Begin typing your search above and press return to search.

ఓటీటీకి సెన్సార్ వ‌చ్చేస్తుందా?

ఓటీటీ కంటెంట్ కి ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి సెన్సార్ లేని సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Oct 2024 5:43 AM GMT
ఓటీటీకి సెన్సార్ వ‌చ్చేస్తుందా?
X

ఓటీటీ కంటెంట్ కి ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి సెన్సార్ లేని సంగ‌తి తెలిసిందే. తీసిన కంటెంట్ ని న‌చ్చిన‌ట్లు ఎలా వీలు అయితే అలా విడుద‌ల చేసుకునే వెసులు బాటు ఉంది. ఓటీటీ రిలీజ్ కి ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి రిస్ట్రిక్ష‌న్స్ లేవు. అందుకే రాంగోపాల్ వ‌ర్మ ఓటీటీ వేదిక‌గా త‌న సినిమాల్ని రిలీజ్ చేసుకుంటుంటాడు. థియేట‌ర్ రిలీజ్ అయితే సెన్సార్..క‌ట్లు ఇలా చాలా కోత ప‌డుతుంది సినిమాకి. కానీ ఓటీటీకి అవేం ఉండ‌వు.

తీసిన కంటెంట్ ని జ‌నాల‌కు మేక‌ర్స్ ఎలా చూపించాల‌నుకుంటున్నారో? అలా చూపించుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇలా కంటెంట్ ని ఇలా రిలీజ్ చేయ‌డంపై విమ‌ర్శ‌లు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దేశ ప్ర‌తిష్ట‌ను ఓటీటీ దిగ‌జార్చుతుంద‌నే విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతూనే ఉన్నాయి. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని స్వీయా నియంత్ర‌ణ‌లు అవ‌స‌ర‌మ‌ని ఓటీటీల‌కు సూచించింది. అయితే అది పేరుకే త‌ప్ప పాటించేది ఎవ‌రు? దీంతో ఇలాంటి స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వ‌మే ఇప్పుడు రంగంలోకి దిగుతుంది.

ఈ విష‌యాన్ని సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ధృవీకరించారు. ఓటీటీ ప్లాట్ ఫారమ్‌లు వీక్షకుల వయస్సు వర్గాల ఆధారంగా కంటెంట్‌ను నియంత్రించే లక్ష్యంతో మార్గ దర్శకాలను పాటించడం లేదని ఫిర్యాదులు అందిన నేప‌థ్యంలో రంగంలోకి దిగుతున్న‌ట్లు తెలిపారు. ఏ వ‌య‌సువారు ఎలాంటి కంటెంట్ చూడాలి? చూడ‌కూడ‌దు వంటి విష‌యాల‌పై కేంద్ర మార్గ‌దర్శ‌కాలు జారీ అయ్యేలా స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

కంటెంట్ విష‌యంలో రిలీజ్ కి ముందు కొన్ని ర‌కాల స‌ర్టిఫికెట్ లు రిలీజ్ చేసే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇలా చేస్తే గానీ మెరుగైన కంటెంట్ ని ప్ర‌జ‌ల‌కు అందించ‌లేమ‌ని కేంద్రం భావిస్తుంది. దీనికి సంబంధించి ప్ర‌జ‌ల అభిప్రాయం తీసుకుంటారుట‌. అలాగే పాల‌సీ విధానం కూడా తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది.