Begin typing your search above and press return to search.

అవుట్ డేటెడ్ డైరెక్టర్స్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేనా?

కొత్త నీరు వచ్చినపుడు పాత నీరు కొట్టుకుపోతుందనే నానుడి మనం వింటుంటాం.

By:  Tupaki Desk   |   19 July 2024 5:19 AM GMT
అవుట్ డేటెడ్ డైరెక్టర్స్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేనా?
X

కొత్త నీరు వచ్చినపుడు పాత నీరు కొట్టుకుపోతుందనే నానుడి మనం వింటుంటాం. చిత్ర పరిశ్రమకు ఇది సరిగ్గా సరిపోతుంది. నవతరం ఆలోచనలతో, వైవిధ్యమైన కథలతో కొత్త డైరెక్టర్స్ వస్తున్నప్పుడు.. ఏ ఇండస్ట్రీలోనైనా సీనియర్ దర్శకుల కెరీర్ ప్రశ్నార్థంకంగా మారుతుంది. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా మారుతున్న కాలంతో పాటుగా తమని తాము అప్డేట్ చేసుకుంటేనే పరిశ్రమలో రాణించగలుగుతారు. లేదంటే అవుట్ డేటెడ్ అనే ముద్ర వేసేసి పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, టాలీవుడ్ లో చాలాకాలంగా సరైన సక్సెస్ లేని పలువురు సీనియర్ దర్శకులు ఇప్పుడు మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

గుణశేఖర్, కృష్ణవంశీ, తేజ, వై.వి.ఎస్‌.చౌదరి, కె. విజయ్ భాస్కర్... వీళ్లంతా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్. అప్పట్లో అగ్ర హీరోలతో సినిమాలు తీసి, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. కానీ ఈతరం దర్శకులు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా వీళ్ళ హవా తగ్గిపోతూ వచ్చింది. చేసిన సినిమాలు కూడా ప్లాప్ అవడంతో, ఇండస్ట్రీలో పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఈ దర్శకులందరూ తమని తాము నిరూపించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. స్టార్‌ హీరోలతో సినిమా చేసే పరిస్థితులు లేకపోవడమో.. కొత్త తరంతో ఓ కొత్త కథ చెప్పాలనే ప్రయత్నమో తెలియదు కానీ.. అందరూ యంగ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు.

టాలీవుడ్ లో భారీ సెట్స్ ట్రెండ్ ను స్టార్ట్ చేసిన దర్శకుడు గుణశేఖర్.. ఓవైపు కమర్షియల్ చిత్రాలు, మరోవైపు పౌరాణిక చారిత్రక సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోతున్నారు. చివరగా అయన్నుంచి వచ్చిన 'శాకుంతలం' సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కొన్ని నెలల గ్యాప్ తీసుకొని ‘యుఫోరియా’ అనే యూత్‌ ఫుల్‌ డ్రామాని తెరకెక్కించడానికి రెడీ అయ్యారు.


క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సరైన హిట్టు కొట్టి పుష్కర కాలం దాటిపోయింది. గతంలో అగ్ర హీరోలతో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీసిన ఆయన, బ్యాక్ టూ బ్యాక్ పరాజయాలు చవి చూస్తున్నారు. గతేడాది థియేటర్లలోకి వచ్చిన 'రంగ మార్తాండ' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నపటికీ, బాక్సాఫీసు దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఆయన ఇప్పుడు మూడు జంటల నేపథ్యంలో ఓ సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నాని టాక్. 'ఖడ్గం' తరహాలో ఓ మూవీ చేస్తానని దర్శకుడు తాజాగా వెల్లడించారు.


డైరెక్టర్ వై.వి.ఎస్‌.చౌదరి 'దేవదాసు' సినిమా తర్వాత మళ్ళీ సక్సెస్ రుచి చూడలేదు. చివరగా 2015లో ఆయన దర్శకత్వంలో వచ్చిన 'రేయ్' మూవీ డిజాస్టర్ గా మారింది. దీంతో తన కెరీర్ లోనే లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత మెగా ఫోన్ పట్టుకోడానికి సిద్ధమయ్యారు. ఆయన డైరెక్షన్ లో నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ తనయుడు ఎన్టీఆర్‌ ని హీరోగా లాంఛ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు.


మరో క్రియేటివ్ దర్శకుడు తేజ కెరీర్ ప్రారంభం నుంచీ తన పంథాలోనే సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. చివరగా దగ్గుబాటి వారసుడిని హీరోగా పరిచయం చేసిన 'అహింస' సినిమా ఫ్లాప్ అయింది. రానా దగ్గుబాటితో ‘రాక్షస రాజా’ అనే సినిమాని ప్రకటించినా, అది ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. అంతకముందు అనౌన్స్ చేసిన 'చిత్రం 2.0' చిత్రం పట్టాలెక్కలేదు. ఇప్పుడు తన కుమారుడు అమితోవ్‌ తేజని హీరోగా లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.



ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కె. విజ‌య భాస్క‌ర్. ఒకప్పుడు త్రివిక్రమ్ కథలతో ఎన్నో విజయవంతమైన సినిమాలు రూపొందించారు. ఆయన మెగా ఫోన్ పట్టిన తర్వాత విజయ్ భాస్కర్ నుంచి సక్సెస్ ఫుల్ మూవీస్ రావడం లేదు. లాస్ట్ ఇయర్ తన కుమారుడు శ్రీ‌ క‌మ‌ల్ ను హీరోగా పరిచయం చేస్తూ 'జిలేబీ' అనే చిత్రాన్ని తెరకెక్కించినా లాభం లేకుండా పోయింది. ప్రస్తుతం తన హోమ్ బ్యానర్ లో తనయుడితో 'ఉషా ప‌రిణ‌యం' అనే సినిమా చేస్తున్నారు.


ఇలా చాలామంది సీనియర్ దర్శకులు ఒకప్పటిలా మ్యాజిక్ రిపీట్ చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి వారానికో యంగ్ డైరెక్టర్ పరిచయమయ్యే ఈ రోజుల్లో.. సీనియర్లు మనుగడ సాధించడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఎప్పటికప్పుడు తమని తాము అప్డేట్ చేసుకుంటేనే ఈతరం దర్శకులతో పోటీ పడగలరు. ఇటీవల 'భారతీయుడు 2' సినిమాతో వస్తే.. అవుట్ డేటెడ్ కంటెంట్ అంటూ శంకర్ లాంటి దర్శకుడినే ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. మరి ఇప్పుడు కొత్తతరంతో సినిమాలు తెరకెక్కిస్తున్న టాలీవుడ్ సీనియర్ దర్శకుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.