Begin typing your search above and press return to search.

హిట్టొచ్చినా ఛాన్సుల్లేవ్.. హీరోయిన్‌ని టార్గెట్ చేసారా?

పార్వతి తిరువోతు వరుసగా హిట్ సినిమాల్లో న‌టిస్తోంది. అయినా అవ‌కాశాలు రావ‌డం లేదు. దీనికి కార‌ణ‌మేమిటి? అని ప్ర‌శ్నిస్తే...

By:  Tupaki Desk   |   15 Feb 2025 4:14 AM GMT
హిట్టొచ్చినా ఛాన్సుల్లేవ్.. హీరోయిన్‌ని టార్గెట్ చేసారా?
X

ప‌రిశ్ర‌మ‌లో మేల్ డామినేష‌న్ ని ప్ర‌శ్నించే న‌టీమ‌ణుల‌కు అవ‌కాశాలు దాదాపు లేన‌ట్టే. ఎదురు దాడికి దిగ‌డం, నిల‌దీయ‌డం వంటివి స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తాయి. సృజ‌నాత్మ‌క ప‌రిశ్ర‌మ‌లో చాలా లౌక్యం అవ‌స‌రం. అలాంటి వారికి మాత్ర‌మే మ‌నుగ‌డ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ర‌చ్చ చేసే న‌టీమ‌ణుల‌ను ఇండ‌స్ట్రీ టార్గెట్ చేస్తుంది. అలాంటి ఒక స‌మ‌స్య‌ను మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌లో పార్వ‌తి తిరువోతు ఎదుర్కొన్నారా? అంటే.. అవున‌నే త‌న నుంచి స‌మాధానం.

పార్వతి తిరువోతు వరుసగా హిట్ సినిమాల్లో న‌టిస్తోంది. అయినా అవ‌కాశాలు రావ‌డం లేదు. దీనికి కార‌ణ‌మేమిటి? అని ప్ర‌శ్నిస్తే... ఎంపిక‌ల విష‌యంలో సెల‌క్టివ్ గా ఉండ‌టం ఒక కార‌ణ‌మైతే, కొంద‌రు హీరోల‌తో తాను న‌టించ‌న‌ని చెప్ప‌డం మ‌రో కార‌ణ‌మ‌ని కూడా పార్వ‌తి స్వ‌యంగా తెలిపారు. అలాగే మలయాళ చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న ఇత‌ర సవాళ్ల గురించి బహిరంగంగా చర్చించారు. విజ‌యాలు అందుకున్నా.. ప‌రిమితంగానే అవ‌కాశాలొస్తున్నాయి. కొంద‌రు న‌టుల‌తో నేను న‌టించ‌లేదు. దానివ‌ల్ల వాళ్లు అవ‌కాశాలివ్వ‌రు.. అని పార్వ‌తి అన్నారు. తాను కూడా వారితో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. తన కంటూ కొన్ని నిబంధనలు ఉన్నాయ‌ని అంగీక‌రించింది. కొంద‌రిని కాద‌నుకునే కొనసాగాల‌నే తన నిర్ణయంలో స్థిరంగా ఉన్నాన‌ని తెలిపారు. కొన్ని ఎదురు దెబ్బ‌లు, అవ‌కాశాల్లేక‌పోవ‌డం కూడా స్వావ‌లంబ‌న వైపు ఆలోచించేలా చేసాయ‌ని పార్వ‌తి అన్నారు.

అవకాశాలు కోల్పోవడం గురించి తాను ఇంతకుముందు కూడా మాట్లాడానని చెప్పిన పార్వ‌తి.. అది ఇప్పటికీ ఒక కీలకమైన సమస్యగానే ఉందని అన్నారు. పరిశ్రమలో ఒకరిని సైలెంట్ చేయ‌డానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి ``వారికి పని లేకుండా చేయడం`` అని తాను న‌మ్ముతోంది. అవకాశాలు లేకుండా ఎవ‌రైనా న‌టీన‌టులు స్కిల్‌ని పెంచుకోలేర‌ని పార్వ‌తి అన్నారు. తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో న‌టించినా.. మలయాళంలో తనకు లభించిన అవకాశాలు తాను ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉన్నాయని పార్వతి వివరించింది. నేను కొంద‌రితో న‌టించ‌లేదు. వారు స‌హ‌జంగానే అవ‌కాశాలివ్వ‌రు. కేవ‌లం హీరోలే కాదు సాంకేతిక నిపుణులు కూడా అవకాశాలు రాకుండా చేస్తార‌ని పార్వ‌తి అన్నారు. నటీనటుల ఎంపిక సృజనాత్మక ఎంపిక అయినా కానీ, స‌రిపోయే పాత్ర‌ల‌కు న‌టుల‌ను తీసుకోవాలని అన్నారు.

గ‌త ఇంట‌ర్వ్యూలో ఓసారి పార్వతి తాను పరిశ్రమ నుండి దూరంగా ఉన్నానని ప్రస్తావించింది. అయితే తాను ప‌రిశ్ర‌మ‌ను వ‌దిలి వెళ్లిపోలేదని స్పష్టం చేసింది. ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు వెళ్లడం అంత సులభం కాదని - మార్కెట్ డైనమిక్స్ మారుతాయ‌ని, నటులు తదనుగుణంగా మారాలని ఆమె వివరించింది. ఇతర పరిశ్రమలలో మంచి అవకాశాలు వస్తే న‌టించడానికి తాను సిద్ధంగా ఉన్నానని పార్వ‌తి అన్నారు. సిటీ ఆఫ్ గాడ్స్, బెంగ‌ళూరు డేస్ చిత్రాల మధ్య నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆ స‌మ‌యంలో రీఎంట్రీ ఇచ్చింద‌ని కూడా అన్నారు. కానీ నేను అలా భావించ‌లేదు! అని పార్వ‌తి తిరువోతు తెలిపారు. టేక్ ఆఫ్, ఎన్ను నింటే మొయిదీన్, ఉయారే, చార్లీ వంటి చిత్రాలు వాణిజ్యపరంగా విజయం సాధించినా కానీ, ఆ తర్వాత కొన్ని మలయాళ చిత్రాలలో మాత్రమే నటించగలిగింది. ఆఫర్లు లేకపోవడం వల్ల న‌టించ‌లేదు.