OTTలో రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్
టాలీవుడ్ లో చాలామంది అగ్ర హీరోల సినిమాలు రిలీజై థియేటర్లలో ఆడాక, కేవలం 20రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన సందర్భాలున్నాయి
By: Tupaki Desk | 13 Sep 2023 6:30 AM GMTటాలీవుడ్ లో చాలామంది అగ్ర హీరోల సినిమాలు రిలీజై థియేటర్లలో ఆడాక, కేవలం 20రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన సందర్భాలున్నాయి. రెండు నెలల తర్వాతే రిలీజ్ చేయాలన్న నియమాన్ని ఎవరూ పాటించలేదు. ఇలాంటి మెతక వైఖరి కేవలం సౌత్ లో మాత్రమే చూడగలం. ఒకవేళ ఉత్తరాదిన అయితే ఈ నియమం ఎలా ఉంది? అంటే ఎవరైనా సరే.. 8 వారాల నియమం పాటించాల్సిందేనని చెబుతున్నారు.
ఇటీవల రజనీకాంత్ తాజా బ్లాక్ బస్టర్ 'జైలర్' హిందీ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయగా, హిందీ వెర్షన్ రూ. 10 కోట్లు నికర వసూళ్లను మాత్రమే సాధించగలిగింది. ఈ ఎదురుదెబ్బకు ప్రధాన కారణం ఓటీటీ నిబంధన అన్న చర్చా సాగుతోంది. నార్త్ ఇండియన్ థియేటర్ ఎగ్జిబిటర్స్ ప్రకారం... థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలలోపు ఏ సినిమాని ఓటీటీలో విడుదల చేయరాదు. ఈ నిబంధనను పాటించకపోతే హిందీ బెల్ట్‌లలోని అనేక సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్‌లు సినిమాను విడుదల చేయవు.
జైలర్ థియేట్రికల్ విడుదలైన నాలుగు వారాల తర్వాత ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఇది ఉత్తరాది రూల్ ప్రకారం.. ఖచ్చితంగా ఎనిమిది వారాల ఓటీటీ నిబంధనను తిరస్కరించడమే. ఇప్పుడు దళపతి విజయ్ నటించిన లియో కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటోంది. ఈ చిత్రం OTT విడుదల కోసం మేకర్స్ ఎనిమిది వారాలు వేచి ఉండకపోతే LEO హిందీ వెర్షన్‌ను విడుదల చేయబోమని ఉత్తరాదికి చెందిన ఎగ్జిబిటర్లు చాలా స్పష్టంగా చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ 8 వారాల నిబంధన దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది నిర్మాతలు దానిని ఉల్లంఘించారు. నాగార్జున ఘోస్ట్ సహా చాలా పెద్ద సినిమాలు తక్కువ వ్యవధిలో ఓటీటీల్లోకొచ్చేశాయి. అయితే దక్షిణాది నుండి పాన్ ఇండియా చిత్రాల ఓటీటీ రిలీజ్ ల వ్యవహారాన్ని ఉత్తరాదికి చెందిన ఎగ్జిబిటర్లు చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నియమం పాటించకపోతే దాని ప్రభావం అక్కడ చూపిస్తోంది. రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అని భీష్మించుకుని కూచుంటున్నారు. దీంతో ఇక్కడ నిర్మాతలకు మార్కెట్ పరమైన చిక్కులు తప్పడం లేదని సమాచారం.