పుష్ప 2 కలెక్షన్స్.. లెక్క ఎంతవరకు వెళ్లిందంటే..
ఇప్పటి వరకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లు రాబట్టిందో వివరంగా తెలుసుకుందాం.
By: Tupaki Desk | 13 Dec 2024 11:16 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ విడుదలై రోజులు గడుస్తున్నా కూడా కలెక్షన్లు అందుకోవడంలో అస్సలు తగ్గడం లేదు. విడుదలైన మొదటి రోజే అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన ఈ సినిమా, వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ విజయంతో పుష్ప-2 తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగిన మరో చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లు రాబట్టిందో వివరంగా తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప-2 వసూళ్ల హవా మొదటి రోజు నుంచి సాలీడ్ గానే ఉంది. ఇక నైజాంలో ఈ సినిమా తొలి వారం రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. షేర్ విషయానికి వస్తే, రూ.65 కోట్లు దాటడం విశేషం. ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో కలిపి సినిమా రూ.90 కోట్ల గ్రాస్, రూ.55 కోట్ల షేర్ అందుకుంది. సీడెడ్లో కూడా సినిమా ప్రభావం భారీగా ఉండి, రూ.33 కోట్ల గ్రాస్, రూ.25 కోట్ల షేర్ రాబట్టడం గమనార్హం.
ఈ వసూళ్లతో పుష్ప-2 తెలుగులో మాత్రమే కాకుండా దక్షిణాదిన కూడా తన ప్రభావాన్ని చూపించింది. తెలుగుతో పాటు తమిళనాడు, కర్ణాటకలో పుష్ప 2 అద్భుతమైన వసూళ్లు సాధించింది. కర్ణాటకలో ఈ చిత్రం రూ.70 కోట్ల గ్రాస్, రూ.36 కోట్ల షేర్ రాబట్టింది. తమిళనాట సినిమా గ్రాస్ రూ.50 కోట్ల మార్కుకు చేరువ కాగా, షేర్ రూ.22 కోట్లకు దగ్గరగా ఉంది.
అయితే కేరళలో ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోయింది. అక్కడ పుష్ప-2 కేవలం రూ.15 కోట్ల గ్రాస్, రూ.6 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. సెకండ్ వీక్ లో ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. నార్త్ లో అయితే పుష్ప-2 అంచనాలను మించి రికార్డులు క్రియేట్ చేస్తోంది. హిందీ వెర్షన్ ఇప్పటి వరకు రూ.440 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. షేర్ విషయంలో రూ.200 కోట్లకు చేరువగా ఉండడం విశేషం.
హిందీ బెల్ట్‌లో ఈ స్థాయి వసూళ్లు సాధించడం పుష్ప-2 మేనియాను స్పష్టంగా చూపుతోంది. ఈ విజయం బాలీవుడ్ మార్కెట్‌లో కూడా పుష్ప 2 ప్రత్యేక స్థానాన్ని సంపాదించేందుకు కారణమైంది. విదేశాల్లో పుష్ప.2 ప్రభావం విపరీతంగా ఉంది. యుఎస్ మార్కెట్‌లో ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వైపు దూసుకెళ్తోంది. షేర్ కూడా రూ.50 కోట్లకు చేరువగా ఉంది. అలాగే ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సినిమా దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పుష్ప-2 అంతర్జాతీయంగా టాలీవుడ్ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన సినిమా అనే చెప్పాలి.
ఈ వారం రోజుల్లోనే పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు దేశీయ మార్కెట్‌లోనే కాకుండా, విదేశీ మార్కెట్‌లో కూడా ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను సాధించడం గమనార్హం. తొలి వారం పూర్తయ్యే సరికి ఈ సినిమా సాధించిన ఈ విజయాలు, టాలీవుడ్ సినిమాల స్థాయిని మరో మెట్టుకు ఎక్కించాయి. మొత్తానికి, పుష్ప-2 తొలివారంలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ, తన స్థాయిని దేశీయ అంతర్జాతీయ బాక్సాఫీస్‌లపై చూపించగలిగింది. మరి ఈ సినిమా రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.