తెలుగు అనర్గళంగా మాట్లాడే పరభాషా నాయికలు
కనీసం తెలుగు ఆర్టిస్టుల సంఘం 'మా'లో సభ్యత్వం కూడా తీసుకోలేదు పలువురు పరభాషా హీరోయిన్‌లు.
By: Tupaki Desk | 23 Sep 2024 8:30 PM GMTతెలుగు సినీపరిశ్రమలో పని చేస్తూ తెలుగు మాట్లాడని అగ్ర కథానాయికలపై చాలా విమర్శలు ఉన్నాయి. కనీసం తెలుగు ఆర్టిస్టుల సంఘం `మా`లో సభ్యత్వం కూడా తీసుకోలేదు పలువురు పరభాషా హీరోయిన్‌లు. త్రిష, ఇలియానా, నయనతార లాంటి సీనియర్ భామలు దశాబ్ధాల పాటు తెలుగు సినీపరిశ్రమలో అగ్ర కథానాయికలుగా భారీ పారితోషికాలు తీసుకున్నా వీళ్లెవరూ `మా` అసోసియేషన్ సభ్యులు కాలేదు. కనీసం తెలుగు నేర్చుకోలేదు. దీనిపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి.
కానీ తెలుగు భాష నేర్చుకుని చాలా మంది మలయాళీ కథానాయికలు తెలుగు వారి మనసులు గెలుచుకున్నారు. మమతా మోహన్ దాస్, నిత్యా మీనన్, నివేద థామస్, అనుపమ పరమేశ్వరన్ లాంటి కథానాయికలు తెలుగు నేర్చుకుని మన భాషలో అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఈ భామలు మీడియా సమావేశాల్లో అద్భుతంగా తెలుగులోనే సమాధానాలు చెప్పగలరు. ఇక మలయాళ బ్యూటీ సాయిపల్లవి తెలుగులో సుదీర్ఘ ప్రయాణం కొనసాగించింది. అందువల్ల తెలుగు భాషను మాట్లాడగలదు. కానీ పరిపూర్ణంగా కాదు.
గోవా నుంచి వచ్చి కోట్లాది రూపాయల పారితోషికం అందుకున్న ఇలియానా ఇప్పటికీ కొన్ని పదాలు అయినా తెలుగు మాట్లాడలేదు. చెన్నై చంద్రం త్రిష తనదైన అందం, నటనతో మెప్పించినా కానీ తెలుగు అస్సలు రానే రాదు. ఈ ఇద్దరూ అసలు తెలుగు నేర్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నయనతార లాంటి నటీమణి అయితే కనీసం ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా అటెండ్ కాలేదు. ఇక మూవీ ఆర్టిస్టుల సంఘంలో సభ్యత్వం లేదని కూడా అసోసియేషన్ సభ్యులు చెబుతారు. త్రిష, ఇలియానా, నయన్ తో పోలిస్తే మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా చాలా ఉత్తమం. తమన్నా తెలుగు అద్భుతంగా మాట్లాడుతుంది. ఒక తెలుగమ్మాయిలా గలగలా మాట్లాడగలదు.
బెంగళూరు బ్యూటీ, కన్నడమ్మాయి అనుష్క శెట్టి అచ్చ తెలుగు అమ్మాయితో సమానం. హైదరాబాద్ లో స్వీటీ జర్నీ మొత్తం సాగింది. బాలీవుడ్ లాంటి చోట్ల అవకాశాలు వచ్చినా కానీ అటు వెళ్లాలనుకోలేదు. పైగా తన పేరుకు తగ్గట్టే స్వీట్ గా తెలుగు మాట్లాడగల నేర్పరి. అలాగే తన ఒదిగి ఉండే స్వభావంతో ప్రతి ఒక్కరి మెప్పు పొందింది అనుష్క.
చెన్నై చంద్రం సమంత .. తన స్వస్థలానికి చెందిన త్రిష, నయన్ లాంటి సీనియర్ నటీమణులతో పోలిస్తే వంద రెట్లు బెటర్. సామ్ తెలుగమ్మాయిలా తెలుగు మాట్లాడుతుంది. నాగచైతన్యతో బ్రేకప్ అయినా కానీ ఇంకా టాలీవుడ్ లో సినిమాలు చేయాలనే ఆసక్తితో ఉంది. శ్రీయ, రకుల్, కాజల్ లాంటి అగ్ర కథానాయికలు చాలా కాలం పాటు తెలుగు సినిమాల్లో నటించారు. హైదరాబాద్ లో ఉన్నారు. అందువల్ల తెలుగులో పాక్షికంగా మాట్లాడుతూ కాలక్షేపం చేసారు. నేటితరంలో శ్రుతిహసన్ బహుభాషల్లో మాట్లాడగలదు. కమల్ హాసన్ వారసురాలిగా భాషలపైనా శ్రుతికి పట్టుంది. ముంబై బ్యూటీ పూజా హెగ్డే పదేళ్లుగా టాలీవుడ్లో అవకాశాలు అందుకుంటున్నా.. ఇంకా తెలుగు నేర్చుకోలేకపోయింది.
ఇటీవల లైగర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన హిందీ భామ అనన్య పాండే కు తెలుగు రాదు. కానీ దక్షిణాది మూలాలున్న జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తెలుగు-తమిళ భాషలను మాట్లాడుతోంది. ముఖ్యంగా తెలుగు నేర్చుకుని మాట్లాడేందుకు ఈ భామ చాలా ఆసక్తిగా ఉంది. దేవర ప్రమోషన్స్ లో ఈ విషయం బయటపడింది.
టాలీవుడ్ లో అడుగుపెడుతున్న పొరుగు భామలు నిజాయితీగా తెలుగు నేర్చుకుంటే ఇక్కడ చాలా అవకాశాలు వస్తాయి. కానీ ఆ పని చేయడం లేదు. అలాగే మూవీ ఆర్టిస్టుల సంఘా(మా)నికి గౌరవమిస్తూ సభ్యత్వం తీసుకోవడం కూడా అవసరం. కానీ ఇవేవీ చేయకుండా కోట్లు కొల్లగొట్టాలని ఆలోచిస్తున్నారు. కారణం ఏదైనా ఇలాంటి ఆలోచనలతో పలువురు సీనియర్ భామలు తెలుగు పరిశ్రమకు ఇటీవల చాలా దూరమయ్యారు.