'ఆరెంజ్' రీ రిలీజ్... 4 రోజుల ముందే 7000+
డిజాస్టర్ అయిన ఆరెంజ్ సినిమా రీ రిలీజ్‌లో ఆ స్థాయి పాజిటివ్ స్పందన దక్కించుకోవడం విశేషం.
By: Tupaki Desk | 10 Feb 2025 1:34 PM GMTరామ్ చరణ్ కెరీర్‌లో అతి పెద్ద డిజాస్టర్‌ల్లో 'ఆరెంజ్' ముందు ఉంటుంది. మగధీర సూపర్ హిట్ కావడంతో చాలా నమ్మకంతో నాగబాబు భారీ బడ్జెట్‌ను ఖర్చు చేసి ఆరెంజ్ సినిమాను నిర్మించారు. సినిమా వసూళ్లు అత్యంత దారుణంగా నమోదు అయ్యాయి. దాంతో నాగబాబు తీవ్ర నష్టాలు వచ్చాయని అంటారు. ఆరెంజ్ నష్టాల కారణంగానే నాగబాబు నిర్మాణంను వదిలేశాడనే టాక్ సైతం ఉంది. అలాంటి ఆరెంజ్ రీ రిలీజ్‌లో షాకింగ్ వసూళ్లు రాబట్టింది. 2023లో రీ రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమా భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. డిజాస్టర్ అయిన ఆరెంజ్ సినిమా రీ రిలీజ్‌లో ఆ స్థాయి పాజిటివ్ స్పందన దక్కించుకోవడం విశేషం.
ఆరెంజ్ రీ రిలీజ్‌తో వచ్చిన కలెక్షన్స్‌ను జనసేన పార్టీకి విరాళంగా అందించారు. నాగబాబు స్వయంగా పవన్ కళ్యాణ్‌కి విరాళంను అందించారు. రెండేళ్ల గ్యాప్‌లో మరోసారి ఆరెంజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సమయంలో సినిమాను చూసిన ఫ్యాన్స్ ఇంత త్వరగా మరోసారి చూసేందుకు ఆసక్తి చూపిస్తారా అనే అనుమానం కొందరు వ్యక్తం చేశారు. కానీ సెకండ్ రీ రిలీజ్‌కి సైతం మంచి స్పందన వచ్చేలా ఉంది. ఆరెంజ్ సినిమా ఫిబ్రవరి 14, 2025న మరోసారి రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే బుక్ మై షో ద్వారా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. తక్కువ సమయంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది.
రీ రిలీజ్‌కి మరో నాలుగు రోజుల సమయం ఉండగానే 7000+ టికెట్లు బుక్ అయ్యాయి. విడుదల తేదీ వరకు పాతిక వేల వరకు టికెట్లు బుక్ అయ్యే అవకాశం ఉంది. మరోసారి భారీ వసూళ్లు నమోదు కావడం కన్ఫర్మ్ అని దీన్ని బట్టి అర్థం అవుతోంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రెగ్యులర్ ఆడియన్స్, మ్యూజిక్ లవర్స్ 'ఆరెంజ్' సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నాలుగు రోజుల ముందుగానే ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడు పోయాయి అంటే ఈ లవ్ సినిమాను ప్రేక్షకులు ఏ స్థాయిలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని సార్లు రీ రిలీజ్ అయినా ఆరెంజ్ సినిమాకు ఇదే తరహా స్పందన ఖాయం.
రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించిన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. నాగబాబు నిర్మించిన ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. కీలక పాత్రలో షాజన్ పదాంసీ నటించింది. సినిమాలో జెనీలియా నటనకు అప్పుడు విమర్శలు రాగా ఇప్పుడు అదే నటనను కొందరు ప్రశంసిస్తున్నారు. ఆరెంజ్ లవ్ స్టోరీని అప్పుడు విమర్శించిన వారు ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. అప్పట్లో సినిమాను తీయకుండా ఇప్పుడు తీసి ఉంటే, ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు ఆరెంజ్ సినిమా వచ్చి ఉంటే కచ్చితంగా వందల కోట్ల సినిమా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం చరణ్ తన తదుపరి సినిమాను బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.