పాన్ ఇండియా రేస్‌లో జోరున్న హీరోలు
ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రాల కోసం నిర్మాతలు ఏకంగా 2000 కోట్లు ఖర్చు చేస్తున్నారన్న ప్రచారం ఉంది.
By: Tupaki Desk | 27 Nov 2023 4:23 AM GMTటాలీవుడ్ అగ్ర హీరోల్లో ఊహించని విధంగా పాన్ ఇండియా రేస్ మొదలైంది. ఈ రేస్ లో డార్లింగ్ ప్రభాస్ ఇప్పటికే నంబర్ 1 గా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ వేడి తగ్గనీయడం లేదు. అతడి తర్వాత ఆ స్థానాన్ని కైవశం చేసుకునేందుకు ఎన్టీఆర్- చరణ్ - బన్ని పోటీపడుతున్నారు. రాజమౌళితో సినిమా చేస్తూ మహేష్ కూడా రేసులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `హరిహర వీరమల్లు`తో పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేసినా ఈ చిత్రం ఇప్పటికీ పూర్తి కాకపోవడం ఆశ్చర్యకరం.
ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రాల కోసం నిర్మాతలు ఏకంగా 2000 కోట్లు ఖర్చు చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ప్రభాస్ ఇప్పటికిప్పుడు సలార్ 1- సలార్ 2, కల్కి, స్పిరిట్, మారుతితో ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. వీటన్నిటి కోసం 2000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కేవలం సలార్ కోసమే 600 కోట్లు పైగా ఖర్చు చేస్తుండగా, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలోని `కల్కి 2898 AD` కోసం ఇంతకు డబుల్ ఖర్చు చేస్తున్నారన్న ప్రచారం కుంది. ఇతర సినిమాలకు కలుపుకుని ఓవరాల్ గా అంత భారీ మొత్తం పెడుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నిటికీ (పై నాలుగింటికి) 3500 -4000 కోట్ల వరకూ బిజినెస్ చేస్తారని ఒక అంచనా.
ప్రభాస్ తర్వాత మళ్లీ ఆ రేంజులో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నది ఎవరు? అంటే ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. యంగ్ యమ జోరు చూస్తుంటే అతడు తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు. దేవర రెండు భాగాలకు 300 కోట్లు ఖర్చు చేస్తుండగా, యష్ రాజ్ ఫిలింస్ `వార్ 2` కోసం 500-600 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. ఎన్టీఆర్ 31 చిత్రం ప్రశాంత్ నీల్ - మైత్రి కాంబినేషన్ లో ఉంటుంది. దీనికోసం 300- 400 కోట్లు ఖర్చవుతుందని అంచనా. సుమారుగా 1400 కోట్ల వరకూ తారక్ కోసం నిర్మాతలు బడ్జెట్లు పెడుతున్నారు. దానికి డబుల్ బిజినెస్ చేస్తారనడంలో సందేహం లేదు. ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ ఇప్పుడు తెలివైన గేమ్ ఆడుతున్నాడు.
అయితే చరణ్- బన్ని రేసులో లేరా? అంటూ ఆసక్తికర చర్చ ఇటీవల మొదలైంది. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో సినిమాపైనే ఫోకస్ పెట్టాడు. శంకర్ మూవీ గేమ్ ఛేంజర్ బడ్జెట్ 200కోట్లు ఉంటుందన్న ప్రచారం ఉంది. ఇందులో 7 నిమిషాల యాక్షన్ బ్లాక్ కోసం 70కోట్లు ఖర్చు చేయించాడన్న ప్రచారం ఉంది. అరుదైన లొకేషన్లలో భారీ ట్రైన్ ఎపిసోడ్.. హార్స్ రైడింగ్ ఎపిసోడ్ వగైరా వాటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. చరణ్ కెరీర్ లో బెస్ట్ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలవనుంది. అయితే శంకర్ తో మూవీ తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేస్తాడు? అన్నదానిపై ఎలాంటి స్పష్ఠతా రాలేదు.
మరోవైపు పుష్ప 2 తో పాన్ ఇండియా స్టార్ డమ్ ని పర్మినెంట్ చేయాలని అల్లు అర్జున్ పంతంతో ఉన్నాడు. అతడు సీక్వెల్ కోసం చాలా కసిగా పని చేస్తున్నాడు. ఐకాన్ స్టార్ అన్న బిరుదును సార్థకం చేసుకునేందుకు అతడి ఎత్తుగడలు అతడికి ఉన్నాయి. సుకుమార్ ఈ ప్రాజెక్ట్ కోసం రేయింబవళ్లు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. మరోవైపు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో సినిమాని ప్రకటించి మహేష్ బాబు కూడా పాన్ ఇండియా రేస్ లోకి దూకాడు. రాజమౌళితో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుందని ఇది హాలీవుడ్ లో కూడా రిలీజవుతుందని ప్రచారం ఉంది. దీంతో టాలీవుడ్ లోని అరడజను పాన్ ఇండియా స్టార్ల నడుమ రేసింగ్ వేడెక్కిస్తోంది. అయితే ఈ రేస్ లో ప్రస్తుతానికి ప్రభాస్- ఎన్టీఆర్ ఇతరుల కంటే జోరుమీదున్నారన్న ప్రచారం సాగుతోంది.