అక్టోబర్ బాక్సాఫీస్: ఎన్ని హిట్టు, ఎన్ని ఫట్టు?
కాకపోతే నెలాఖరున విడుదలైన మూడు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఊపుతీసుకొచ్చాయి.
By: Tupaki Desk | 1 Nov 2024 11:54 AM GMTచూస్తుండగానే అక్టోబర్ నెల గడిచిపోయింది. ఈ ఏడాది ఒకే నెలలో దసరా, దీపావళి వంటి రెండు పెద్ద పండుగలు రావడంతో.. సినిమాలకు బాగా కలిసొస్తుందని అందరూ భావించారు. కానీ పెద్ద హీరోల సినిమాల విడుదలలు లేకపోవడం కాస్త నిరాశ కలిగించింది. సెప్టెంబర్ చివర్లో రిలీజైన ఎన్టీఆర్ 'దేవర 1' సినిమానే హాలిడేస్ ను క్యాష్ చేసుకొని, విజయదశమి వరకూ హవా కొనసాగించింది. మధ్యలో వచ్చిన చిన్న మీడియం రేంజ్ చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. కాకపోతే నెలాఖరున విడుదలైన మూడు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఊపుతీసుకొచ్చాయి.
అక్టోబర్ ఫస్ట్ వీక్ లో 'రామ్ నగర్ బన్నీ', 'కలి', 'మిస్టర్ సెలబ్రిటీ', 'బహిర్భూమి' లాంటి అర డజను చిన్న సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. అదే వారంలో శ్రీవిష్ణు 'శ్వాగ్' సినిమా కూడా వచ్చింది. హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. శ్రీవిష్ణు చాలా గెటప్స్ వేసి కష్టపడ్డప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర అనుకున్న విధంగా పర్ఫార్మ్ చేయలేకపోయింది. దసరా స్పెషల్ గా ఆ తర్వాతి వారంలో మరో ఆరు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కానీ, ఏదీ పెద్దగా క్లిక్ అవ్వలేదు.
11వ తారీఖున సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' సినిమా రిలీజయింది. తండ్రీకొడుల సెంటిమెంట్ తో తీసిన ఈ చిత్రానికి మంచి ప్రశంసలు దక్కాయి. కానీ దానికి తగ్గట్టుగా కలెక్షన్లు మాత్రం రాలేదు. అదే రోజున 'విశ్వం' మూవీ వచ్చింది. చాలా కాలంగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల కలిసి చేసిన సినిమా ఇది. దీనికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ మేకర్స్ మాత్రం సినిమా హిట్టయిందంటూ, మూడో వారంలో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసారు. ఇక అక్టోబర్ 12న 'జనక అయితే గనక' విడుదలైంది. సుహాస్ హీరోగా దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం నిరాశ పరిచింది.
రజనీకాంత్ నటించి 'వేట్టయన్' సినిమా దసరా వీక్ లోనే థియేటర్లలోకి వచ్చింది. అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ కాస్టింగ్ తో, జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో ఓ మాదిరిగా ఆడింది. అదే టైంలో వచ్చిన అలియా భట్ 'జిగ్రా' సినిమా డిజాస్టర్ గా మారింది. హైదరాబాద్ వచ్చి ప్రమోషన్స్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అలానే కన్నడ హీరో ధృవ సర్జా నటించిన 'మార్టిన్' మూవీ డబుల్ డిజాస్టర్ అయింది.
అక్టోబర్ మూడో వారంలో ఏడు చిన్నా చితక సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఫెయిల్యూర్ మీట్ ఈవెంట్ పెట్టిన 'లవ్ రెడ్డి' మూవీ ఒక్కటే జనాల దృష్టిలో పడింది. ప్రమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకున్న అనన్య నాగేళ్ల 'పొట్టేల్' మూవీ మరుసటి వారంలో వచ్చింది. జనాల దృష్టిని ఆకర్షించడమే కాదు, మంచి రివ్యూలు కూడా తెచ్చుకుంది. కానీ అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లు సాధించలేదు. అదే వీక్ లో రిలీజైన 'లగ్గం' 'నరుడి బ్రతుకు నటన' చిత్రాలు థియేటర్లలో పెద్దగా అలరించలేకపోయాయి. వీటితో పాటుగా వచ్చిన మరో రెండు సినిమాలను జనాలు పట్టించుకోలేదు.
దీపావళి కానుకగా అక్టోబర్ 31న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హీరోలు నటించిన నాలుగు సినిమాలు ఒకేసారి వచ్చాయి. రెండు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు ఉంటే, రెండు డబ్బింగ్ మూవీస్ వున్నాయి. అయితే వాటిల్లో మూడు చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చింది.. మంచి రివ్యూలు తెచ్చుకున్నాయి. దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో రూపొందిన 'లక్కీ భాస్కర్'.. కిరణ్ అబ్బవరం స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన 'క'.. శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన 'అమరన్' చిత్రాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వీటికి ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. ఇక ప్రశాంత్ నీల్ స్టోరీతో వచ్చిన 'బఘీర' సినిమా వైపు తెలుగు ఆడియన్స్ చూడలేదు.
ఓవరాల్ గా అక్టోబర్ నెలలో 26 తెలుగు సినిమాలు, 5 డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయి. వాటితో పాటుగా 'ఖడ్గం' 'మిస్టర్ పర్ఫెక్ట్' 'ఈశ్వర్' లాంటి కొన్ని పాత సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి కానీ, లిమిటెడ్ స్క్రీన్స్ కే పరిమితం అయ్యాయి. ఇన్ని సినిమాలు వచ్చినా నెలాఖరున పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూడు చిత్రాలు మాత్రమే, ఈ నెల హిట్ లిస్టులో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి ఏ రేంజ్ హిట్లు అవుతాయనేది నవంబర్ మొదటి వారంలో తేలిపోతుంది.