విషం తాగి చావమంటారా? నటి పావలా శ్యామల ధైన్యం!
శ్యామల మాట్లాడుతూ-''చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోలతో కలిసి నటించాను. వృద్ధాప్యంలో ఉన్నాను.. ధీనస్థితిలో సాయం అందని ధైన్యంలో ఉన్నాను.
By: Tupaki Desk | 11 Jan 2025 2:34 PM GMTదాదాపు 300 సినిమాల్లో నటించారు పావలా శ్యామల. అయినా ఆర్టిస్టుగా తన కష్టాలు తీరలేదు. సంపాదన లేదు.. సంపదలు లేవు. అయినా జీవితాంతం సినీరంగంలో ఒక నటిగా సేవలందించారు. చేస్తున్నది చిన్న పాత్రనా.. పెద్ద పాత్రనా? అన్నది కూడా శ్యామల చూడలేదు. దశాబ్ధాల కెరీర్ లో నాలుగు తరాల స్టార్లను ఆమె చూసారు. కానీ కాలం కరుణ లేనిది. తనకు ఆర్థిక కష్టాలు ఎప్పటికీ అలా వెన్నాడుతూనే ఉన్నాయి. కృష్ణానగర్ కథల్లో తన కథకు చాలా ప్రాముఖ్యత ఉంది. చాలామంది జూనియర్ ఆర్టిస్టుల్లా తాను కూడా అవసాన దశలో అష్టకష్టాలు పడుతోంది.
తాజాగా పావలా శ్యామల తన ధీన స్థితిని మొరపెడుతూ ఒక వీడియోను షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇది అంతర్జాలంలో జోరుగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పావలా శ్యామల తన ధీనావస్తను చూసైనా పరిశ్రమ పెద్దలు ఎవరైనా ఆదుకోవాలని కోరారు. శ్యామల మాట్లాడుతూ-''చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోలతో కలిసి నటించాను. వృద్ధాప్యంలో ఉన్నాను.. ధీనస్థితిలో సాయం అందని ధైన్యంలో ఉన్నాను. నా దగ్గర శక్తి లేదు.. నన్ను ఆదుకోరా? విషం తాగి చనిపోమంటారా? మూడేళ్లుగా అర్థిస్తూనే ఉన్నాను ...'' అని పావలా శ్యామలా తన ఆవేదనను వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
ఈ వీడియోలో మాట్లాడుతున్న పావలా శ్యామల పూర్తిగా వయోభారంతో కనిపించారు. బాగా అలసిపోయి, పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు అర్థమవుతోంది. మాట్లాడేందుకు ఓపిక లేని స్థితిలో పావలా శ్యామల ఉన్నారు. నిలవలేక ఒణుకుతున్న తన శరీరం ఇబ్బందికర స్థితి ఎదుటివారికి తెలిసిపోతోంది. అయితే తన స్థితిని చూసి గతంలో మెగా కుటుంబ హీరోలు సహా పలువురు ఆర్థిక సాయం చేసారు. కానీ బతుకు భారమైన ఈ రోజుల్లో అది సరిపోతుందా? కనీసం ఇప్పటి తన అవస్థను చూసైనా పరిశ్రమ పెద్దలు ఆదుకుంటారేమో చూడాలి.