పుష్ప2పై పరుచూరి రివ్యూ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
By: Tupaki Desk | 8 Feb 2025 9:27 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థియేటర్లలో మంచి టాక్ తో నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టిన పుష్ప2 ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాపై ప్రముఖ టాలీవుడ్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూని తెలిపారు.
పుష్ప2 చూశాక సుకుమార్ ను అభినందించాలని ఫోన్ చేసినప్పుడు ఆయన ఎలా ఉంది సార్ సినిమా అని అడిగాడని దానికి తాను కాడిని ఓ వైపు నువ్వు, ఇంకోవైపు అల్లు అర్జున్ మోస్తే ఆ బరువంతా ఎలా ముందుకెళ్తుందో అలా ఉందని చెప్పినట్టు తెలిపారు. ఇక పుష్ప2 సినిమా గురించి ఆయన చాలా అద్భుతమైన రివ్యూ ఇచ్చారు.
ఓపెనింగ్ షాట్ లోనే అల్లు అర్జున్ లాంటి మాస్ హీరోని వేలాడదీయడంతో ప్రతి ఒక్క ఆడియన్ ఎంతో థ్రిల్ అయి ఉంటారని, అప్పుడప్పుడు చాలా చిన్న విషయాలే పెద్ద ఘటనలకు దారి తీస్తాయని అలా ఓ సిల్లీ రీజన్ దాదాపు 3.40 గంటల సినిమాకు కారణమైందని, సీఎంతో ఫోటో దిగు అని భార్య అడగటం వల్లే అసలు ఈ గొడవంతా జరుగుతుందన్నారు.
తన భార్య కోరికను సీఎంకు చెప్తే నీలాంటి వాళ్లతో మేం ఫోటోలు దిగకూడదయ్యాఅని చెప్పడంతో అవమానానికి గురైన హీరో, భార్య కోసం సీఎంను ఆ పదవి నుంచి తప్పించి రావు రమేష్ ను కూర్చోపెట్టే వరకు వెళ్తాడన్నారు. ఇక పోలీసాఫీసర్ ఫహాద్ ఫాజిల్ పుష్ప2లో విలన్ కాదని, ఈ సినిమాలో విలన్ పుష్పరాజేనని, హీరోది విలన్ లాంటి పాత్ర అని ఆయన పేర్కొన్నారు.
పుష్పరాజ్ పై భన్వర్‌సింగ్ షెకావత్ పగతో పనులు చేశాడు కాబట్టి ఆయన నెగిటివ్ గా అనిపించడని, అంతేకాదు పుష్ప షెకావత్ కు సారీ చెప్పే సీన్ లో తాను బోల్తా పడ్డానని, అక్కడ సారీ కాకుండా వేరే ఏదో ప్లాన్ చేస్తారేమో అనుకున్నా కానీ పుష్పరాజ్ ప్రతినాయకుడైన హీరో కాబట్టి అక్కడ పుష్పరాజ్ సారీ చెప్పినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయగలిగారని పరుచూరి విశ్లేషించారు.
షెకావత్ అసహనానికి గురై తాను పట్టుకున్న దుంగలను తగలబెట్టినప్పుడు షెకావత్ లోపలే ఉంటాడు. ఆ షాట్ ను సుకుమార్ చాలా తెలివిగా లాంగ్ షాట్‌లో చూపించావని సుకుమార్ తో అన్నప్పుడు వెంటనే నవ్వాడని, ఆయన కూడా అలానే ప్లాన్ చేసి ఆ సీన్ ను రాసుకుని ఉండొచ్చని పరుచూరి అన్నారు. ఎందుకంటే షెకావత్ లాంటి పాత్ర అంత ఈజీగా అలా మంటల్లో కాలిపోదని ఆయన తెలిపారు.
సినిమాలో ఆడ వేషంలో బన్నీ చాలా బాగా నటించాడని, రష్మిక శ్రీవల్లి పాత్రలోని బరువును సినిమా మొత్తం మోసిందని, పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరాయని, క్లైమాక్స్ లో అంతా అయిపోయిందనుకున్న టైమ్ లో పుష్ప3 ఉంటుందని చెప్పి సుకుమార్ అందరికీ షాకిచ్చాడని ఆయన అన్నారు.