Begin typing your search above and press return to search.

ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదు

దర్శకుడు పా రంజిత్ మాట్లాడుతూ... తంగలాన్ సినిమా యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నాకు కన్నీళ్లు ఆగలేదు.

By:  Tupaki Desk   |   7 Aug 2024 2:45 AM GMT
ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదు
X

తమిళ సినీ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న 'తంగలాన్‌' సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. చియాన్ విక్రమ్‌ హీరోగా పా రంజిత్‌ దర్శకత్వంలో రూపొందిన తంగలాన్ సినిమా పై ప్రకటించినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా విక్రమ్‌ లుక్ మరియు సినిమా కాన్సెప్ట్‌ తెలిసిన తర్వాత సినిమా స్థాయి అమాంతం పెరిగింది అనడంలో సందేహం లేదు.

ఈ సినిమాలో విక్రమ్‌ ను విభిన్నమైన లుక్ లో చూశాం. తంగలాన్ సినిమా కోసం విక్రమ్‌ చాలా మారాడు. ఆయన ఫిజిక్ విషయంలో ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వారు కూడా షాక్‌ అయ్యే విధంగా మారాడు. అంతగా మారడానికి ఆయనకు కథ నచ్చడమే అంటూ ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఒక హీరో సినిమా కోసం, పాత్ర కోసం ఇంత కష్టపడుతారా అంటూ చాలా మంది కూడా విక్రమ్‌ తంగలాన్ గెటప్ ను చూసి అన్నారు అంటే ఏ స్థాయిలో ఆయన ఈ సినిమా కోసం మేకోవర్‌ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు.

సోషల్‌ మీడియాలో తంగలాన్ సినిమాకి ఇప్పటికే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా దేశ వ్యాప్తంగా చిత్ర యూనిట్‌ సభ్యులు చక్కర్లు కొడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌ కి కూడా విక్రమ్‌, పా రంజిత్‌ తో పాటు ఇతర యూనిట్‌ సభ్యులు విచ్చేశారు. ఆ సమయంలో మీడియాతో విక్రమ్‌ మాట్లాడుతూ ఈ సినిమా కథ కోసం ఏం చేసినా తప్పు లేదు అనిపించింది. అందుకే చాలా రోజుల సమయం కేటాయించి, బరువు తగ్గడంతో పాటు, చాలా కష్టమైన సన్నివేశాలు చేశాను అన్నాడు.

దర్శకుడు పా రంజిత్ మాట్లాడుతూ... తంగలాన్ సినిమా యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నాకు కన్నీళ్లు ఆగలేదు. ముఖ్యంగా విక్రమ్‌ సర్‌ పక్కటెముకలకు గాయం అయిన సమయంలో కూడా ఆయన యాక్షన్ సన్నివేశాల్లో షూటింగ్‌ లో పాల్గొన్నారు. ఆ యాక్షన్ సన్నివేశాల షూటింగ్ కి గ్యాప్ తీసుకోవాలని భావించాం. కానీ విక్రమ్‌ సర్‌ మాత్రం షూటింగ్‌ కి బ్రేక్ రాకూడదు అనే ఉద్దేశ్యంతో నొప్పిని భరిస్తూనే షూటింగ్‌ లో పాల్గొన్నారు. ఆయన షూటింగ్‌ సమయంలో పడ్డ బాధ కు నాకు కన్నీళ్లు ఆగలేదు.

షూటింగ్‌ పేరుతో విక్రమ్‌ సర్ ను ఇంత బాధ పెడుతున్నాను అనిపించింది. ఆయన మాత్రం ఎంత కష్టం అయినా ఇష్టంతోనే షూటింగ్‌ లో పాల్గొన్నాడు. ఆయన గతంలో కూడా కాలుకు 23 ఆపరేషన్ లు అయినా కూడా షూటింగ్‌ లో పాల్గొన్నారు. అంతటి డెడికేషన్ ఉండటం వల్లే విక్రమ్‌ సర్ ఈ స్థాయికి చేరుకున్నారు అంటూ పా రంజిత్‌ చెప్పుకొచ్చాడు.

ఈ మధ్య కాలంలో పా రంజిత్ నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా ఉన్నారు. షూటింగ్‌ సమయంలో పడ్డ కష్టం అంతా కూడా హిట్ టాక్ తో పోతుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పోటీ లేకపోవడంతో సినిమా భారీ వసూళ్లు దక్కించుకుంటుంది అనే నమ్మకంను బాక్సాఫీస్‌ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.