పద్మ పురస్కారం ఓన్లీ.. ఏదీ ఫ్రీ ఉండదు!
ఏదైనా రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాన్ని అందిస్తారు.
By: Tupaki Desk | 26 Jan 2024 11:40 AM GMTమెగాస్టార్ చిరంజీవి సహా మరో నలుగురికి ఈసారి పద్మ పురస్కారాల్లో పద్మవిభూషణ్‌ని ప్రకటించారు. 15 మంది తెలుగువారికి పద్మ పురస్కారాలు దక్కాయి. ఏదైనా రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాన్ని అందిస్తారు. ఈ ఏడాది చిరుకు ఈ పురస్కారం లభించగానే, అభిమాన లోకం, సినీవరల్డ్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
అయితే పద్మవిభూషణ్ తో పాటు పురస్కార గ్రహీతలకు ఇంకా ఎలాంటి ఆఫర్లు ఉంటాయి? భారీగా నగదు ముడుతుందా? ప్రయాణాల్లో ఉచితం ఉంటుందా? అంటూ ఆరాలు తీస్తున్నారు. కానీ పద్మ అవార్డు అనేది ఓ గౌరవం మాత్రమే. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ఇచ్చిన వ్యక్తులకు.. ఎలాంటి నగదు, రాయితీ ఇవ్వరు. అలానే రైలు లేదా విమాన ప్రయాణాల్లోనూ ఎలాంటి రాయితీలు ఉండవు. ఇకపోతే పద్మ పురస్కార గ్రహీతలు రాష్ట్రపతి భవన్‌లోకి వెళ్లి రాష్ట్రపతిని కలిసే అవకాశముంటుంది. పద్మ అవార్డులో భాగంగా రాష్ట్రపతి సంతకం ఉన్న ధ్రువీకరణ పత్రం, పతకం మాత్రం బహుకరిస్తారు. ఈ అవార్డు వల్ల ఆ వ్యక్తుల గురించి దేశమంతా పాపులరవుతారు... అంతకుమించి ఇంకేదీ ఉండదు.
చిరంజీవి కీర్తి కిరీటంలో ఇతర పురస్కారాలేవీ అంటే.. భారతీయ సినిమాకి చేసిన కృషికి, చిరంజీవి మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డులు, రఘుపతి వెంకయ్య అవార్డు(2016), తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డు(సౌత్)లను గెలుచుకున్నారు. 2006లో భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గానూ భారతదేశ మూడవ-అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ (2006)తో సత్కరించారు. అలాగే ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌తో సత్కారం అందుకున్నారు.
చిరంజీవి తన నాలుగున్నర దశాబ్ధాల కెరీర్ లో 150 పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ, ఫిక్షన్ నేపథ్య చిత్రంలో నటిస్తున్నారు. దీనిని పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా రిలీజ్ చేస్తారు. సైరా నరసింహారెడ్డితో పాన్ ఇండియా మార్కెట్ లో ప్రవేశించిన చిరంజీవి.. తదుపరి చిత్రాలతో తానేంటో నిరూపించాలని పట్టుదలగా ఉన్నారు.