మలయాళ థ్రిల్లర్లకు సపరేట్ ఫ్యాన్ బేస్!
కుంచాకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఫిబ్రవరి 20న రిలీజై మంచి టాక్ ను తెచ్చుకుంది.
By: Tupaki Desk | 27 Feb 2025 5:11 PM ISTమలయాళ థ్రిల్లర్ గా వచ్చిన దృశ్యం సినిమా ఇండియన్ మూవీ హిస్టరీలోనే చాలా పెద్ద సక్సెస్ ను అందుకుంది. దృశ్యం మూవీ ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో తెరకెక్కి, కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. దృశ్యం సూపర్ హిట్ అవడంతో దృశ్యం2ను కూడా తీసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మలయాళ దృశ్యంలో మోహన్ లాల్ హీరోగా నటించాడు.
ఇదే సినిమాను బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో రీమేక్ చేసి అక్కడా బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. తెలుగు దృశ్యం లో విక్టరీ వెంకటేష్ నటించి, ఆయన కూడా రెండు సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. ఈ సక్సెస్ ను చూసే మేకర్స్ రీసెంట్ గానే మలయాళంలో దృశ్యం3 ని అనౌన్స్ చేశారు.
దృశ్యం3తో ఈ కథకు ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నాడట డైరెక్టర్ జీతూ జోసెఫ్. ఈ కథను ఎలా ముగించనున్నారో చూడాలని ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి మలయాళ, హిందీ, తెలుగు భాషల్లో దృశ్యం సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మలయాళం నుంచి ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే మరో మూవీ వచ్చింది.
కుంచాకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఫిబ్రవరి 20న రిలీజై మంచి టాక్ ను తెచ్చుకుంది. జిత్తు అష్రఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ కథ కొచ్చిలో సీఐగా పని చేస్తున్న హరి శంకర్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
ఎంతో స్ట్రిక్ట్ గా ఉండే హరి శంకర్, తన టీమ్ కూడా అలానే ఉండాలనుకుంటాడు. ఓసారి నకిలీ బంగారు ఆభరణాల కేసుని ఇన్విస్టిగేషన్ చేస్తున్నప్పుడు సెక్స్ రాకెట్, డ్రగ్స్ కేసులు బయటపడతాయి. కేసు ఇన్విస్టిగేషన్ టైమ్ లో ఆయన పడే ఇబ్బందులేంటి? నకిలీ ఆభరణాల కేసుకు, డ్రగ్స్ కు సంబంధమేంటనే నేపథ్యంలో సినిమా మొత్తం సస్పెన్స్ తో ఆడియన్స్ ను కట్టి పడేస్తుందని అంటున్నారు.
విమర్శకుల ప్రశంసలు పొందుతున్న ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఇప్పటికే రూ.30 కోట్లు వసూలు చేసి, మలయాళ థ్రిల్లర్ సినిమాలను సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని నిరూపించింది. ఆ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసిన మేకర్స్ ఇప్పుడు దానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.