ఓటీటీ రిలీజ్ అంటే కన్నీరుమున్నీరైన హీరోయిన్!
అవి నేరుగా థియేటర్లోనే రిలీజ్ అవుతుంటాయి. అయితే చిన్న హీరోలు..హీరోయిన్లు ఈ విషయంలో బాగా నిరుత్సాహ పడాల్సిన సన్నివేశం కనిపిస్తుంది.
By: Tupaki Desk | 21 Oct 2023 12:30 PM GMTఓటీటీ రిలీజ్ అంటే ఎక్కడో చిన్న అసంతృప్తి. థియేటర్ రిలీజ్ ఇచ్చినంత కిక్కు ఓటీటీ రిలీజ్ ఇవ్వదు అన్నది చాలా మంది అభిప్రాయం. అందుకే ఏ హీరోయిన్ అయినా..హీరో అయినా ఓటీటీ కంటే థియేటర్ రిలీజ్ అయితేనే బాగుంటుందని ఆశిస్తారు. కానీ రిలీజ్ అనేది వాళ్ల చేతుల్లో పని కాదు కాబట్టి...నిర్మాత ఎలా రిలీజ్ చేస్తే అందుకు కట్టుబడి ఉండాల్సిందే. అగ్ర హీరోల సినిమాలకు ఎలాంటి సమస్యలేదు.
అవి నేరుగా థియేటర్లోనే రిలీజ్ అవుతుంటాయి. అయితే చిన్న హీరోలు..హీరోయిన్లు ఈ విషయంలో బాగా నిరుత్సాహ పడాల్సిన సన్నివేశం కనిపిస్తుంది. తాజాగా తెలుగు అమ్మాయి అయిన బాలీవుడ్ బ్యూటీ అతిది రావు హైదరీ అలాంటి నిరుత్సాహానికి గురైన ఓ సందర్భాన్ని గుర్తు చేసుకుంది. ఈ బ్యూటీ నటించిన మలయాళ చిత్రం 'సుఫియమ్ సుజాతయమ్' అనే చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసి వాపోయిందిట.
'తెలుగు ..హిందీ..తమిళం...మలయాళం లాంటి భాషల్లో సినిమాలు చేసాను. లాక్ డౌన్ ముందు నా తమిళ చిత్రం సైకో థియేటర్లో విడుదలై మంచి విజయం సాధించింది. అది రిలీజ్ అయిన కొన్ని రోజులకే లాక్ డౌన్ ప్రకటించారు. దాని తర్వాత నేను చేసిన మలయాళ చిత్రం `సుఫియమ్ సుజాతయమ్` ని అమెజాన్ లో రిలీజ్ చేస్తున్నారని తెలిసింది. ఆ విషయం నా చెవిన పడగానే చాలా ఏడ్చాను.
ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాని ప్రేక్షకులు ..ఆదరిస్తారో లేదో? అని చాలా కంగారు పడ్డాను. కానీ ఆ చిత్రం ఓటీటీలో కూడా అభిమానుల నీరాజనాలు అందుకుంది. అప్పుడే నా బాధంతా తొలగిపోయింది. వివిధ దేశాల నటీనటులు..మలయాళంలో తెలియని వారు కూడా నాకు మెసెజ్ లు పంపించారు. రోజూ 30 నుంచి 40 మెసెజ్ లు వచ్చేవి. అంత మంచి స్పందన సోంత చేసుకన్న ఆ చిత్రం గురించి చిన్న పిల్లలా ఎందుకు ఏడ్చానా? అనిపించింది` అని అంది. ప్రస్తుతం అదితి రావు హైదరీ 'గాంధీ టాక్స్ ..'లయనీస్' చిత్రాల్లో నటిస్తోంది.