పద్మ గ్రహీతలైన తెలుగు సినిమా దిగ్గజాలు!
ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ తెలుగు నటులకు సముచిత గౌరవం దక్కలేదని మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు దిగ్గజ నటులు ఆవేదన చెందారు.
By: Tupaki Desk | 26 Jan 2025 5:48 AM GMTభారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులు దశాబ్ధాలుగా సినిమా - సంస్కృతికి చేసిన విశేష కృషికి తెలుగు సినీ పరిశ్రమ నుండి పలువురు దిగ్గజాలను వరించాయి. ప్రతిష్టాత్మక పద్మ అవార్డులతో సత్కరించబడిన తెలుగు సినీ సెలబ్రిటీల జాబితాను పరిశీలిస్తే...
150 పైగా చిత్రాలతో తెలుగు సినీపరిశ్రమలో అసాధారణ స్టార్ డమ్, ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని దేశ అత్యున్నత పురస్కారాలు వరించాయి. 2006లో దేశ అత్యున్నత మూడవ పురస్కారం పద్మభూషణ్ తో భారత ప్రభుత్వం గౌరవించింది. 9 మే 2024న రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ గౌరవం లభించింది. నాలుగు దశాబ్దాలకు పైగా అజేయమైన కెరీర్ ని సాగించిన చిరంజీవి వినోదపరిశ్రమను శాసించారు. ఇప్పటికీ ఆయన నటుడిగా అజేయమైన సేవలందిస్తున్నారు.
విశ్వవిఖ్యాత నవరస నటసార్వభౌముడు, నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సినీనటుడిగానే కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను ప్రజలకు సేవలందించారు. ఎన్టీఆర్ మూడు జాతీయ అవార్డులు సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నారు. తెలుగు సినిమాకు, రాజకీయాల్లో ఆయన చేసిన సేవలకు గాను 1968లో ఆయనకు పద్మశ్రీ లభించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ తెలుగు నటులకు సముచిత గౌరవం దక్కలేదని మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు దిగ్గజ నటులు ఆవేదన చెందారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని టాలీవుడ్ దిగ్గజ నటులు మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్ బాబు సహా ఎందరో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు.
నటశిఖరం అక్కినేని నాగేశ్వరరావు (ANR) తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న పాత్రలతో అలరించారు. ఏఎన్నార్ ను కళ, సినిమా రంగాలకు చేసిన కృషికి గాను 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్ వరించాయి. అలాగే 2011 లో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించారు. ఏడు దశాబ్దాలకు పైగా ఆయన కెరీర్‌లో తెలుగు సినీపరిశ్రమను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ 2009లో పద్మభూషణ్ పురస్కారంతో గౌరవం అందుకున్నారు.
తెలుగు చిత్రసీమ మద్రాసు నుంచి హైదరాబాద్ కు వచ్చి అభివృద్ధి చెందడంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో పాటు కృష్ణ కృషి ఎనలేనిది. టాలీవుడ్ లో అత్యంత వేగంగా సినిమాలు చేసే కథానాయకుడిగా సూపర్ స్టార్ కృష్ణకు అరుదైన రికార్డ్ ఉంది. లెజెండరీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య, విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు, హాస్య నటుడు బ్రహ్మానందంలను పద్మ పురస్కారాలు వరించాయి.
కళాతపస్వి కె.విశ్వనాథ్ గొప్ప అభిరుచి ఉన్న కథల్ని ఎంచుకుని, సినిమాలతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసారు. కళను, సామాజిక సందేశంతో మిళితం చేసి, తెలుగు చిత్రసీమకు, భారతీయ సినిమాకు గుర్తింపు తెచ్చారు. 1992లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.