బయోపిక్ కు ఈ మిశ్రమ స్పందన ముందే ఊహించినదే
అయితే ఈ సినిమాకి ఆరంభం మిశ్రమ స్పందనలు వచ్చాయి. క్రిటిక్స్ నుంచి ప్రశంసలు ఉన్నా దేశం లోని కామన్ ఆడియెన్ కి అంతగా రుచించలేదు.
By: Tupaki Desk | 22 July 2023 4:58 AM GMTజేమ్స్ కామెరూన్.. క్రిస్టోఫర్ నోలాన్ పేర్లను భారతదేశ ప్రజల కు పరిచయం చేయనవసరం లేదు. ఆ ఇద్దరి సినిమాల కు ఇండియాలో బోలెడంత డిమాండ్ ఉంది. అవతార్ - టైటానిక్ లాంటి సంచలన చిత్రాలతో ప్రపంచ దేశాల్లో ఫాలోయింగ్ సంపాదించుకున్న కామెరూన్ కథల ఎంపికలు ఆయన జానర్లు వేరు. వాటికి భిన్నంగా విస్మయపరిచే కథలు స్క్రీన్ ప్లేలతో సినిమాలు తీయడం నోలాన్ ప్రత్యేకత. ఇన్సెప్షన్- ఇంటర్ స్టెల్లార్- టెనెట్ లాంటి సినిమాలు అందుకు ఉదాహరణలు. ఆ మూడు సినిమాల ను భారతీయ ప్రేక్షకులు ఎంతో తపనగా థియేటర్లకు వెళ్లి మరీ చూశారు.
ఇప్పుడు నోలాన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ కి అంతే భారీ క్రేజ్ నెలకొంది. ప్రపంచ దేశాలు సహా భారతదశం లోను ఈ చిత్రం అత్యంత భారీగా విడుదలైంది. భారతదేశంలో దాదాపు 1200 స్క్రీన్లలో ఈ సినిమా ని విడుదల చేసారని ట్రేడ్ వెల్లడించింది. అయితే ఈ సినిమాకి ఆరంభం మిశ్రమ స్పందనలు వచ్చాయి. క్రిటిక్స్ నుంచి ప్రశంసలు ఉన్నా దేశం లోని కామన్ ఆడియెన్ కి అంతగా రుచించలేదు.
నోలాన్ రెగ్యులర్ గా తెరకెక్కించే సినిమాల తరహా లో ఇందులో విజువల్ మిరుమిట్లు ఆశించిన చాలా మందికి ఓపెన్ హైమర్ నిరాశ మిగిలింది. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఇది ఇతర నోలాన్ సినిమాల్లా స్క్రీన్ ప్లే ప్రయోగాలను చూపే ఆస్కారం లేని ఒక బయోపిక్ కేటగిరీ సినిమా. అందునా అణుబాంబ్ పితామహుని పై సినిమా. ఒక జీవితకథను యథాతథంగా తెర పై ఆవిష్కరిస్తూనే కమర్షియల్ అంశాలతో నోలాన్ దీని ని అద్భుతంగా తెరకెక్కించారని చాలా మంది క్రిటిక్స్ ప్రశంసించారు. కానీ కామన్ ఆడియెన్ నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
అయితే ఇది క్రిటిక్స్ లో మెజారిటీ వర్గం ముందే ఊహించినదే. ఈ సినిమాని అర్థం చేసుకోవాలంటే రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి పరిణామాలు.. అప్పటి రాజకీయాల ను కూడా ప్రజలు అర్థం చేసుకుని గూగుల్ లో చదివి ఉండాలి. లేదంటే సినిమా చాలా వరకూ అర్థం కాదు. సుదీర్ఘ సంభాషణలు డ్రామాతో సినిమా సాగుతుంది గనుక భారీ యాక్షన్ దృశ్యాలు ఛేజ్ లను కోరుకోకూడదు. కానీ అలా ఊహించుకుని వచ్చిన వారితోనే అసలు సమస్య తలెత్తిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఓపెన్ హైమర్ అనేది ఒక కల్ట్ క్లాసిక్ బయోపిక్. అణుబాంబ్ పితామహుడు రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితకథను అద్భుతంగా నోలాన్ తెరకెక్కించారు. దీనిని పూర్తి ఎమోషనల్ డ్రామాగా రూపొందించిన తీరు అసమానం అన్న ప్రశంసలు దక్కాయి. అయితే ఇది టామ్ క్రూజ్ గూఢచారి విశ్వం నుంచి వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ 7 తరహా కాదని అర్థం చేసుకోవాలి. భారీ యాక్షన్ ఛేజ్ లు స్టంట్స్ తో అలరించదు. ఒక అందమైన అసాధారణమైన కథను మాత్రమే తెర పై ఆవిష్కరిస్తుంది. ఓపెన్ హైమర్ సినిమాలో రెండు వంతులు పూర్తి డైలాగ్ లతో నిండి ఉంటుంది. ఇది భారతీయ వీక్షకులకు అంతగా సరిపోని కాన్సెప్ట్ అని కొందరు వ్యాఖ్యానించారు.
భారతీయ ప్రేక్షకుల లో ఎక్కువ భాగం యాక్షన్ కోసం తహతహలాడుతారు గనుక అర్థం కాని భాషలో సినిమాని చూసేందుకు అంతగా ఆసక్తిని కనబరచరని కూడా విశ్లేషిస్తున్నారు. అలాగే 3 గంటల చలన చిత్రంలో కూర్చుని 2 గంటల కంటే ఎక్కువ సంభాషణలు చూడటం అనేది చాలా మంది వీక్షకులకు తెలియదు. నోలన్ పేరు ఓపెన్ హైమర్ భారీ ఓపెనింగ్స్ అడ్వాన్స్ టిక్కెట్ అమ్మకాల కు ఉపయోగపడింది. తొలి వీకెండ్ చక్కని వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇక పై ఎలా ఆడుతుందో వేచి చూడాలి.