Begin typing your search above and press return to search.

ఆస్కార్ హడావుడిలో.. మళ్ళీ మన సినిమా

మొత్తం 96 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో భారత్ కు ఆస్కార్ తీసుకొచ్చిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఆర్ఆర్ఆర్!

By:  Tupaki Desk   |   11 March 2024 6:22 AM GMT
ఆస్కార్ హడావుడిలో..  మళ్ళీ మన సినిమా
X

నాటు నాటు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ పాట ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ సాంగ్.. గతేడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు కూడా అందుకుంది. మొత్తం 96 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో భారత్ కు ఆస్కార్ తీసుకొచ్చిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఆర్ఆర్ఆర్!

ఇక తాజాగా 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరిగిన ఈ వేడుకల్లో ఓపెన్ హైమర్ సినిమా సత్తా చాటింది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్ సహా పలు కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకుంది. పూర్ థింగ్స్ మూవీ కూడా కొన్ని విభాగాల్లో అవార్డులు అందుకుంది. అయితే ఈ సారి కూడా ఆస్కార్ వేదికపై మన నాటు నాటు పాట మెరిసింది.

ఆస్కార్ 2024లో భాగంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ను ప్రకటించేందుకు ఇద్దరు అందాల భామలు అరియానా గ్రాండే, సింథియా ఎరివో స్టేజ్ పైకి వస్తున్న సమయంలో బిగ్ స్క్రీన్ పై నాటు నాటు పాట తళుక్కున మెరిసింది. ఆ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసిన ఫుల్ ఫేమస్ హుక్ స్టెప్ కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇక ఆర్ఆర్ఆర్ అఫీషియల్ పేజీ కూడా ఆ వీడియోను ఎక్స్ లో షేర్ చేసింది. ఆస్కార్ వేదికపై మరోమారు అంటూ క్యాప్షన్ ఇచ్చి ఫైర్ ఎమోజీలను యాడ్ చేసింది. దీంతో నెటిజన్లు, ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. నాటు నాటు సాంగ్ ను మరోసారి ఆస్కార్ వేదిక పై చూడడం సూపర్ థ్రిల్లింగ్ గా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు దర్శకుడు రాజమౌళిని ఆకాశానికెత్తేస్తున్నారు.

"కొన్నేళ్ల క్రితం సౌత్ ఇండియా చిత్రాల్లోని యాక్షన్ సీన్స్ ను ఫన్నీగా ట్రీట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆస్కార్ 2024 ప్రదానోత్సవ వేడుకలో ఉత్తమ్ స్టంట్ ఏవీ క్లిప్పింగ్ లో ఆర్ఆర్ఆర్ లోని చిన్న క్లిప్స్ యాడ్ చేశారు. రాజమౌళి గారు.. మీరు తెలుగు చిత్రసీమను చాలా దూరం తీసుకెళ్లారు" అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది బిల్లీ ఇల్లిస్, ఫిన్నీ ఒకానెల్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకున్నారు. బార్బీలోని వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ పాటకు గాను అవార్డు దక్కింది.