మగువల గుండెల్లో మారాజు ఒర్రీ గుట్టు రట్టు!
అతడి ఆస్తి 2 కోట్ల నుంచి 8కోట్ల లోపు. కానీ అతడు 100కోట్లు అంతకుమించి ఆస్తులున్న హీరోయిన్లతో షికార్లు చేస్తున్నాడు
By: Tupaki Desk | 8 Nov 2023 1:30 AM GMTఅతడి ఆస్తి 2 కోట్ల నుంచి 8కోట్ల లోపు. కానీ అతడు 100కోట్లు అంతకుమించి ఆస్తులున్న హీరోయిన్లతో షికార్లు చేస్తున్నాడు. 100 కోట్లు అంతకుమించి ఆస్తులు ఐశ్వర్యం ఉన్న బాలీవుడ్ టాప్ హీరోయిన్లతో అతడికి సత్సంబంధాలున్నాయి. నిజం చెప్పాలంటే అతడు మగువల గుండెల్లో మారాజు. ఎప్పుడు చూసినా బాలీవుడ్ ఎ-లిస్టర్‌లతో రొమాంటిక్ గా ఫోజులిస్తూ కెమెరాలకు చిక్కుతుంటాడు. కుర్రభామలతో అతడి ఫోటోషూట్లు నిరంతర అంతర్జాలాన్ని హీటెక్కిస్తున్నాయి. అతడి కోసం మగువల తహతహా సందేహాలు రేకెత్తిస్తుంది. ఇంతకీ అతడు ఎవరు? అంటే ఇప్పటికీ అది వీడని ఒక సస్పెన్స్.
భారతదేశంలోని టాప్ సెలబ్రిటీలు, స్టార్ కిడ్స్‌తో రెగ్యులర్ గా పార్టీల్లో కనిపించే అతడి పేరు ఒర్రీ అలియాస్ అవ్రతమణి. అతడు నటుడు లేదా గాయకుడు కాదు..కానీ రెగ్యులర్ గా అన్ని B-టౌన్ పార్టీలలో కనిపిస్తాడు. ఓర్రీ అని ముద్దుగా పిలుస్తారు. కానీ ఓర్హాన్ అవత్రమణి అతడి పూర్తి పేరు. అతడు సెలబ్రిటీ కిడ్స్ పుట్టినరోజు వేడుకలు, ఇతర ప్రధాన బాలీవుడ్ ఈవెంట్‌లలో రెగ్యులర్ గా కనిపిస్తాడు.
తాజా సమాచారం మేరకు.. అతడు బిలియనీర్ ముఖేష్ అంబానీ, అతడి కుటుంబంతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అలియా భట్, దీపికా పదుకొణె, అనన్య పాండే, జాన్వీ కపూర్, సారా అలీఖాన్, సుహానా, ఖుషీ కపూర్ లాంటి స్టార్లతో భుజం భుజం రాసుకుపూసుకు తిరిగేంత చనువున్నవాడు. అతడు బాలీవుడ్ BFF (బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్) బిరుదును సంపాదించాడు.
వృత్తి గురించి ఆరా తీస్తే .. ఓర్హాన్ అవత్రామణి లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ పరిశీలిస్తే.. అతను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లోని చైర్మన్ కార్యాలయంలో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. అతడు న్యూయార్క్‌లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి పొందిన ఫైన్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసాడు. ఒక ఇంటర్వ్యూలో అతడి నికార్సయిన వృత్తి గురించి అడిగినప్పుడు అతడు ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది. ''నేను గాయకుడిని, పాటల రచయితని, ఫ్యాషన్ డిజైనర్‌ని, క్రియేటివ్ డైరెక్టర్‌ని, స్టైలిస్ట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, షాపర్ .. కొన్నిసార్లు ఫుట్‌బాల్ ప్లేయర్‌ని. కలలు కనడమే జీవితం అని నేను భావిస్తున్నాను'' అని తెలిపాడు.
చిత్ర పరిశ్రమలో తన స్నేహాల గురించి మాట్లాడుతూ.. తన తోటివారికి మాత్రమే స్నేహితుడిని అని ఒర్రీ పేర్కొన్నాడు, ''మాది ఒకే వయస్సు.. మేమంతా ఒకే సమయంలో పాఠశాలకు, కళాశాలకు వెళ్లేవాళ్లం. నేను ఇండస్ట్రీ స్నేహితులుగా భావించే.. పరిశ్రమలో మాత్రమే కలుసుకున్న భూమి పెడ్నేకర్ వంటి కొంతమంది మాత్రమే స్నేహితులుగా ఉన్నారు'' అని తెలిపాడు.
2 ఆగస్ట్ 1999న ముంబై వ్యాపారవేత్త జోర్జ్ అవత్రమణి- షెహనాజ్ అవత్రమణి దంపతులకు జన్మించిన ఓర్రీ నికర ఆస్తుల విలువ రూ. 2 కోట్ల నుండి రూ. 8 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అతనికి కబీర్ అనే సోదరుడు ఉన్నాడు. అతడు సోలిస్ హెల్త్‌లో PR హెడ్‌గా పనిచేస్తున్నాడు. లక్షల్లో సంపాదిస్తున్నాడు. కానీ వందల కోట్ల ఆస్తులున్న నటవారసురాళ్లకు అతడు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఇతరులు కుళ్లుకునేలా చేస్తున్నాడు.