మూవీ రివ్యూ : ఆపరేషన్ వాలెంటైన్
By: Tupaki Desk | 1 March 2024 8:33 AM GMT'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ రివ్యూ
నటీనటులు: వరుణ్ తేజ్-మానుషి చిల్లర్-నవదీప్-సంపత్ రాజ్-షతాఫ్ ఫిగార్-రుహాని శర్మ-పరేష్ పాహుజా-అభినవ్ గోమఠం-అలీ రెజా తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: హరి వేదాంతం
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాణం: సోనీ పిక్చర్స్-సిద్ధు ముద్ద
కథ-స్క్రీన్ ప్లే: శక్తి ప్రతాప్ సింగ్-ఆమిర్ ఖాన్-సిద్దార్థ్ రాజ్ కపూర్
దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్
మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ యువ కథానాయకుడు వరుణ్ తేజ్ నుంచి వచ్చిన కొత్త చిత్రం.. ఆపరేషన్ వాలెంటైన్. తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి రూపొందిన ఈ ఎయిర్ యాక్షన్ థ్రిల్లర్ ను శక్తి ప్రతాప్ సింగ్ రూపొందించాడు. ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
రుద్ర (వరుణ్ తేజ్) ఒక ఫైటర్ పైలట్. ఎయిర్ ఫోర్స్ లోనే పరిచయమైన ఇవా (మానుషి చిల్లర్)ను అతను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఐతే ఎప్పుడూ రిస్క్ చేయడానికి వెనుకాడని రుద్ర విషయంలో ఇవా భయపడుతూ ఉంటుంది. వజ్ర పేరుతో దేశం కోసం చేపట్టిన ఒక వినూత్నమైన ప్రయోగాన్ని టెస్ట్ చేసే క్రమంలో తన సహచర పైలట్ ను కోల్పోవడంతో పాటు తనూ తీవ్రంగా గాయపడతాడు రుద్ర. ఆ ప్రయోగం రుద్ర కెరీర్లో ఒక మరకల ా మిగిలిపోతుంది. దీని వల్ల ఉన్నతాధికారుల నుంచి తరచుగా అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాడు రుద్ర. ఈ స్థితిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన పుల్వామా దాడి వల్ల 40 మంది సైనికులను కోల్పోతుంది ఇండియా. ప్రతిగా శత్రు దేశానికి.. ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తుంది ఇండియా. ఈ క్రమంలో చేపట్టిన మిషనేంటి.. అందులో రుద్ర ఎలాంటి పాత్ర పోషించాడు.. తన మీద పడ్డ మరకలను చెరిగిపోయేలా దేశం కోసం అతనేం చేశాడు.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
పాకిస్థాన్ దేశాన్ని.. దాని అండతో చెలరేగిపోయే ఉగ్రవాదులను విలన్లుగా చూపిస్తూ.. వాళ్ల కుట్రలను ఛేదించే హీరో కథలను ఇప్పటికే బాలీవుడ్ పీల్చి పిప్పి చేసేసింది. ఈ తరహా కథలంటే మొహం మొత్తేసే పరిస్థితి వచ్చేసింది. అందుకే టైగర్-3.. ఫైటర్ లాంటి సినిమాలకు చేదు అనుభవం తప్పలేదు. 'ఫైటర్' మూవీతో భారతీయ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ఎయిర్ యాక్షన్ తో థ్రిల్ చేయడానికి సిద్దార్థ్ ఆనంద్-హృతిక్ రోషన్ జోడీ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టింది. అయినా అది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆశ్చర్యకరంగా ఆ సినిమా తెరకెక్కిన సమయంలో అదే జానర్లో.. అదే కథాంశంతో మన వరుణ్ తేజ్ హీరోగా 'ఆపరేషన్ వాలెంటైన్' తెరకెక్కింది. ఉన్నంతలో పకడ్బందీగా తెరకెక్కిన 'ఫైటర్'యే ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోగా.. దాంతో పోలిస్తే తక్కువ ప్రొడక్షన్ వాల్యూస్.. తక్కువ ఎమోషనల్ కనెక్ట్ ఉన్న 'ఆపరేషన్ వాలెంటైన్'తో ప్రేక్షకులు ఎంగేజ్ కావడం కష్టమే. ఎప్పుడూ చూసే సినిమాలకు భిన్నంగా ఉంటుంది కాబట్టి ఒక లుక్కేయొచ్చు కానీ.. అంతకుమించి దీన్నుంచి ఆశిస్తేనే కష్టం.
