అప్పుడు ‘జాతిరత్నాలు’.. ఇప్పుడు ‘ఓం భీమ్ బుష్’
'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ‘ఓం భీమ్ బుష్’ సినిమా తెరకెక్కింది.
By: Tupaki Desk | 22 March 2024 10:26 AM GMTశివరాత్రి సినిమాల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి కనిపించలేదు. గత వారం అర డజనుకు పైగా చిత్రాలు విడుదలయ్యాయి కానీ, ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు. ఇలాంటి టైంలో ‘ఓం భీమ్ బుష్’ అంటూ థియేటర్లలోకి వచ్చారు శ్రీవిష్ణు. గతేడాది ‘సామజవరగమన’తో ఆడియన్స్ ను అలరించిన వర్సటైల్ యాక్టర్.. మరోసారి నవ్వించడమే పరమావధిగా పెట్టుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తోడుగా తన కామెడీ గ్యాంగ్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలను కూడా తీసుకొచ్చారు. ఎలాంటి పోటీ లేకుండా ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం, తొలి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. పాజిటివ్ మౌత్ టాక్ తో సమ్మర్ సీజన్ ను ప్రారంభించింది.
'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ‘ఓం భీమ్ బుష్’ సినిమా తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ తోనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ తో రాబోతున్నట్లు మేకర్స్ హామీ ఇచ్చారు. 'నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్' అనే ట్యాగ్ లైన్ తగ్గట్టుగానే, లాజిక్ తో సంబంధం లేకుండా కేవలం మ్యాజిక్ నే నమ్ముకుని తీసిన చిత్రమిది. ఆ జోనర్, ఈ జోనర్ అని కాకుండా.. కామెడీ, మిస్టరీ, థ్రిల్స్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ కలబోసిన హిలేరియస్ ఫన్ ఎంటర్టైనర్ ఇది. ఒక విధంగా ఇది రెండేళ్ల క్రితం వచ్చిన 'జాతిరత్నాలు' లాంటి సినిమా అని చొప్పొచ్చు.
‘జాతిరత్నాలు’ తరహాలోనే ముగ్గురు స్నేహితుల క్రేజీ ఫన్ రైడ్ ను తెర మీద ఆవిష్కరిస్తుంది ‘ఓం భీమ్ బుష్’. హారర్ కామెడీకి ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌ని జోడించి ఈ కథని అల్లుకున్నాడు దర్శకుడు శ్రీ హర్ష. ఆరంభం నుంచి చివరి వరకూ లాజిక్స్ ఫాలో అవ్వకుండా హిలేరియస్ ఎంటర్టైనర్ ను అందించారు. అక్కడ నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఎలాగైతే తమ డంబ్ వరల్డ్ లోకి తీసుకెళ్లి నవ్వించారో.. ఇక్కడ బ్యాంగ్ బ్రదర్స్ గా శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి బోలెడంత వినోదాన్ని పండించారు. ఎక్కడా ఆర్టిఫీషియల్ గా అనిపించకుండా, ఒకరితో ఒకరు పోటీ పడి నవ్వించారు.
నిజానికి అనుదీప్ కేవీ తెరకెక్కించిన ‘జాతిరత్నాలు’ సినిమాలో చెప్పుకోడానికి పెద్దగా కథేమీ ఉండదు. కాకపోతే దర్శకుడు క్రియేట్ చేసిన డంబ్ వరల్డ్ లో ఆసక్తికరమైన పాత్రలు, ఫన్నీ సిచ్యువేషన్లు బాగా కుదిరాయి. అందుకే జనాలు లాజిక్ లను పక్కనపెట్టి సినిమాని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ‘ఓం భీమ్ బుష్’ మూవీ విషయంలోనూ అదే వర్కౌట్ అయిందని అర్థమవుతోంది. సినిమాలో కొన్ని బ్లాకులు థియేటర్లలో ఆడియన్స్ ను విపరీతంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా హద్దులు ఏమీ పెట్టుకోకుండా సోషల్ మీడియా ట్రెండ్స్ చుట్టూ రాసుకున్న ఫన్నీ డైలాగ్స్.. టీనేజ్ పిల్లలను, యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఓవరాల్ గా 'ఓం భీం బుష్' అనేది ‘జాతిరత్నాలు’ తరహాలో ఎంటర్టైన్ చేసే కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పాలి. ఇక్కడ అదనంగా హారర్ అంశాలను జోడించి ఓవైపు భయపడుతూనే, మరోవైపు కొత్తరకం హాస్యంతో నవ్వించారు. చివర్లో ఇచ్చిన సందేశం కూడా కొత్తగా డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ డే హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటుగా రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి కాబట్టి, మంచి ఓపెనింగ్స్ గ్యారంటీ అని అర్థమవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకపోవడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవడం వంటివి ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. బ్లాక్ బస్టర్ ‘జాతిరత్నాలు’తో కంపేర్ చేయబడుతున్న శ్రీవిష్ణు సినిమా.. కలెక్షన్స్ లో ఆ చిత్రాన్ని బీట్ చేస్తుందో లేదో చూడాలి.