ఆస్కార్ ఉత్తమ నటి కన్ను మూత
`హ్యారీపోటర్` నటి మ్యాగీ స్మిత్ నటవిన్యాసాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.
By: Tupaki Desk | 28 Sep 2024 3:32 AM GMT`హ్యారీపోటర్` నటి మ్యాగీ స్మిత్ నటవిన్యాసాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. 1969లో `ది ప్రైమ్ ఆఫ్ మిస్ జీన్ బ్రాడీ`లో తన నటనకు ఆస్కార్ అవార్డును గెలుచుకున్న మ్యాగీ స్మిత్ శుక్రవారం తెల్లవారుజామున లండన్ ఆసుపత్రిలో మరణించినట్లు ఆమె కుమారులు క్రిస్ లార్కిన్, టోబీ స్టీఫెన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె ఇద్దరు కుమారులు, ఐదుగురు మనవరాళ్లను విడిచిపెట్టి వెళ్లారు. వారంతా తమ తీపి జ్ఞాపకాన్ని, ప్రాణాధారాన్ని, ఆయువును కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మ్యాగీ డౌన్ టౌన్ అబ్బేలో `డోవెజర్ కౌంటెస్ ఆఫ్ గ్రాంథమ్`గా పాపులరైంది. ఈ పాత్ర తో పాటు, హ్యారీ పోటర్ సినిమాల్లో ప్రొఫెసర్ మెక్ గోనాగల్ గాను మ్యాగీ మెప్పించారు. ఆస్కార్ (రెండు), ఎమ్మీ (నాలుగు), టోనీ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ఆమె గెలుచుకున్నారు. 1950లలో స్టేజ్‌పై ప్రారంభమై నటిగా టోనీ ట్రిపుల్‌లను గెలుచుకున్న అతికొద్ది మందిలో ఆమె ఒకరు.
1969లో ది ప్రైమ్ ఆఫ్ మిస్ జీన్ బ్రాడీలో ఎడిన్‌బర్గ్ స్కూల్ మిస్ట్రెస్‌గా నటించి ఆస్కార్‌ను గెలుచుకునే ముందు, 1965లో లారెన్స్ ఒలివియర్ ఒథెల్లో సరసన డెస్డెమోనా పాత్ర పోషించినందుకు మొదటి అకాడమీ అవార్డు ప్రతిపాదనను అందుకుంది. 1978 కామెడీ కాలిఫోర్నియా సూట్‌లో తన సహాయక పాత్రకు తన రెండవ ఆస్కార్‌ను గెలుచుకుంది. ఈ షో సహనటుడు మైఖేల్ కెయిన్ ఏమన్నారంటే.. మ్యాగీ షోను దొంగిలించలేదు.. భారీ చోరీకి పాల్పడింది! అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
విమర్శకుల ప్రశంసలు పొందిన పాత్రలలో `వైల్డ్ - ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ ఆన్ ది వెస్ట్ ఎండ్ స్టేజ్`లోని లేడీ బ్రాక్‌నెల్ పాత్ర ఆసక్తికరమైనది. ఎడ్వర్డ్ ఆల్బీ డ్రామా `త్రీ టాల్ ఉమెన్`లో 92 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించారు. 2001 బ్లాక్ కామెడీ మూవీ గోస్‌ఫోర్డ్ పార్క్‌లోను నటించారు.