సుహాస్ రోమ్-కామ్.. 'ఓ భామ అయ్యో రామా' గ్లింప్స్..!
క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన సుహాస్.. హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
By: Tupaki Desk | 25 Dec 2024 9:21 AM GMTక్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన సుహాస్.. హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సబ్జెక్టులను ఎంచుకుంటూ ఆడియన్స్ ను అలరిస్తున్నాడు. సుహాస్ కథానాయకుడిగా నటిస్తున్న మరో విభిన్నమైన ప్రేమకథా చిత్రం ''ఓ భామ అయ్యో రామ''. ఇందులో మాళవిక మనోజ్ కథానాయికగా నటించింది. క్రిస్మస్ స్పెషల్ గా తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఒక రొమాంటిక్ సన్నివేశంతో ప్రారంభమైన ఈ వీడియో గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.
'ఓ భామ అయ్యో రామ' గ్లింప్స్ లో మాళవిక మనోజ్ తన ప్రియుడు సుహాస్ చేయి పట్టుకొని తీసుకెళ్లి, ఒక బ్యూటిఫుల్ వింటేజ్ కారులో కూర్చోబెడుతుంది. డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న మాళవిక.. 'దేవుడినైనా రాముడినైనా నడిపించేది ఆడదే' అంటుంది. సుహాస్ దానికి కౌంటర్ గా ''అందుకే కదా.. మీరు మా ప్రాణాలు తీస్తారు'' అంటూ నసుగుతాడు. ఏంటీ అని ఆమె కోపంతో చూడగా.. ''అందుకే కదా, మేం మీకు ప్రాణాలు ఇస్తాము'' అంటూ నవ్వుతూ మాట మారుస్తాడు. అయితే స్టార్ట్ చేసిన వెంటనే ఆ కారు ఆగిపోతుంది. ఏంటి చూస్తున్నావ్.. దిగి బండి తోయమని మాళవిక ఆర్డర్ వేయడంతో.. సుహాస్ చేసేదేమీలేక వెనక్కి వెళ్లి కారును నెట్టడంతో ఈ వీడియో ముగుస్తుంది. బ్యాగ్రౌండ్ లో ఒక పెద్ద ఇంటిని మనం చూడొచ్చు.
స్త్రీ పురుష లింగ బేధాలతో ప్రేమికుల మధ వచ్చే చిన్న చిన్న గొడవలతో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ''ఓ భామ అయ్యో రామ'' సినిమా తెరకెక్కుతునట్లు తెలుస్తోంది. ఫస్ట్ గ్లింప్స్‌లో సుహాస్ - మాళవిక మనోజ్ మధ్య జరిగే ఫన్నీ సిచ్యుయేషన్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. 'నువ్వు నేను' ఫేమ్ అనితా హస్సానందని ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ప్రభాస్ శ్రీను, అలీ, బబ్లూ పృథ్వీరాజ్, రవీందర్ విజయ్, రఘు కారుమంచి, మోయిన్, సాత్విక్ ఆనంద్, నయని పావని తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
''ఓ భామ అయ్యో రామ'' చిత్రానికి రామ్ గోధాల దర్శకత్వం వహిస్తున్నారు. వి ఆర్ట్స్ బ్యానర్ లో హరీష్ నల్లా నిర్మిస్తున్నారు. ఆనంద్ గడగోని, ప్రదీప్ తాళ్లపురెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రధన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఎస్. మణికందన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. భవిన్ షా ఎడిటర్ గా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు, ఆసక్తికరమైన అప్డేట్లు రాబోతున్నాయి.
'కలర్ ఫొటో' సినిమాతో హీరోగా పరిచయమైన సుహాస్.. తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ సాధించడంతో పాటుగా జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు', 'ప్రసన్న వదనం', 'గొర్రె పురాణం', 'జనక అయితే గనక' వంటి చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం 'కేబుల్ చారీ', 'ఆనందరావు అడ్వెంచర్స్', 'ఉప్పు కప్పురంబు' లాంటి సినిమాలలో నటిస్తున్న టాలెంటెడ్ యాక్టర్.. ''ఓ భామ అయ్యో రామా'' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.