Begin typing your search above and press return to search.

పవన్ తో మరో సమస్య.. వీరమల్లు మళ్ళీ అనుమానమే?

సినిమా ఫస్ట్‌హాఫ్ పూర్తయింది. రీ-రికార్డింగ్‌తో సహా మొత్తం ప్రీ ప్రొడక్షన్ పనులు సెట్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   17 Feb 2025 6:54 AM GMT
పవన్ తో మరో సమస్య.. వీరమల్లు మళ్ళీ అనుమానమే?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా క్రిష్‌/జ్యోతిక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు సినిమాపై ఫ్యాన్స్ లో అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం మొదట ఏడాది క్రితమే విడుదల కావాల్సి ఉండగా, అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు మార్చి 28 అని విడుదల తేదీను చిత్రయూనిట్ ఖరారు చేసినా, తాజా పరిస్థితులు చూస్తే మరోసారి ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉండదని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సినిమా ఫస్ట్‌హాఫ్ పూర్తయింది. రీ-రికార్డింగ్‌తో సహా మొత్తం ప్రీ ప్రొడక్షన్ పనులు సెట్ అయ్యాయి. అయితే, సినిమా మొత్తం రెడీ అయినా ఒక కీలక సన్నివేశం చిత్రీకరించాల్సి ఉంది. ఈ సీన్ సినిమా మొత్తానికి కీలకమన్న విషయం బలంగా వినిపిస్తోంది. ఈ సన్నివేశం లేకుండా సినిమా పూర్తి అవ్వదని చిత్రబృందం స్పష్టంగా తెలిపింది. కానీ, దీనికోసం పవన్ కళ్యాణ్‌ డేట్లు ఇప్పట్లో దొరకేలా కనిపించట్లేదు. ఆయన ప్రస్తుతం పూర్తిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రాజకీయ విధుల కోసం పూర్తిగా సమయం కేటాయించాల్సి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో, సినిమాకు పవన్ ఏ స్థాయిలో సమయం కేటాయిస్తారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ముందుగా మార్చి రెండో వారం వరకు షూటింగ్‌కి డేట్స్‌ ఇస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ, రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ షెడ్యూల్‌లో మార్పులు రావచ్చు. ఒకవేళ ఆయన అప్పటికే చెప్పినట్లుగా డేట్స్ ఇచ్చినా, అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి అవుతుందా అనేది ప్రశ్నగా మారింది. పవన్‌ షెడ్యూల్‌ లేట్ అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, పవన్ సినిమాకు అంత సమయం కేటాయించలేకపోతే, సినిమాను మరోసారి వెనక్కి జరపాల్సి రావొచ్చని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మళ్లీ వాయిదా పడితే అభిమానుల్లో నిరాశ పెరుగుతుందని మేకర్స్ కూడా బాగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి, హరి హర వీరమల్లు విడుదల గడువు దగ్గర పడుతున్నప్పటికీ, పవన్ కళ్యాణ్‌ డేట్స్‌ సమస్య సినిమా షెడ్యూల్‌పై ప్రభావం చూపిస్తోంది. పవన్ రాజకీయ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుంటూ, ఆయన ఎప్పుడు షూటింగ్‌కి వస్తారనే విషయాన్ని అనుసరించి సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్లాన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మార్చి 28న విడుదల సాధ్యమా? లేక మరోసారి వాయిదా పడతుందా? అనేది త్వ‌ర‌లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.