యానిమల్ సక్సెస్.. హింస కాదు ముద్దు వల్లనే!
నెమ్మదిగా ప్రజల మౌత్ టాక్ కారణంగా ఇది 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఉన్ని ముకుందన్ లాంటి ఒక రైజింగ్ హీరోకి ఇది సర్ ప్రైజ్ హిట్.
By: Tupaki Desk | 1 Feb 2025 10:26 AM GMTఇటీవల సైలెంట్ గా వచ్చి పాన్ ఇండియన్ హిట్ గా నిలిచింది 'మార్కో' చిత్రం. అంతగా గుర్తింపు లేని హీరో, రక్తపాతం, హింసతో జుగుప్స కలిగించినా కానీ ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఆరంభం లక్షల్లో వసూలు చేసిన 'మార్కో' అంతకంతకు పెరుగుతూ ఒక రోజుకి 1కోటి వసూలు చేయడం ఒక సంచలనం. నెమ్మదిగా ప్రజల మౌత్ టాక్ కారణంగా ఇది 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఉన్ని ముకుందన్ లాంటి ఒక రైజింగ్ హీరోకి ఇది సర్ ప్రైజ్ హిట్.
అయితే ఈ సినిమా విజయంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హింస, రక్తపాతంతో సినిమాను చిత్రీకరించడం ఆందోళన కరమైన పరిణామమని ఆయన అన్నారు. మార్కో చిత్రంలో రక్తపాతం, హింసపై ప్రజలు ఫిర్యాదులు చేయడం, అసహనానికి గురవ్వడంతో తాను తన థియేటర్ నుంచి సినిమాని తొలగించానని ఆయన అన్నారు.
యానిమల్ ఫార్మాట్ ని కాపీ చేసి మార్కో సినిమా తీసారని కూడా ఆయన అన్నారు. కేవలం యాక్షన్ కారణంగా ఈ సినిమా విజయం సాధించింది. ఇది ప్రేక్షకులపై మంచి ముద్ర వేయలేదని నిహలానీ ఎత్తి చూపారు. రక్తపాత దృశ్యాలు.. పిల్లలు చూడకూడని ఇబ్బందికర సన్నివేశాలున్నాయని అన్నారు. యానిమల్ చిత్రం హింస కారణంగా కాదు. స్టార్ కాస్ట్, ముద్దు సన్నివేశాల కారణంగా వర్కవుటైందని కూడా నిహలానీ అన్నారు.
అంతకంతకు పెరిగిన కలెక్షన్స్:
మలయాళ చిత్రం మార్కో (2024) బాక్సాఫీస్ వద్ద ఆశ్చర్యకర ఫలితం అందుకుంది. హిందీ డబ్బింగ్ వెర్షన్ ఒక పాయింట్ తర్వాత వేగంగా రైజ్ అయింది. విడుదల రోజున కేవలం రూ.1లక్ష వసూలు చేసింది. ఆ తర్వాత రోజులు గడిచేకొద్దీ కలెక్షన్స్ పెరిగాయి. జనవరి 1న రూ. 1 కోటి వసూలు చేసింది. ఇది ఎక్కడ నుండి ప్రారంభమైందో పరిశీలిస్తే నమ్మశక్యం కాని ఫీట్. కేవలం మౌత్ టాక్ కారణంగానే ఇది సాధ్యమైంది. ప్రేక్షకులు ప్రధాన పాత్రధారి నటన, మాస్ అండ్ స్టైలిష్ ట్రీట్మెంట్, యాక్షన్‌ను ఇష్టపడ్డారు. కానీ సినిమాలో చాలా మంది బాధించే సన్నివేశాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో సన్నివేశాలపై ఫిర్యాదులు వచ్చాయి. మార్కో క్రూరమైన విజువల్స్ కారణంగా నిహలానీ తన థియేటర్ నుంచి సినిమాని కూడా తొలగించారు. ''మార్కోలో పిల్లలను చంపే భయంకరమైన దృశ్యాలపై నాకు అభ్యంతరాలున్నాయి. ప్రేక్షకులు ఈ చిత్రాలను చూడటానికి ఇష్టపడర''ని నిహలానీ అన్నారు.
రణబీర్ కపూర్ నటించిన 2023 బ్లాక్‌బస్టర్‌ను ప్రస్తావిస్తూ 'యానిమల్ సిండ్రోమ్' పరిశ్రమను పట్టిపీడిస్తోందని కూడా ఆయన అన్నారు. యానిమల్ హింస కారణంగానే కాకుండా స్టార్ కాస్ట్ కారణంగా కూడా విజయవంతమైంది. హీరో -హీరోయిన్ మధ్య స్నేహం కూడా అందరికీ నచ్చింది. హీరోయిన్ ఫ్యాక్టర్ వర్కవుటైంది అని అన్నారు.
మార్కో సినిమాను ప్రస్తుత సీబీఎఫ్‌సి ఎలా ఆమోదించిందో నిహలానీ ఆశ్చర్యపోయాడు. కొన్నిసార్లు, హింసతో కూడిన సినిమాలు కూడా యుఏ రేటింగ్‌ను పొందాయి. సీబీఎఫ్‌సిలోని దక్షిణాది సభ్యుల స్వభావం ముంబై వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ చాలా మంది సభ్యులు రాజకీయంగా అనుబంధంగా ఉంటారు. అక్కడ, సభ్యులు కొంతమంది నటులు లేదా నటీమణుల అభిమానులు. వారికి ఉదారవాద వైఖరి ఉంటుంది. ఇది మొదటి నుండి ఉన్నదేనని నిహలానీ అన్నారు. ప్రసూన్ జోషి ఛైర్మన్ గా ఉన్న CBFC సరిగా పని చేయడం లేదని కూడా నిహలానీ విమర్శించారు.