Begin typing your search above and press return to search.

ఆ జైలుకు రైతుబిడ్డ.. 14 రోజుల రిమాండ్!

అనంతరం రహస్య ప్రదేశంలో వారిద్దరినీ విచారించి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రశాంత్తోపాటు అతడి సోదరుడిని పోలీసులు హాజరు పరిచారు.

By:  Tupaki Desk   |   21 Dec 2023 4:47 AM GMT
ఆ జైలుకు రైతుబిడ్డ.. 14 రోజుల రిమాండ్!
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం అర్థరాత్రి.. పల్లవి ప్రశాంత్తోపాటు అతడి సోదరుడికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిద్దరినీ జూబ్లీహిల్స్ పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఆదివారం బిగ్బాస్ ఫైనల్ జరిగిన సమయంలో జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద అర్ధరాత్రి జరిగిన ధ్వంసం, దాడి ఘటనను పోలీసులు సుమోటో తీసుకుని కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ-1గా పల్లవి ప్రశాంత్‌ పేరును చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు బుధవారం రాత్రి గజ్వేల్ మండలం కొల్గుర్‌లో ప్రశాంత్‌ను, ఏ2గా ఉన్న అతడి సోదరుడు మహవీర్ను అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు.

అనంతరం రహస్య ప్రదేశంలో వారిద్దరినీ విచారించి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రశాంత్తోపాటు అతడి సోదరుడిని పోలీసులు హాజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఇద్దరికీ 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఇద్దరినీ చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆరోజు దాడిలో పాల్గొన్న మరో 14మంది యువకులను సైతం విచారిస్తున్నట్లు వెల్లడించారు.

ఆరోజు ఏం జరిగింది?

బిగ్‌బాస్‌ 7 ఫైనల్స్‌ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టైటిల్‌ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌ రాత్రి 12 గంటల సమయంలో స్టూడియోస్‌ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత రన్నరప్ అమర్దీప్ కూడా బయటకు వచ్చారు. దీంతో వారికి అభిమానులు స్వాగతం పలికారు.

ఆ సమయంలో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం మొదలైంది. పలువురు అభిమానులు రెచ్చిపోయి అమర్‌దీప్‌ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు. అదే సమయంలో ఆ రూట్లో వెళ్తున్న ఆరు ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. గొడవ జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అభిమానులను వెంటనే అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ ఘటనపై రెండు వేర్వేరు కేసులను నమోదు చేసి జూబ్లీహిల్స్‌ పోలీసులు సుమోటోగా తీసుకున్నారు. ఈ దాడిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుల అద్దాలు పగులగొట్టిన వారిపై ఫిర్యాదు చేసినట్లు ట్వీట్ చేశారు.