అభిమానికి పవన్ దారిచ్చేస్తున్నట్లేనా?
కానీ నిర్మాత ఏఎం రత్నం మాత్రం మార్చి 28కి సినిమా రావడం ఖాయమనే చెప్పారు.
By: Tupaki Desk | 24 Feb 2025 3:32 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా 'హరి హర వీరమల్లు' విడుదల కోసం అభిమానులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ ఆ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఏపీలో ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం పదవి చేపట్టాక కొన్ని నెలల పాటు పాలన మీద దృష్టిసారించిన పవన్.. ఈ మధ్యే మళ్లీ ముఖానికి రంగేసుకున్నారు. తన సినిమాలు మూడు పెండింగ్‌లో ఉన్నప్పటికీ రీఎంట్రీలో ముందుగా ఆయన డేట్లు ఇచ్చింది 'హరిహర..'కే. వీలు చేసుకుని కొన్ని రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్నప్పటికీ ఇంకా ఈ చిత్ర షూటింగ్ ఒక కొలిక్కి రాలేదు. మేకర్స్ ఏమో మార్చి 28కి రిలీజ్ డేట్ ఇచ్చేశారు. మెల్లగా ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. నితిన్ సినిమా 'రాబిన్ హుడ్'కు కూడా అదే డేట్ ఇవ్వడంతో 'వీరమల్లు' రాదేమో అన్న సందేహాలు కలిగాయి. కానీ నిర్మాత ఏఎం రత్నం మాత్రం మార్చి 28కి సినిమా రావడం ఖాయమనే చెప్పారు.
ఐతే విడుదలకు అటు ఇటుగా ఇంకో నెల రోజులే సమయం ఉండగా.. ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఎప్పుడు గుమ్మడి కాయ కొడతారు అన్నదానిపై క్లారిటీ లేదు. చిత్ర బృందమేమో ఫస్టాఫ్ వరకు ఎడిటింగ్ పూర్తి చేసుకుని సెకండాఫ్ ఔట్ పుట్ కోసం ఎదురు చూస్తోంది. ఐతే ప్రస్తుతం పవన్ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రోజుల పాటు జ్వరం, నడుము నొప్పితో ఆయన ఇంటికి పరిమితం అయ్యారు. తర్వాత సనాతన యాత్ర చేశారు. తాజాగా ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుని చికిత్స చేయించుకుంటున్నారు. ఓవైపు మంత్రిగా బాధ్యతలు, ఇంకోవైపు షూటింగ్‌లో పాల్గొనడంతో పవన్ బాగా అలసిపోయినట్లు, ఆరోగ్యం దెబ్బ తిన్నట్లు చెబుతున్నారు. ఆయన కొన్ని వారాల పాటు చిత్రీకరణలో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. కాబట్టి 'హరి హర..'ను మార్చి నెలాఖరుకు రెడీ చేసే అవకాశం లేనట్లే. కాబట్టి పవన్ సినిమా రావాల్సిన రోజు.. ఆయన అభిమాని నితిన్ మూవీ రావడం పక్కా అని అంటున్నారు.