Begin typing your search above and press return to search.

చిన్నప్పుడు అన్నింటా కుల వివక్షే.. అందుకే అలా..: డైరెక్టర్

చియాన్ విక్రమ్ హీరోగా రూపొందిన తంగలాన్ ను హిందీలోకి కూడా త్వరలో రీమేక్ చేయనున్నారు.

By:  Tupaki Desk   |   1 Sep 2024 5:07 AM GMT
చిన్నప్పుడు అన్నింటా కుల వివక్షే.. అందుకే అలా..: డైరెక్టర్
X

సమాజంలోని సమస్యలను కథలుగా రాసుకుని.. వాటికి కమర్షియల్ వేలో తెరకెక్కిస్తూ మంచి టాలెంటెడ్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు కోలీవుడ్ డైరెక్టర్ పా. రంజిత్. చిన్నప్పుడు తనలో మెదిలిన ప్రశ్నలే సినిమాలుగా తీస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. మద్రాసు, కబాలి, కాలా, సార్పట్ట.. రీసెంట్ గా వచ్చిన తంగలాన్ మూవీలతో ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. చియాన్ విక్రమ్ హీరోగా రూపొందిన తంగలాన్ ను హిందీలోకి కూడా త్వరలో రీమేక్ చేయనున్నారు.

ఆ తర్వాత బాలీవుడ్ లో మరో మూవీకి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న ఆయన.. ఆ చిత్రానికి బిర్సా ముండా అనే టైటిల్ ను రీసెంట్ గా పెట్టారు. స్టార్ హీరో అందులో నటించనున్నారు. అయితే కుల రహిత సమాజమే లక్ష్యంగా క్యాస్ట్‌ లెస్‌ కలెక్టివ్‌ సంస్థను ఏర్పాటు చేసి నిరుపేద సంగీతకారులతోపాటు గాయకులను ప్రోత్సహిస్తున్నారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న తపనతో వచ్చిన యువతకు చెన్నైలో అన్ని వసతులు కల్పిస్తూ ఉచితంగా సినిమా నైపుణ్యాలపై శిక్షణ అందిస్తున్నారు.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న కుల వివక్షపై మాట్లాడారు పా. రంజిత్. తమను ఊర్లో దారుణంగా చూసేవారని గుర్తు చేసుకున్నారు. ఓసారి తాము ఉండే వాడకు కాస్త దూరంలో ఉన్న మర్రిచెట్టు అరుగుపై కూర్చున్నానని, అప్పుడే పెద్దాయన ఒకరు వచ్చి తనను కిందకు నెట్టేశారని తెలిపారు. తాను ఆడుకునే ప్లేస్ కాదని చెప్పడమే కాకుండా.. చేయి కూడా చేసుకోబోయేవారని చెప్పారు. అలా ఎందుకో చేశారో అప్పుడు తనకు అర్థం అవ్వలేదని అన్నారు.

కిరాణా షాప్ కు వెళ్లి చాక్లెట్ కావాలని డబ్బులు ఇస్తే.. సదరు వ్యక్తులు విసిరికొట్టేవారని తెలిపారు. ఊరిలో తిరునాళ్లు అయ్యేటప్పుడు రక్ష కట్టమంటే తిట్టేవారని చెప్పారు. సామూహిక భోజనాలకు వెళ్తే దూరంగా కూర్చోమనేవాళ్లని అన్నారు. కొన్నిసార్లు ఏడుస్తూ.. నాన్న దగ్గరకు వెళ్లి ఎందుకిలా చేస్తున్నారని అడిగేవాడినని తెలిపారు. అప్పుడు తాము అంటరాని వాళ్లం కదా, ఎక్కడికీ వెళ్లకూడదని చెప్పేవారని అన్నారు. తాను టీనేజీలోకి వచ్చాక మొత్తం అర్థమైందన్నారు.

అయితే స్కూల్ లో మాత్రం తనను టీచర్లు మంచిగా చూసుకునేవాళ్లని పా.రంజిత్ తెలిపారు. చిన్నప్పటి నుంచి బాగా చదువుకునేవాడినని చెప్పారు. వాళ్లు తెచ్చుకున్న ఫుడ్ ను తనకు ఇచ్చేవారని వెల్లడించారు. అయితే ఇంటర్ తర్వాత డబ్బులు లేక చదువు ఆపేశానని పేర్కొన్నారు. కూలీగా కొన్ని రోజులు పని చేసి.. ఆ తర్వాత గోడల మీద సైన్ బోర్డులు రాసే వర్క్ చేశానని చెప్పారు. అనంతరం మద్రాస్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరానని.. అక్కడి నుంచి డైరెక్టర్ గా మారినట్లు తెలిపారు పా.రంజిత్.