OTTలు యూట్యూబ్‌లపై నియంత్రణ ఏదో ఒకటి ఇక కుదరదు!
యూట్యూబ్ చానెళ్లు ఇష్టానుసారం ఏదో ఒక కథనం వేసేయడానికి కుదరదనే సంకేతం కూడా అందింది
By: Tupaki Desk | 28 July 2024 7:40 AM GMTOTTలు యూట్యూబ్‌లు ఫసక్..! ఏదో ఒకటి చేసేస్తే ఇకపై కుదరదు! అంతేకాదు.. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఏదో ఒక మితి మీరిన కంటెంట్ ని యథేచ్ఛగా ప్రసారం చేయడం వీలుపడదు. ఎందుకంటే రూల్స్ మారాయి. ఇష్టానుసారం కథనాలు వేసేస్తే దానిని ప్రభుత్వం ఉపేక్షించదు. సమాచార ప్రసారాల శాఖ ప్రతిదీ తరచి చూస్తుంది. అన్ని మీడియాల్ని పరిశీలిస్తుంది. మొట్టికాయలు వేస్తుంది. అశ్లీలత, విశృంఖలత పెచ్చు మీరడంపై ఇప్పటికే బోలెడన్ని కొత్త రూల్స్ ని సమాచార ప్రసారాల శాఖ ప్రతిపాదించింది. ప్రతిదీ బిల్లు రూపంలో చట్ట రూపం తీసుకోవడంతో ఇకపై ఆన్ లైన్ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థల ఆటలు చెల్లవని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీల్లో విశృంఖల కంటెంట్ పూర్తిగా అదుపాజ్ఞల్లోకి రానుంది. యూట్యూబ్ చానెళ్లు ఇష్టానుసారం ఏదో ఒక కథనం వేసేయడానికి కుదరదనే సంకేతం కూడా అందింది. పాడ్ కాస్టులు కూడా స్వేచ్ఛను కోల్పోనున్నాయి.
భారతదేశంలో ఆన్‌లైన్ కంటెంట్ సృష్టిని నియంత్రించడానికి మోడీ ప్రభుత్వం కొత్త ప్రసార బిల్లును ప్రవేశపెడుతోంది. ఇది కంటెంట్ సృష్టికర్తలు ఇష్టానుసారం ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి అనుమతించదు. ప్రతిదీ ప్రభుత్వ శాఖ స్కానర్ కిందికి వస్తుంది. ఆ మేరకు బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ (నియంత్రణ) బిల్లు- 2024 కొత్త ముసాయిదాలో చాలా మార్పులు చేసింది. పాడ్ కాస్టులు చేసేవాళ్లు.. యూట్యూబ్ వీడియోలు చేసేవాళ్లు...ఇతర యాప్ లలో అప్ డేట్లు వేసేవాళ్లు.. వీరంతా కూడా డిజిటల్ న్యూస్ బ్రాడ్ కాస్టర్ల వింగ్ లో స్కారర్ పరిధిలోకి వస్తారు. వీరిపై మీడియా సంస్థలన్నీ ఆన్ లైన్ లో రిజిస్టర్ అయి ఉండాలి. రిజిస్టర్ అయిన వాటన్నిటిపైనా ఇక స్క్రుటినీ స్ట్రిక్టుగా ఉంటుంది.. సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ఎవరు పడితే వారు ఇష్టానుసారం వార్తలను ప్రసారం చేయడానికి ఈ కొత్త బిల్లు అనుమతించదు. ప్రింట్ మీడియాల్లో కూడా ఇష్టానుసారం వన్ సైడెడ్ విశ్లేషణలు రాయడంపైనా నియంత్రణ ఉంటుందనేది ఇప్పుడు ప్రధాన బెంగ.
ప్రధాన స్రవంతి మీడియా తరచుగా ప్రభుత్వ కథనాలను వేసేప్పుడు.. స్వతంత్ర యూట్యూబ్ వార్తా చానెళ్లలో రకరకాల సొంత విశ్లేషణలను ధృక్కోణాలను అందించడంపైనా ఇకపై రివ్యూలు చేస్తారు. మొన్నటి ఎన్నికల తర్వాత బిల్లులో కొత్త మార్గదర్శకాలను చేర్చారు. కొత్త బిల్లు ప్రకారం ఎవరైనా ఆన్‌లైన్‌లో వార్తలను షేర్ చేస్తే ఎలాంటి వార్తలు వేయాలి.. ఏవి వేయకూడదు.. అనే దాని గురించి కొత్త నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. అయితే దీనిపై సమాచార ప్రసార శాఖ అభిప్రాయాలను అడుగుతోంది.
ఇక మీదట ఓటీటీ కంటెంట్ పైనా పూర్తిగా నియంత్రణ కొనసాగనుంది. నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ సహా ప్రతిదీ సమాచార ప్రసారాల శాఖ అండర్ స్కానర్ లో ఉన్నాయి. ఇవన్నీ కంటెంట్ ని నియంత్రణల మధ్య సృష్టించాల్సి ఉంటుంది. సాంప్రదాయ టీవీ మాదిరిగానే ఓటీటీలు కఠినమైన మార్గదర్శకాలను అనుసరించాల్సిన అవసరం ఉందని బిల్లు చెబుతోంది.
తప్పు జరిగితే జరిమానాలు లేదా తాత్కాలిక నిషేధాలు వంటి వాటిని ఎదుర్కోవాల్సి రావొచ్చు. వీటి నుంచి బయటపడాలంటే కంటెంట్‌లోని భాగాలను మార్చవలసి ఉంటుంది లేదా పూర్తిగా తొలగించాల్సిన సన్నివేశం ఉంటుంది. అయితే బిల్లుకు సంబంధించిన ముసాయిదా ఇప్పటివరకూ రివీల్ కాలేదు. ప్రభుత్వం ఎందుకు దాస్తోందో ఎవరికీ తెలీదు. ఈ కొత్త నిబంధనల వల్ల క్రియేటివిటీ చచ్చిపోతుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటివరకూ ఓటీటీ ప్రేక్షకులు సృజనాత్మకంగా గొప్ప ప్రక్రియలను చూసారు. కానీ ఇక మీదట అది అందుబాటులోకి రావడం కష్టం. పూర్తిగా నియంత్రిత కంటెంట్ గా మారినప్పుడు అది ఈటీవీలా ప్లెయిన్ కంటెంట్ అయిపోవడం ఖాయమని ఒక ప్రముఖు పూణే ఫిలింఇనిస్టిట్యూట్ డైరెక్టర్ కామెంట్ చేసారు! ఇకపై స్ట్రీమింగ్ వేదికలపై అంతగా ఆదరణ పొందని సిరీస్ లే ఎక్కువగా చూసేందుకు అందుబాటులో ఉండే వీలుందని అంచనా. ఇప్పటికే ఆస్వాధిస్తున్న వాటిలోను కంటెంట్ ని తరచి చూసి చాలా భాగాలను తొలగించడం లేదా మార్చడం వంటివి జరుగుతాయని భావిస్తున్నారు.