గూండాల మధ్యలో అమాయకుడినయ్యా!
బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఫేమస్ నటుల్లో ఆయన ఒకరు
By: Tupaki Desk | 9 Jan 2024 4:30 AM GMTబాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఫేమస్ నటుల్లో ఆయన ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు. నటనలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నా డు. ఇప్పుడాయన కెరీర్ లో మరింత బిజీగా సినిమాలు చేస్తున్నాడు. అయితే అలాంటి నటుడికి సంచలనా రాంగోపాల్ వర్మ నుంచి ఓ ఆసక్తికర సన్నివేశం ఎదురైందిట. వర్మ సినిమాకి ఆడీషన్ కి వెళ్తే తనకి హ్యాండ్ ఇచ్చి వేరే నటుల్ని తీసుకున్నారని అన్నారు.
అయితే అలా రిజెక్ట్ కావడంతోనే ఇంకా గొప్ప అవకాశాలు అందుకుని నటుడిగా ఫేమస్ అయినట్లు ఆనాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు. ఆవేంటో ఆయన మాటల్లోనే.. 'ఓసారి రాంగోపాల్ వర్మ ఆఫీస్ కి వెళ్లాను. అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్లంతా చూడటానికి రౌడీలు..గుండాల్లో ఉన్నారు. వాళ్లందరి మధ్యలో నేను అమాయకంగా ముఖం పెట్టుకుని కనిపిస్తున్నాను. నేను చూడటానికి అమాయకంగానే కనిపిస్తాను.
వాళ్లందరిలో నేను అతి పెద్ద అమాయకుడిగా ఉన్నాను. మరి అలాంటి అమాయకుడు గూండా పాత్రకి సూట్ అవుతాడా? లేదా? అన్న అనుమానంతోనే అక్కడికి వెళ్లాను. కొందరికైతే ముఖం మీద గాయాలైనట్లు కనిపించింది. మీరంతా నటులేనా? అని అడిగితే అవునని అన్నారు. మరి ఎందుకిలా దెబ్బలతో వచ్చారంటే? ఆర్జీవీ ఇలా కనిపించిన వాళ్లకే అవకాశం ఇస్తారన్నారు. ఆ తర్వాత కాసేపటికి వర్మ పిలిచి బెంచీ మీద కూర్చోమన్నారు.
నా ఎదురుగా ఆయన కూర్చుని పావుగంట నా కళ్లలోకి కళ్లు పెట్టి చూసారు. అదే పనిగా చూస్తే ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తుంది. నాకు అప్పుడు అలాగే అనిపించింది. ఆ తర్వాత నన్ను వెళ్లిపోమన్నారు. మళ్లీ ఎప్పుడూ కలవలేదు. కానీ అతను గొప్ప దర్శకుడు. నేను కలిసిన ప్రతీసారి నా పనితనాన్ని పొగుడుతుంటారు. కాకపోతే ఆ సమయానికి మా ఇద్దరికి సెట్ కాలేదు అనిపించింది. అప్పుడలా జరిగకపోతే ఈ క్రేజ్ వచ్చేది కాదేమో అనిపిస్తుంది. అంతా మన మంచికే అనుకున్నాను' అని అన్నారు.