నలుగురిని కంటే నగదు నజరనా... భారత్ లో కూడానా..?
గత కొంతకాలంగా ప్రపంచంలోని పలు దేశాల్లో తగ్గిపోతున్న జననాల రేటుపై తీవ్ర ఆందోళనలు నెలకొంటున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 Jan 2025 9:30 PM GMTగత కొంతకాలంగా ప్రపంచంలోని పలు దేశాల్లో తగ్గిపోతున్న జననాల రేటుపై తీవ్ర ఆందోళనలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో చైనా, జపాన్, రష్యా దేశాలు సమస్య తీవ్రత విషయంలో పోటీ పడుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలంటూ యువతకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
ఇందులో భాగంగా.. పిల్లలను కనిన తల్లి తండ్రులకు రకరకాల ఆఫర్లు, నగదు బహుమతులను చైనా ప్రభుత్వం చాలా సందర్భాల్లో ప్రకటించగా.. 25 ఏళ్ల లోపు పిల్లలను కనిన వారికి భారీ నగదు బహుమతి అని రష్యాలో బహుమతుల ప్రకటనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా నలుగురుని కంటే నగదు బహుమతి అనే విషయం తెరపైకి వచ్చింది.
అవును... తాజాగా మధ్యప్రదేశ్ లోని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పరశురామ్ కల్యాణ్ బోర్డు ఓ ప్రకటన చేసింది. తమ కమ్యూనిటీని పెంచుకునేందుకు ఎక్కువ మంది సంతానాన్ని కనాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా... నలుగురు పిల్లలను కనే బ్రాహ్మణ దంపతులకు లక్ష రూపాయల నజరానా ప్రకటించింది!
వివరాళ్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఇటీవల ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పరశురామ్ కల్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. ఈ సమయంలో.. మనం మన కుటుంబాలపై దృష్టి పెట్టడం మానేశామని మొదలుపెట్టిన ఆయన... ఇప్పుడు యువత ఒక్క బిడ్డతోనే సరిపెట్టేస్తున్నారని అన్నారు.
అయితే.. ఇది చాలా సమస్యాత్మకంగా మారుతోందని.. ఈ సమస్య నుంచి భవిష్యత్ తరాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే అని చెప్పిన పండిత్ విష్ణూ రాజోరియా... అందువల్ల ప్రతీ ఒక్కరూ కనీసం నలుగురు సంతానం కలిగి ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నగదు జనరానా విషయాన్ని వెల్లడించారు.
ఇందులో భాగంగా... నలుగురు పిల్లలను కనే మహిళలకు కల్యాణ్ బోర్డు తరుపున రూ. లక్ష నజరానా అందిస్తామని.. తాను బోర్డు అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా ఈ అవార్డు కొనసాగుతుందని అన్నారు. దీంతో... ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.