దేశభక్తితో ముడిపడ్డ సినిమాలకు అత్యంత కీలకమైన విషయం.. ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడేలా చేయగలగడం. తెర మీద చూపించే విషయాలు ఉద్వేగభరితంగా అనిపించాలి. దేశభక్తి భాగవన ఉప్పొంగాలి. ప్రేక్షకుల్లో ఒక కదలిక రావాలి. అది లేనపుడు ఈ జానర్ సినిమాలకు కనెక్ట్ కావడం కష్టమే. 'ఆపరేషన్ వాలెంటైన్'తో ఉన్న సమస్య కూడా ఇదే. పుల్వామా దాడికి ప్రతిగా పాకిస్థాన్ మీద చేపట్టే మిషన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఐతే ఇందులో ఎక్కడా కూడా ప్రధాన పాత్రలతో కానీ.. దేశానికి సంబంధించిన విషయాల్లో కానీ భావోద్వేగాలు పండించే ప్రయత్నం జరగలేదు. హీరో హీరోయిన్ల పాత్రలే చాలా ఫ్లాట్ గా అనిపిస్తాయి. హీరో తాను ఫెయిలైన ఓ మిషన్ గురించి అప్పుడప్పుడూ ఉలిక్కి పడుతుంటాడు తప్ప.. ఆ ఫెయిల్డ్ మిషన్ గురించి బలంగా.. ఉద్వేగభరితంగా చెప్పడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు. హీరో హీరోయిన్ల బంధాన్ని సైతం సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ప్రధాన పాత్రలతో ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరిచే ప్రయత్నమే జరగకపోవడంతో వాళ్లతో ముడిపడ్డ సన్నివేశాలు మొక్కుబడిగా సాగిపోతుంటాయి. ఇక ఆకాశంలో హీరో అండ్ కో చేపట్టే మిషన్లకు సంబంధించి లాజిక్స్ చాలా చోట్ల మిస్సయ్యాయి. యాక్షన్ ఘట్టాలు విజువల్ గా చూడ్డానికి బాగున్నాయి. కొంత ఉత్కంఠ రేకెత్తిస్తాయి కానీ.. అక్కడ ఎదురయ్యే సవాళ్లు.. వాటిని హీరో అండ్ కో ఛేదించే క్రమాన్ని సామాన్య ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఆసక్తికరంగా చూపించడంలో చిత్ర బృందం విఫలమైంది.
'ఆపరేషన్ వాలెంటైన్' ప్రథమార్ధంలో చెప్పుకోదగ్గ హై మూమెంట్స్ లేవు. నరేషన్ డల్లుగా సాగిపోతుంది. వాలెంటైన్స్ డే రోజు పాక్ ఉగ్రవాదులకు మన సైన్యం తరఫున గిఫ్ట్ ఇచ్చే ఎపిసోడ్ ఒక్కటి కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ద్వితీయార్ధమంతా చాలా వరకు ఎయిర్ యాక్షన్ సన్నివేశాలతోనే సాగుతుంది. అవి అక్కడక్కడా థ్రిల్ కలిగిస్తాయి కానీ.. ఈ సన్నివేశాలు చాలా వరకు లాజిక్ కు అందకుండా సాగుతాయి. శత్రు దేశం ఊహించని విధంగా చేసే దాడులకు అప్పటికప్పుడు హీరో బృందం పరిష్కారాలు కనుగొని ప్రతి దాడి చేయడం మరీ సినిమాటిగ్గా అనిపిస్తుంది. బడ్జెట్ పరిమితుల మధ్యే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చిత్ర బృందం కష్టపడింది కానీ.. తెర మీద ఔట్ పుట్ ఆశించిన స్థాయిలో లేదు. యాక్షన్ ఘట్టాల్లో కంటిన్యుటీ లేక తెర మీద అసలేం జరుగుతోందో అర్థం కాని అయోమయం ఏర్పడుతుంది. ఎయిర్ యాక్షన్ థ్రిల్లింగ్ గా అనిపించినా.. వాటిలో లాజిక్ మిస్ కావడంతో పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేం. చివరి 20 నిమిషాల్లో కథనం మంచి టెంపోతోనే సాగుతుంది. ముగింపు ఓకే అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా 'ఆపరేషన్ వాలెంటైన్' ఇంపాక్ట్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదు. హీరో బ్యాక్ స్టోరీతో పాటు ఎందులోనూ ఎమోషన్ పండకపోవడం ఈ చిత్రానికి మైనస్ అయింది. ఎప్పుడూ చూసే రొడ్డకొట్టుడు సినిమాల మధ్య 'ఆపరేషన్ వాలెంటైన్' భిన్నంగా అనిపించే చిత్రమే. ఆ కోణంలో చూడాలనుకుంటే ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. కానీ ఒక పకడ్బందీ థ్రిల్లర్ చూడాలనుకుంటే మాత్రం నిరాశ తప్పదు.
