Begin typing your search above and press return to search.

OG చేతులు మారుతుందా.. నిజమేమిటంటే..

ఇకపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓజీ సినిమాను నిర్మిస్తుందని ఓ వార్త సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 9:33 AM GMT
OG చేతులు మారుతుందా.. నిజమేమిటంటే..
X

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వకీల్ సాబ్ మూవీతో గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత భీమ్లా నాయక్, బ్రో వంటి చిత్రాలతో వచ్చి ప్రేక్షకులను అలరించారు. కానీ, ఈ సినిమాలు కమర్షియల్‌గా పవన్‌ను నిరాశనే మిగిల్చాయి.

ఇక ఎలాగైనా బిగ్ హిట్‌ను సొంతం చేసుకోవాలని ఫిక్స్ అయిన పవన్.. తన ఫ్యాన్ కమ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కు ఛాన్స్ ఇచ్చారు. మాఫియా బ్యాక్ డ్రాప్‌తో OG సినిమాకు సైన్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కొన్నిరోజుల క్రితం ముంబయిలో స్టార్ట్ అయింది. పవన్ సహా పలువురి నటీనటులపై కీలకమైన సీన్స్ కూడా షూట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తి కూడా అయింది. మేకర్స్ ఇచ్చిన అప్డేట్లతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

కానీ ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అప్పటి వరకు ఈ సినిమా షూట్‌లో పాల్గొనలేనని చెప్పేశారట. దీంతో ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం సుజిత్ కూడా ఓజీ ప‌నుల్లోనే బిజీగా ఉన్న‌ట్లు స‌మాచారం

ఇదంతా ఓకే కానీ.. ఈ సినిమాను మొదటి నుంచి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్.. ఇప్పుడు వేరొక సంస్థకు అప్పగించేసిందని వార్తలు వస్తున్నాయి. డీవీవీ సంస్థ.. పీపుల్స్ మీడియాకు ఈ సినిమాను ఇచ్చేసిందని, ఇకపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓజీ సినిమాను నిర్మిస్తుందని ఓ వార్త సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

ఇప్పుడు ఈ వార్తపై ఇరు నిర్మాణ సంస్థలు స్పందించాయి. అది ఫేక్ న్యూస్ అని తేల్చిచెప్పాయి. అసలు ఆ విషయంపై తమకు ఏం తెలియదని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చెప్పింది. మరోవైపు, ఈ సినిమాను అస్సలు వదులకోవడం లేదని డీవీవీ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఈ వారం కూడా సినిమాకు సంబంధించిన మీటింగ్ ఉందని తెలిపింది. దీంతో ఆ రూమర్లకు చెక్ పడినట్లైంది.

గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో కూడా ఇలాగే వార్తలు వచ్చాయి. ఉన్నపళంగా ఆ సినిమాను ఇచ్చేయాలని డీవీవీ సంస్థకు బాహుబలి మేకర్స్ భారీ అమౌంట్ ఆఫర్ చేసినట్లుగా టాక్ వచ్చింది. ఆ తర్వాత అది ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఓజీ విషయంలోనూ అలాగే వార్తలు వైరల్ అవుతుండటం గమనార్హం.