Begin typing your search above and press return to search.

పెళ్లి పీటలు ఎక్కిన నాని హీరోయిన్‌

నాని హీరోగా నటించిన 'జెండాపై కపిరాజు' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పార్వతి నాయర్‌.

By:  Tupaki Desk   |   13 Feb 2025 11:05 AM GMT
పెళ్లి పీటలు ఎక్కిన నాని హీరోయిన్‌
X

నాని హీరోగా నటించిన 'జెండాపై కపిరాజు' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పార్వతి నాయర్‌. తెలుగులో ఈమె చేసిన సినిమాలు పెద్దగా లేకున్నా తమిళ్‌లో చేసిన సినిమాలు తెలుగులో డబ్‌ కావడం ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో ఈ అమ్మడికి పలు ఆఫర్లు వచ్చినా ఏవో కారణాల వల్ల నో చెబుతూ వచ్చింది. గత ఏడాది ఒక మలయాళం సినిమా, ఒక తమిళ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పార్వతి నాయర్‌ ప్రస్తుతం ఒక తమిళ్‌ సినిమాను చేస్తోంది. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలో పార్వతి నాయర్‌ పెళ్లి పీటలు ఎక్కింది.

సాధారణంగా హీరోయిన్స్‌ వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపించరు. పెళ్లి చేసుకోవడం ద్వారా సినిమా ఆఫర్లకు బ్రేక్‌ పడే అవకాశం ఉందని, పెళ్లి తర్వాత కెరీర్‌ సాఫీగా సాగకపోవచ్చు అని చాలా మంది హీరోయిన్స్ అనుకుంటారు. అయినా వరుసగా సినిమాలు చేస్తున్న పార్వతి నాయర్‌ పెళ్లికి సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. చాలా కాలంగా బిజినెస్‌మెన్‌ అశ్రిత్‌తో ప్రేమలో పార్వతి నాయర్‌ ఉంది. అతడితో సుదీర్ఘ కాలంగా ప్రేమలో ఉన్న ఈమె తాజాగా ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధం అయ్యారు. తాజాగా పెళ్లి ఫోటోలను షోషల్‌ మీడియా ద్వారా షేర్ చేశారు. పార్వతి నాయర్‌ పెళ్లి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

తమిళ్‌, మలయాళం, తెలుగులో కలిపి మొత్తంగా 30 సినిమాల్లో నటించిన ఈ అమ్మడు పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయనున్నట్లు చెప్పుకొచ్చింది. ముందు మాదిరిగానే సినిమాల్లో నటిస్తాను అంటూ చెప్పిన పార్వతి నాయర్‌కి ఇంతకు ముందులా సినిమాల్లో ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి. కొందరు హీరోయిన్స్ పెళ్లి తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. కొందరు మాత్రం సినిమాల ఎంపిక విషయంలో తప్పుడు నిర్ణయాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నారు. బాలీవుడ్‌లో మాదిరిగా సౌత్‌లో పెళ్లి అయిన హీరోయిన్స్‌ వరుసగా సినిమాలు చేయలేక పోతున్నారు. అతి కొద్ది మంది మాత్రమే సినిమాల్లో పెళ్లి తర్వాత కూడా కొనసాగుతున్నారు.

అబుదాబిలోని మలయాళీ కుటుంబంలో జన్మించిన పార్వతి నాయర్‌ మణిపాల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ కోర్స్‌ను పూర్తి చేసింది. 15 ఏళ్ల వయసులో మోడలింగ్‌ని ప్రారంభించిన పార్వతి నాయర్ 2012లో నటన రంగంలో అడుగు పెట్టింది. తక్కువ సమయంలోనే కోలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పలువురు ప్రముఖ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంది. తమిళ్‌, మలయాళ సినిమాల్లోనే కాకుండా తెలుగు, కన్నడ భాషల్లోనూ నటించడం ద్వారా మొత్తం అన్ని సౌత్‌ భాషల్లో నటించిన రికార్డ్‌ను ఈ అమ్మడు సొంతం చేసుకుంది. కన్నడంలో డెబ్యూ నటి అవార్డును సొంతం చేసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల కన్నడంలోనూ ఎక్కువ సినిమాలు చేయలేదు.