Begin typing your search above and press return to search.

కోలీవుడ్ లో దర్శకుల కొరత ఏర్పడుతోందా..?

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఇండియన్ సినిమాలో డామినేషన్ చూపిస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తో వెలిగిపోతోంది.

By:  Tupaki Desk   |   21 Jan 2025 3:52 AM GMT
కోలీవుడ్ లో దర్శకుల కొరత ఏర్పడుతోందా..?
X

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఇండియన్ సినిమాలో డామినేషన్ చూపిస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తో వెలిగిపోతోంది. ఎప్పటిలాగే కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలతో మలయాళ ఇండస్ట్రీ మేటి అనిపించుకుంటోంది. తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసి, ఘన విజయాలు అందుకుంటుకున్నారు. కన్నడ పరిశ్రమ కూడా ఉన్నంతలో బాగానే ఉంది. అయితే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తమిళ ఇండస్ట్రీ మాత్రం ఈ మధ్య కాస్త వెనకబడిపోయింది.

ఓవైపు కమర్షియల్‌ సినిమాలు, మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను రూపొందించడంలో తమకు తామే సాటి అనిపించుకుంది కోలీవుడ్. కానీ ఇటీవలి కాలంలో తమిళ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా సత్తా చూటడం లేదు. పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపించడం లేదు. భారీ బడ్జెట్ తో చేసిన చిత్రాలు సైతం వర్కవుట్ అవ్వడం లేదు. కీలమైన హిందీ మార్కెట్ లో ఫెయిల్ అవుతున్నాయి. ఫలితంగా వెయ్యి కోట్ల క్లబ్ తమిళ చిత్ర పరిశ్రమకు అందని ద్రాక్షలా మిగిలిపోతోంది.

ప్రస్తుత తమిళ సినిమా పరిస్థితికి ఔట్ డేటెడ్ డైరెక్టర్స్ ఒక కారణమైతే.. టాలెంటెడ్ డైరెక్టర్స్ ఇతర భాషల్లో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరచడం మరో రీజన్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలానే పలువురు దర్శకులు యాక్టర్స్ గా మారడం కూడా ఇంకో కారణమని అంటున్నారు. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా రాణించిన ఎస్. శంకర్ ఇప్పుడు ఫామ్ లో లేరు. ఆయన తీసిన 'ఇండియన్ 2' 'గేమ్ ఛేంజర్' సినిమాలు డిజాస్టర్లుగా మారాయి.

తమిళ స్టార్ డైరెక్టర్ గా కొనసాగిన ఏఆర్ మురుగదాస్.. తన కొత్త సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా 'సికిందర్' సినిమా చేస్తున్నాడు. 'సింగం' ఫ్రాంచైజీ క్రియేటర్ హరి ఒకప్పటిలా హిట్లు కొట్టలేకపోతున్నారు. సినిమా సినిమాకీ చాలా గ్యాప్ తీసుకునే దర్శకుడు విష్ణు వర్ధన్.. 'నెసిప్పాయ' సినిమాతో ప్లాప్‌ అందుకున్నారు. 'అన్నా త్తే', 'కంగువ' వంటి భారీ పరాజయాలతో సిరుతై శివ బాగా వెనకబడిపోయారు.

కోలీవుడ్ లో లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, అట్లీ, కార్తీక్ సుబ్బరాజు లాంటి కొందరు డైరెక్టర్స్ టాప్ లీగ్ లో కొనసాగుతున్నారు. 'కూలీ' సినిమా చేస్తున్న లోకేష్.. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్‌తో ఓ ప్రాజెక్ట్ చేస్తారని టాక్. 'జవాన్' సినిమాతో బాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకున్న అట్లీ.. ఇప్పట్లో స్ట్రెయిట్ తమిళ సినిమా చేసే ఆలోచనలో లేడని తెలుస్తోంది. అతను చాలా కాలంగా అల్లు అర్జున్ కోసం ట్రై చేస్తున్నారు. 'జైలర్ 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నెల్సన్.. దీని తరువాత టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌తో చేతులు కలపబోతునున్నారు.

కార్తీక్ సుబ్బురాజ్ డిఫరెంట్ కంటెంట్ తో హిట్లు కొడుతున్నా.. అవి పాన్ ఇండియాని షేక్ చేసే సినిమాలైతే కాదు. సూర్యతో చేస్తున్న గ్యాంగ్ స్టర్ లవ్ స్టోరీ తర్వాత ఎలాంటి సినిమా చేస్తారో తెలియదు. పొన్నియన్ సెల్వన్ తో ఫామ్ లోకి వచ్చిన మణిరత్నం.. తమిళ మార్కెట్లలో మాత్రమే ప్రభావం చూపించగలిగారు. త్వరలో రాబోయే 'థగ్ లైఫ్' సినిమా ఫలితాన్ని బట్టి దిగ్గజ దర్శకుడి కెరీర్ ముందుకు సాగుతుంది. హెచ్.వినోద్, పీఎస్ మిత్ర‌న్, అతిక్ రవిచంద్రన్ లాంటి దర్శకులు ఇంకా స్టార్ డైరెక్టర్లుగా మారలేదు.

ఇక యాక్టర్ గా మారిన ఎస్.జె సూర్య డైరెక్షన్ కు గుడ్ బై చెప్పేశారు. నటుడిగా బిజీగా మారిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా డైరెక్టర్ గా సినిమాలు తగ్గించేశారు. అప్పుడెప్పుడో కంప్లీట్ అయిన 'ధ్రువ నక్షత్రం' చిత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ప్రెజెంట్ మలయాళంలో మమ్ముట్టితో 'డొమినిక్ మరియు లేడీస్ పర్స్' అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు రూపొందిస్తున్నారు.

ఇలా కొందరు కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లు ఇతర భాషల హీరోలతో కలిసి పని చేస్తుంటే.. మరికొందరు దర్శకులు ఫామ్ ను కోల్పోయారు. ఇంకొందరు యాక్టింగ్ మీద దృష్టి పెట్టారు. ఈ విధంగా తమిళ చిత్ర పరిశ్రమకు సాలిడ్ హిట్టిచ్చే దర్శకులు తగ్గిపోతూ వస్తున్నారు. తమిళ సినిమా బాధ్యతను తీసుకోవాల్సిన లోకేష్ కనగరాజ్, నెల్సన్ వంటి వారు కూడా పక్క ఇండస్ట్రీల వైపు చూస్తున్నారు. వెంకీ అట్లూరి లాంటి తెలుగు దర్శకులు తమిళంతో పాగా వేయడానికి ట్రై చేస్తున్నారు.