నటీనటులు:
వరుణ్ తేజ్.. ఫైటర్ పైలట్ పాత్రకు బాగా సూటయ్యాడు. తన ఆహార్యమే ఈ పాత్రను చాలా ముందుకు నడిపించేసింది. పాత్రకు ఫిట్ అయ్యేలా లుక్ ను తీర్చిదిద్దుకోవడమే కాదు.. అతను నిజం ఫైటర్ పైలట్ అనిపించేలా బిహేవ్ చేశాడు. తన వంతుగా పాత్ర కోసం చేయాల్సిందంతా వరుణ్ చేశాడు. హీరోయిన్ మానుషి చిల్లర్ యావరేజ్ అనిపిస్తుంది. తన అప్పీయరెన్సే డల్లుగా ఉంది. తన నటన పర్వాలేదు. హీరో సహ పైలట్ పాత్రలో పరేష్ పాహుజా ప్రేక్షకులకు అప్పుడప్పుడూ కొంత రిలీఫ్ ఇచ్చాడు. నవదీప్ పాత్ర మరీ నామమాత్రంగా అనిపిస్తుంది. రుహాని శర్మ గురించి కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సంపత్ రాజ్ క్యారెక్టర్ కూడా మొక్కుబడిగా అనిపిస్తుంది. షతాఫ్ ఫిగార్ పాత్ర.. తన నటన బాగానే అనిపిస్తాయి. అభినవ్ గోమఠం సీరియస్ పాత్ర చేశాడు. తన నుంచి ఆశించే వినోదం ఏమీ ఉండదు. మిగతా నటీనటులంతా మామూలే.
సాంకేతిక వర్గం:
మిక్కీ జే మేయర్ ఫాంలో లేని విషయం ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఈ సినిమాలో ఎక్కడా తన ముద్ర కనిపించలేదు. పాటల్లో.. నేపథ్య సంగీతంలో అతను ఒకప్పటి మెరుపులు చూపించలేకపోయాడు. వందేమాతరం సాంగ్ సహా ఏ పాటా గుర్తుంచుకునేలా లేదు. ఆ సాంగ్ బాలీవుడ్లో వచ్చిన కొన్ని పాటలకు అనుకరణలా అనిపిస్తుంది. నేపథ్య సంగీతంలోనూ మిక్కీ నిరాశ పరిచాడు. హరి వేదాంతం ఛాయాగ్రహణం బాగానే సాగింది. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఇంకా మెరుగ్గా ఉండాల్సిందనిపిస్తుంది. రైటర్ కమ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్.. ఒక విభిన్నమైన కథను చెప్పాలనుకోవడం అభినందనీయమే.. కానీ ఈ తరహా కథలను ఇంకా భారీగా, పకడ్బందీగా చెప్పాలి. టాప్ గన్.. ఫైటర్ లాంటి సినిమాలు చూశాక ఈ సినిమా నుంచి మెరుగైన ఔట్ పుట్ ఆశిస్తాం. యాక్షన్ ఘట్టాలను పక్కన పెడితే కథను ఇంకా ఆసక్తికరంగా చెప్పాల్సింది. ఎమోషనల్ కనెక్ట్ లేకుండా ఇలాంటి కథలను వర్కవుట్ చేయడం కష్టం. యాక్షన్ ఘట్టాలను ఉన్న పరిమితుల మధ్య బాగానే తీర్చిదిద్దినా.. లాజిక్స్ పట్టించుకోలేదు. దర్శకుడిగా శక్తి ప్రతాప్ కు యావరేజ్ మార్కులు పడతాయి.
చివరగా: ఆపరేషన్ వాలెంటైన్.. మంచి ప్రయత్నమే కానీ!
రేటింగ్- 2.5/5