Begin typing your search above and press return to search.

ఆమెకు అస‌భ్యక‌ర‌ మెసేజ్‌లు.. హీరో అభిమాని హ‌త్య వెన‌క‌!?

అయితే ఈ హ‌త్య వెన‌క ర‌క‌ర‌కాల కోణాల గురించి క‌న్న‌డ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   11 Jun 2024 6:58 PM GMT
ఆమెకు అస‌భ్యక‌ర‌ మెసేజ్‌లు.. హీరో అభిమాని హ‌త్య వెన‌క‌!?
X

త‌న అభిమానిని హ‌త్య చేయించాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌ముఖ క‌న్న‌డ‌ హీరో ద‌ర్శ‌న్ అరెస్ట్ అయిన‌ట్టు క‌న్న‌డ మీడియాలో క‌థ‌నాలు వచ్చిన సంగ‌తి తెలిసిందే. భార్య ఉండ‌గా ప్రియురాలితో హీరో ద‌ర్శ‌న్ షికార్ చేస్తున్నాడంటూ ద‌ర్శ‌న్ పై స‌ద‌రు అభిమాని రేణుకా స్వామి బ‌హిరంగంగా కామెంట్లు చేయ‌డంతో అస‌లు వివాదం మొద‌లైంది. కానీ ఈ కేసులో ఇప్పుడు కొత్త కోణంపై క‌న్న‌డ‌ మీడియా క‌థ‌నాలు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ద‌ర్శ‌న్ ప్రియురాలిగా ప్ర‌చార‌మ‌వుతున్న‌ నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపినందున‌ రేణుకా స్వామిని ద‌ర్శ‌న్ త‌న స‌మ‌క్షంలోనే హ‌త్య చేయించాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇప్ప‌టికే పోలీసులు ద‌ర్శ‌న్ సన్నిహితులు పట్టనగెరె వినయ్, కిరణ్, మధు, లక్ష్మణ్, ఆనంద్, రాఘవేంద్ర సహా 10 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ హ‌త్య వెన‌క ర‌క‌ర‌కాల కోణాల గురించి క‌న్న‌డ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

మృతుడు రేణుకా స్వామి క‌ర్నాట‌క‌ చిత్రదుర్గకు చెందిన మెడికల్ షాపులో పనిచేస్తున్నాడ‌ని స‌మాచారం. అత‌డు ప‌విత్ర‌తో ద‌ర్శ‌న్ ఎఫైర్ ని ప్ర‌శ్నించ‌డం హీరోలో ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంద‌ని, దీనివ‌ల్ల‌నే కొంద‌రి సాయంతో రేణుకా స్వామిని హ‌త్య చేయించాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. ద‌ర్శ‌న్ అరెస్ట్ అనంత‌రం బెంగళూరు నగర కమిషనర్ బి దయానంద మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 9న రేణుకా స్వామి మృతదేహం లభ్యమైందని.. ఈ కేసులో పది మందికి పైగా అరెస్టు చేశామని.. ఒక నటుడిని అదుపులోకి తీసుకున్నామని.. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతుడు రేణుకాస్వామికి 33 ఏళ్లు. తదుపరి విచారణ తర్వాతే మరింత సమాచారం చెప్పగలం! అని, మృతుడు ప‌విత్ర‌కు అవమానకరమైన సందేశాలు పంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని బెంగళూరు నగర కమిషనర్ తెలిపారు.

షూటింగ్ కోసం మైసూరులోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో ఉన్న స‌మ‌యంలో ఉద‌యం 8.30 గం.ల‌కు పోలీసులు ద‌ర్శ‌న్‌ని అరెస్ట్ చేసారు. క‌న్న‌డ‌ మీడియా కథనాల ఆధారంగా, దర్శన్ సహాయకులు కొంద‌రు రేణుకా స్వామిని ద‌ర్శ‌న్ సమక్షంలోనే హత్య చేసి మృతదేహాన్ని కామాక్షి పాళ్య ఏరియాలోని ఒక డ్రైనేజీలో పడవేశారని క‌థ‌నాలొచ్చాయి. పోలీసులు మృతదేహాన్ని గుర్తించినప్పుడు దానిని కుక్కలు తినేశాయి. సమీపంలోని అపార్ట్‌మెంట్‌లోని సెక్యూరిటీ గార్డు గమనించి అధికారులను అప్రమత్తం చేయ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అంతేకాదు మృతుడి శరీరంపై 15 చోట్ల గాయాలున్నాయ‌ని, ముఖంపై దారుణంగా కొట్టార‌ని.. ప్రైవేట్ పార్ట్ పైనా గాయ‌మైంద‌ని స్వామి పోస్ట్ మార్టం వెల్ల‌డించిన‌ట్టు క‌న్న‌డ మీడియా క‌థ‌నాలు ప్ర‌చురించింది.

