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోవడం కలకలం రేపింది. హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు నుష్రత్ ఇటీవల ఇజ్రాయెల్ కి వెళ్లారు. అదే సమయంలో రాకెట్ దాడులు జరగ్గా తాను కూడా ఇతర ప్రజలతో పాటు నేలమాలిగ (అండర్ గ్రౌండ్) లోకి వెళ్లినట్టు నుస్రత్ వెల్లడించింది. యుద్ధ సమయంలో భయంభయంగా గడిపినట్టు ఆమె బంధుమిత్రులు సోషల్ మీడియాల్లో వెల్లడించారు.
ఆ తర్వాత ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయం నుండి సహాయం అర్థించారు. అయితే శనివారం మధ్యాహ్నం నుంచి నుస్రత్ తో ఫోన్ కనెక్షన్ తెగిపోవడంతో ఇండియాలో తన కుటుంబీకుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వార్ జోన్ నుంచి విమానాశ్రయానికి వచ్చినా చాలా సేపు తను ఎక్కే విమానం కోసం వేచి చూసిందని కూడా తెలిసింది. చివరికి సహాయం పొందిన తరువాత నుష్రత్ అబుదాబి వయా కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా భారతదేశానికి తిరుగు పయనమైంది. తన ప్రయాణ దృశ్యాలు వైరల్ గా మారాయి.
నుష్రత్ భారుచా బృందం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. మేము చివరకు నుష్రత్ కి దగ్గరగా రాగలిగాం. ఎంబసీ సహాయంతో ఆమెను సురక్షితంగా స్వదేశానికి తీసుకువస్తున్నాం. మాకు డైరెక్ట్ ఫ్లైట్ రాలేదు కాబట్టి నుస్రత్ కనెక్టింగ్ ఫ్లైట్‌లో ఉంది. ఆమె మరింత భద్రత కోసం మరిన్ని వివరాలను షేర్ చేయడం సాధ్యం కాదు.. కానీ భారతదేశంలోకి వచ్చిన వెంటనే మేము మీకు తెలియజేస్తాము. మేము ఉపశమనం పొందాము. నుప్రత్ సురక్షితంగా ఉన్నందుకు దేవునికి ధన్యవాదాలు" అని తెలిపారు.
రాయిటర్స్ వివరాల ప్రకారం... పాలస్తీనా ఉగ్రమూకరుల దాడుల్లో కనీసం 250 మంది ఇజ్రాయిలీలు మరణించారు. 1500 మంది గాయపడినట్లు కథనాలొచ్చాయి. ప్రతీకార దాడులతో ఇజ్రాయెల్ ప్రతిస్పందించడంతో 230 మంది గాజన్లు కూడా మరణించారు. ఇజ్రాయెల్ తీరప్రాంత ఎన్‌క్లేవ్ లోపల భారీ వైమానిక దాడులతో ప్రతిస్పందించింది. ముష్కరులను చంపింది. వందలాది మంది ఈ యుద్ధంలో గాయపడ్డారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తమ ప్రజలను చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని, హమాస్‌ను శిథిలాలుగా మారుస్తామని అన్నారు.