'ఆదిపురుష్' తర్వాత రూటు మార్చాడు!
లోకమాన్య : ఏక్ యుగ్ పురుష్ సినిమాతో దర్శకుడిగా మారిన ఓం రౌత్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.
By: Tupaki Desk | 20 Dec 2024 9:30 AM GMTలోకమాన్య : ఏక్ యుగ్ పురుష్ సినిమాతో దర్శకుడిగా మారిన ఓం రౌత్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ సినిమా వచ్చిన ఐదేళ్ల తర్వాత అంటే 2020లో తన్హాజీ సినిమాతో మరోసారి దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో వెంటనే ప్రభాస్ తో 'ఆదిపురుష్' సినిమాను మొదలు పెట్టాడు. తన్హాజీ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆదిపురుష్ సినిమాతో కచ్చితంగా ఓం రౌత్ అలరిస్తాడని అంతా భావించారు. కానీ ఆయన ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాడు. రామాయణం అని చెప్పి మరేదో తీశాడు అంటూ ట్రోల్స్ వచ్చాయి.
ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ సినిమా ఓటీటీ ద్వారా వచ్చిన తర్వాత మరింతగా విమర్శలు వచ్చాయి. ఆ సినిమాను తీసినందుకు, చేసినందుకు ప్రభాస్‌ను జనాలు ఓ రేంజ్‌లో విమర్శించారు. అయినా ఓం రౌత్ వెంటనే మరో సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నాడు అనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు దర్శకుడిగా ఓం రౌత్ మరే సినిమాను మొదలు పెట్టలేదు. ప్రభాస్ మరో అవకాశం ఇచ్చాడు అనే వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఎట్టకేలకు ఓం రౌత్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు.
ఈసారి దర్శకుడిగా కాకుండా నిర్మాతగా ఆయన ప్రాజెక్ట్ రాబోతుంది. అది కూడా సినిమా కాకుండా ఒక వెబ్ సిరీస్‌గా ఆయన నుంచి రాబోతుంది. ప్రముఖ నటుడు, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ముఖ్య పాత్రలో ఇన్స్‌పెక్టర్ జెండే అనే పేరుతో వెబ్ సిరీస్‌ను రూపొందించబోతున్నారు. ఆ వెబ్ సిరీస్‌కి చిన్మయి మాండ్లేకర్ దర్శకత్వం వహించబోతున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ వెబ్ సిరీస్‌ను వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఆదిపురుష్ దెబ్బకి ఇంకా దర్శకుడిగా ఆఫర్‌ను ఓం రౌత్ దక్కించుకోలేక పోయాడు అని, ఆయన కథ చెప్పేందుకు వస్తానంటే హీరోలు బెంబేలెత్తిపోతున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన నిర్మాతగా వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధం అయ్యారనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఓం రౌత్ దర్శకుడిగానూ సినిమాను చేస్తాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. కానీ అది ఎప్పుడూ, ఎవరితో అనే విషయంలో మాత్రం వారు క్లారిటీ ఇవ్వడం లేదు. విభిన్నమైన కథాంశాలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్న ఓం రౌత్ తదుపరి సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది చూడాలి.