అంతేకాదు.. లా అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వేగంగా స్పందించి హ‌త్య‌కు గురైన రేణుకా స్వామి కాల్ డిటైల్ రికార్డ్స్ (CDR) ద్వారా చాలా విష‌యాల‌పై ద‌ర్యాప్తు సాగించారు. సైబ‌ర్ క్రైమ్ అధికారులు అతడి సోషల్ మీడియా ఖాతాలను కూడా యాక్సెస్ చేశారు. సామాజిక మాధ్య‌మాల్లో అతడు ద‌ర్శ‌న్ స్నేహితురాలైన‌ పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడ‌ని పోలీసులు చెబుతున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి.

న‌టి కం ఫ్యాష‌న్ డిజైన‌ర్ అయిన పవిత్ర గౌడతో దర్శన్‌కు ఎఫైర్ ఉందని గతంలోను మీడియాలో ప‌లుమార్లు పుకార్లు వచ్చాయి.. కన్నడ నటుడు దర్శన్ భార్య విజయ లక్ష్మి ఆ ఇద్ద‌రి స్నేహంపైనా సీరియ‌స్ గా ఉన్నారు. ఓసారి ప‌విత్ర వివాదాస్పద ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై తీవ్రంగా మండిపడ్డారు. సోష‌ల్ మీడియాల్లో సంజయ్ సింగ్ అనే మరో వ్యక్తితో పవిత్ర ఫోటోలను చూపిస్తూ దర్శన్ భార్య ప్ర‌శ్నించారు. ప‌విత్ర‌ భ‌ర్త‌ నైతిక స్థితిని ప్రశ్నించిన‌ట్టు క‌న్న‌డ మీడియా చెబుతోంది. దీంతో అతడిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఒకానొక సంద‌ర్భంలో ద‌ర్శ‌న్ భార్య ప‌విత్ర‌ను సోష‌ల్ మీడియాల వేదిక‌గా ఇలా ప్ర‌శ్నించారు. ``ఈ స్త్రీ వేరొకరి భర్త ఫోటోని సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేసే ముందు త‌ను స్పృహలోకి రావాలని నేను ఆశిస్తున్నాను. ఇది ఆమె క్యారెక్ట‌ర్ గురించి, నైతిక స్థితి గురించి మాట్లాడుతుంది. ఆ మ‌గాడు వివాహం చేసుకున్నాడని తెలిసి కూడా ఆమె తన వ్యక్తిగత అవసరాలు, ఎజెండా కోసం ప్ర‌తిదీ చేస్తోంది. పవిత్ర- సంజయ్ సింగ్‌ల కుమార్తె ఖుషీ గౌడ ఈ ఫోటోలో ఉంద‌ని స్పష్టంగా చూపిస్తున్నాయి.... నేను సాధారణంగా వ్యక్తిగత సమస్యలపై మాట్లాడేందుకు సోషల్ మీడియాను ఉపయోగించను. కానీ నా కుటుంబ ప్రయోజనాల కోసం నా స్వరాన్ని పెంచాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. మొత్తం సమాజానికి మా కుటుంబంపై భిన్నమైన దృష్టిని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం`` అని రాసారు.

పవిత్ర - దర్శన్ 10 సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని కూడా క‌న్న‌డ మీడియాల్లో క‌థ‌నాలొస్తున్నాయి. నవంబర్ 2024 లో ప‌విత్ర‌ తన కుమార్తె ఖుషి పుట్టినరోజు వేడుక నుండి ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఆ వీడియోలో దర్శన్ కేక్ కట్ చేసి ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తూ క‌నిపించాడు. దీనిని ద‌ర్శ‌న్ భార్య విజ‌య‌ల‌క్ష్మి స‌హించ‌లేక‌పోయారని కూడా క‌థ‌నాలొచ్చాయి.

ప‌విత్ర గౌడ ఎవ‌రు?

పవిత్ర గౌడ కన్నడ సినీ పరిశ్రమలో నటి కం ఫ్యాషన్ డిజైనర్. న‌టిగా రాణిస్తున్నారు. 2016 సంవత్సరంలో 54321 అనే చిత్రంతో డెబ్యూ న‌టిగా క‌న్న‌డ చిత్ర‌సీమ‌లో కెరీర్ ప్రారంభించింది. చత్రిగాలు సార్ చత్రిగాలు, ఆగమ్య, సాగువ దారియాలి అనే చిత్రాల్లో నటించారు. న‌టిగానే కాదు.. ప‌విత్ర‌ ఫ్యాషన్ డిజైనర్‌గాను రాణిస్తున్నారు. బెంగళూరులో రెడ్ కార్పెట్ స్టూడియో అనే ఫ్యాషన్ డిజైనర్ స్టూడియోను నిర్వహిస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌లో ఈ స్టూడియో డిజైన‌ర్ దుస్తుల‌కు మంచి డిమాండ్ ఉంద‌ని తెలిసింది. అయితే ప‌విత్ర‌కు భ‌ర్త‌తో కాపురంలో క‌ల‌త‌లు ఉన్నాయ‌ని, వారికి ఒక కుమార్తె ఉంద‌ని కూడా క‌న్న‌డ మీడియాల్లో క‌థ‌నాలొస్తున్నాయి.