Begin typing your search above and press return to search.

OMG 2 మినీ సమీక్ష: పిల్ల‌ల సెక్స్ ఎడ్యుకేష‌న్ కాన్సెప్ట్ ఓకే కానీ..!

ప్ర‌జ‌ల సున్నిత‌త్వాలు నమ్మకాలపై ఎన్ని సినిమాలు వ‌చ్చినా ఆస‌క్తిని క‌లిగిస్తాయి.

By:  Tupaki Desk   |   13 Aug 2023 10:00 AM GMT
OMG 2 మినీ సమీక్ష: పిల్ల‌ల సెక్స్ ఎడ్యుకేష‌న్ కాన్సెప్ట్ ఓకే కానీ..!
X

ప్ర‌జ‌ల సున్నిత‌త్వాలు నమ్మకాలపై ఎన్ని సినిమాలు వ‌చ్చినా ఆస‌క్తిని క‌లిగిస్తాయి. ద‌ర్శ‌క‌ర‌చ‌యిత అమిత్ రాయ్ ఈ త‌ర‌హా క‌థాంశాల‌తో ప్ర‌యోగాలు చేయ‌డానికి వెన‌కాడ‌రు. అయితే సామాజిక సమస్యలను సాంప్రదాయిక రంగుతో చూసే పరిధిని ప్ర‌జ‌ల్లో పెంచాల‌నుకోవ‌డం నిజ‌మైన స‌వాల్ లాంటిది. అలాంటి స‌వాల్ ని స్వీక‌రించాడు అత‌డు.

అప్పుడు దేవుళ్లపై ఉమేష్ శుక్లా (ఓఎంజి డైరెక్ట‌ర్) హేతుబద్ధమైన సవాల్ చేసాడు. ఇప్పుడు పాఠశాల విద్యలో లోటుపాట్ల గురించిన చ‌ర్చ కోసం దేవుడిని ఆశ్ర‌యించే క‌థ‌తో అమిత్ రాయ్ మ్యాజిక్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. పాఠ‌శాల విద్య‌లో వివేకవంతమైన విధానాన్ని.. సెక్స్ ఎడ్యుకేషన్‌ను కీల‌క‌మైన ఎలిమెంట్ గా తీసుకుని ఈ సినిమాలో కీల‌క స‌న్నివేశాల్ని ర‌క్తి క‌ట్టించారు. మన విద్యా వ్యవస్థ అనేక లోటుపాట్ల‌ను కలిగి ఉంది. దానిని విమర్శనాత్మకంగా పరిశీలించడం ఇప్ప‌టికే ఆలస్యమైంది అంటే త‌ప్పు కాదు. అలాంటి కీల‌క‌మైన ఎలిమెంట్ ని అత‌డు ట‌చ్ చేసాడు.

ఈ సినిమా క‌థాంశాన్ని ప‌రిశీలిస్తే.. ఒక చిన్న-పట్టణం మహాకాల్‌లో - శివుని అనుచరులు యాత్రికులు తప్పక చూడవలసిన ప్రదేశంలో కాంతి శరణ్ (పంకజ్ త్రిపాఠి), భార్య ఇందుమతి (గీతా అగర్వాల్), యుక్తవయస్సులో ఉన్న కుమార్తె దమయంతి, యుక్తవయస్సులోకి అడుగు పెడుతున్న‌ కొడుకు వివేక్ (ఆరుష్ వర్మ) నివ‌సిస్తుంటారు. వివేక్ పాఠశాల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాకు చిక్కినప్పుడు అతడిని పాఠశాల యాజ‌మాన్యం బ‌హిష్క‌రిస్తుంది. చాలా నిజాయితీ గల కౌమారదశలో ఉన్న యువకుడు ఏమి చేయాలో అది చేయ‌డం త‌ప్పు ఎలా అవుతుంది? అందుకే త‌న కుమారుడికి బాధ అవ‌మానం కలిగించే చర్యలకు దారితీసిన చోటును వ‌దిలి కుటుంబం ఆ పవిత్ర నగరం నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. కుమారుని విష‌యంలో అనారోగ్యకరమైనది ఏమీ లేదని వైద్య నిపుణులు భరోసా ఇవ్వ‌గా ఆ కుటుంబం అంతా పట్టణానికి వెళుతుంది.

ఇంత‌లోనే కాంతి శ‌ర‌ణ్ కి దేవుని రూపంలోని మహదేవ్ (అక్షయ్ కుమార్) ప‌రిచ‌యం అవుతాడు. మ‌హ‌దేవ్ సాయంతో కాంతి శరణ్ త‌న కొడుకును అవ‌మానించిన‌ పాఠశాలపై దావా వేస్తాడు. కేసు న్యాయమూర్తి పురుషోత్తం నగర్ (పవన్ మల్హోత్రా) ముందుకు వెళుతుంది. పరువు నష్టం.. పరిహారం కోసం మరొక వైపు న్యాయవాది కామిని (యామీ గౌతమ్) పోరాటం సాగిస్తుంది. కొత్త విద్యా విధానం కావాలంటూ కేసును ర‌క్తి క‌ట్టిస్తారు. ప్రధాన స్రవంతి విద్యలో భాగంగా సెక్స్ ఎడ్యుకేషన్ ఆవశ్యకతను ఈ చిత్రం స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈ సినిమాలో కామెడీ స‌హా ఇత‌ర అంశాలు అంతంత మాత్ర‌మే. సినిమా ఆద్యంతం సీరియ‌స్ టోన్ తో ర‌న్ అవుతుంది.. ల్యాగ్ ఎక్కువ‌గా ఉంటుంది గ‌నుక ఆడియెన్ బోర్ ఫీల‌య్యేందుకు ఆస్కారం ఉంది. ఇందులో అక్షయ్ కుమార్ పాత్రను అతని ట్రేడ్‌మార్క్ స‌ల‌హా మోడ్‌తో ఎనర్జిటిక్ క్యామియోగా పేర్కొనవచ్చు. నిజానికి ఈ చిత్రం పంకజ్ త్రిపాఠికి చెందినది. పరేష్ రావల్ చేసిన పాత్రను పునరావృతం చేయడం ఏమంత సులభం కాదు. పంకజ్ తన సొంత గ్రౌండ్‌ను సృష్టించడమే కాకుండా పాత్రకు మరింత గంభీరతను జోడించారు. దురదృష్టవశాత్తూ ఈ చిత్రం మంచి ఉద్దేశ్యంతో సహేతుక ఎలిమెంట్ తో తీయాల‌నుకున్నా కానీ సీరియ‌స్ టోన్ తో పేలవంగా రూపొందింది.